రెండు మండలాలు..రాసిచ్చేస్తా... | ration rice scham in prakasam district | Sakshi
Sakshi News home page

రెండు మండలాలు..రాసిచ్చేస్తా...

Published Wed, Apr 20 2016 11:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

రెండు మండలాలు..రాసిచ్చేస్తా... - Sakshi

రెండు మండలాలు..రాసిచ్చేస్తా...

 -అడ్డువచ్చిన వారి తోక కత్తిరిస్తా...
 -ఈ డీల్ కుదిర్చినందుకు నాకు ఎంత ఇస్తావ్...
 -నీవు కాదంటే చెప్పు వేరేవారికిచ్చేస్తా
  -పౌర సరఫరాల సరుకు పక్కదారిపై మంతనాలు
 -అధికార పార్టీ యువనేతే వ్యూహకర్త
 -‘సాక్షి’ చేతికి చిక్కిన ఆడియో సంభాషణ

 
'రెండు మండలాలు నీకు అప్పగిస్తాను. ఎవరైనా తోక జాడిస్తే నాతో చెప్పు అడ్డంగా తోక కత్తిరించేస్తా... నీ దోపిడీకి రహదారి వేసినందుకు నాకెంత ఇస్తావు... ముందుగా అది తేల్చు ... నాపై బాగా ఒత్తిళ్లున్నాయి. నువ్వు ఏ విషయం తేల్చకపోతే నేను నా వాళ్లకు అప్పగించేస్తాను...ఇదీ ప్రకాశం జిల్లా ఎస్.ఎన్.పాడు మండలంలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తితో యువనేత బేరసారాలు. దీనికి ఒక రేషన్ డీలర్ల అసోసియేషన్ నేత మధ్యవర్తిగా వ్యవహరించి కథ నడిపించాడు. ఆ సంభాషణ ఏ రీతిలో సాగిందంటే...'

సాక్షి, టాస్క్‌ఫోర్స్: పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టడానికి పెద్ద ప్రభుత్వ యంత్రాంగమే ఉంది. అయినా బొక్కసానికి బొరియలు పడుతూనే ఉన్నారు. ఈ బొరియలు కప్పడానికి ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి కిరీటం పెట్టింది. సరిదిద్దాల్సింది పోయి బేరసారాలకు దిగుతున్నారు ... అరికట్టాల్సింది పోయి అడ్డంగా దోచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు ... అధికారం మాదే అడ్డొచ్చినవాడెవడంటూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ... పేదలకు, మధ్య తరగతికి అందాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారు ... బొక్కసానికి కన్నం వేస్తున్నారు. పంచాయితీ పెట్టి మరీ పంచుకుంటున్నారు. అదెలా అంటే...
 
అక్రమ రవాణాదారుడు: ఈపాస్ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది. అంత రావడం లేదు.
యువనేత:  ఈ పాస్ వల్ల డీలర్లకు ఆదాయం కొంచెం తగ్గిన మాట నిజమే. గతంలో ఒక షాపులో ఆరు వందలు కార్డులుంటే మూడు వందల కార్డులు అమ్ముకున్నారు. ఇప్పుడు రెండు వందల నుంచి 250 వరకూ అమ్ముతున్నారు. టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది. చీమకుర్తిలో 900 టన్నులు బియ్యం రవాణా జరుగుతుంటే గతంలో 300 వందల టన్నులు అమ్ముకునేవారు. ఇప్పుడు 200 నుంచి 250  టన్నులు పక్కదారి పడుతోంది. ట్రాన్స్‌పోర్టు మొత్తం ఇవ్వు. కిలోకి రూపాయి ఇస్తావా? ఎక్కడ బియ్యం ఎంత వస్తుందో నాకు తెలుసు. ఇవన్నీ కాదు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు? (మాటల్లో కొంత అసహనం)...
ఈ వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులున్నాయి? ఎక్కడైనా లారీ పట్టుబడితే బయటపడడానికి ఎన్ని చిక్కులు...ఆ చిక్కు ముడులు విప్పాలంటే ఏమి చేయూలో సుదీర్ఘంగా ముగ్గురి మధ్య చర్చ జరిగింది.

యువనేత: నాపై చాలా ప్రెజర్ వస్తోంది...అడగడానికి భయపడాల్సిన వారు కూడా నా వద్దకు వచ్చి నాకు నాలుగు షాపులు ఇప్పించమని అడుగుతున్నారు. బంధుత్వాలు, పార్టీని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నారు. ఇంతకు ముందే చీమకుర్తికి చెందిన వ్యక్తి ట్రాన్స్‌పోర్టు కావాలని అడిగి వెళ్లాడు. ట్రాన్స్‌పోర్టు వర్క్ అవుట్ కాదని చెప్పాను. ట్రాన్స్‌పోర్టు ఉంటే డీలర్లతో సంబంధాలు ఉంటాయని చెబుతున్నాడు.

మధ్యవర్తి: పెద్ద మనసు చేసుకో? పార్టీ మనిషిగా ఇతనికే ఇప్పించు. మొదటి నుంచీ పార్టీకి నమ్ముకున్నోడు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీలోకి వచ్చినవారు కాదు. అలా అని నీ సొంత మండలంలోకి వచ్చి దర్పం ప్రదర్శించేవాడు కాదు. వయా మీడియాగా అతనికి వచ్చేలా చూడు. ఏం చేయాలో నువ్వే చెప్పు

యువనేత: ప్రతి నెలా 15 లారీలు వచ్చాయ్...20 వచ్చాయ్... ఈ పంచాయితీలు నాకనవసరం. సింగిల్ టెండర్ వేయిస్తాను. రెండు మండలాల్లో కొనుక్కొని, టెండర్ చేజిక్కించుకోమను. నెలకు ఎంత ఇస్తావు స్ట్రయిట్‌గా చెప్పు అని అడిగాను.  ట్రాన్స్‌పోర్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోలుతాను. కిలోకు రూపాయి చొప్పున మీ కుర్రోళ్లకు ఇస్తానని ఒకతను నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడున్న వారి సంగతి తేల్చకుండా ఇవ్వడం కరెక్టు కాదని పెండింగ్ పెట్టా. ట్రాన్స్‌పోర్టు టెండర్ లేకుండా చేయిస్తా. నువ్వు ఎంతకైనా కొనుక్కో. రూ.12, రూ.13, రూ.15... ఎంతైనా. వంద టన్నులు కొనుక్కో.. లేకపోతే రెండు వందల టన్నులు కొనుక్కో. నీ ఇష్టం అది నాకు సంబంధం లేదు అని చెప్పాను.

మధ్యవర్తి: ఇది మంచి ప్రతిపాదనే కదా...
అక్రమ రవాణాదారుడు : మా వాళ్లను కనుక్కుని చెబుతానని చెప్పా. మా వారితో మాట్లాడితే అంత ఆదాయం రావడం లేదన్నారు. తెల్లగుడిపాడు వారు వేరే వారికి తోలుతున్నారని చెప్పారు. ఎన్ని వస్తున్నాయో చెప్పమని అడిగాను. ట్రాన్స్‌పోర్టు మొత్తం వారిని తీసుకోవాలని చెప్పు.. లేదంటే బియ్యం రెండు మూడు బళ్లు ఆయన చెప్పిన వారికి పంపిస్తానని మావాడు చెప్పాడు.
మధ్యవర్తి: ఇదంతా అనవసరం. ట్రాన్స్‌పోర్టు ఎంత వస్తుంది.

అక్రమ రవాణాదారుడు: 50 నుంచి 55 వేలు వస్తుంది.
మధ్యవర్తి: ట్రాన్స్‌పోర్టు ఇతనే చేస్తాడు. బిల్లు నువ్వు తీసుకో. నెలకి ఇంతని చెప్పి సెటిల్ చేసుకో...
యువనేత:  త్వరలోనే సంతనూతల పాడు, చీమకుర్తి డీలర్ల సమావేశం పెట్టి వారికి కూడా చెబుతాను.
మధ్యవర్తి: మిల్లర్లతో కూడా ఇబ్బందులుంటాయి. కొంతమంది పక్క మండలాల్లో కూడా వేలు పెడుతున్నారు. వారికి నువ్వు గట్టిగా చెప్పాలి.
యువనేత: ట్రాన్స్‌పోర్టు నీకు ఇప్పిస్తాం. డీటీకి చెప్పేస్తాను. ట్రాన్స్‌పోర్టు డబ్బులు మా కుర్రాళ్లకు ఇచ్చేయి. ఇంకా నెలకు ఎంత ఇస్తావో తేల్చి చెప్పు....


యువనేత, మధ్యవర్తి, అక్రమ రవాణాదారుడి మధ్య చర్చల అనంతరం...ట్రాన్స్‌పోర్టు బిల్లు కాకుండా మరికొంత మొత్తం నెలనెలా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒక మండలంలో బయటపడిన తంతు మాత్రమే ఇది. మిగిలిన మండలాల్లో ఇదే తరహా అక్రమాలకు తెరదీస్తున్నారు... అధికార దాహంతో జిల్లాను దోచేస్తున్నారు.

యువనేత: ఏడేళ్ల నుంచి టీడీపీ బాధ్యతలు నేనే మోస్తున్నాను. ఈ రోజు డిపార్టుమెంట్‌లో ఉండి నా మనుషులకు, నాకు న్యాయం చేసుకోలేకపోతే ఎలా? నా పొజిషన్‌లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇతనికి నాలుగు రోజుల కిందట మూడు ఆప్షన్స్ ఇచ్చాను. నువ్వే డిసైడ్ చేసుకోవాలని చెప్పాను.  ఇంకో సెంటర్ వెతుక్కో. సంతనూతలపాడు.. చీమకుర్తి వదిలేసెయ్... ఇది ఫస్ట్ ఆప్షన్... అలా కాదంటే తోలడం మావాళ్లే చేస్తారు. అన్ని షాపుల నుంచి కలెక్షన్ ఎలా చేయాలో వారే చేస్తారు. వారే అమ్ముకుంటారు. నీకు ఏ సంబంధం లేదు. ట్రాన్స్‌పోర్టు నువ్వే ... తోలేదీ నువ్వే ... ఎంత కొనుక్కుంటావో కొనుక్కో. వంద కొనుక్కుంటావో, నూటయాభై కొనుక్కుంటావో నీ ఇష్టం. నా సంగతి ఏం చేస్తావ్. ఆప్షన్ నీదే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement