‘రియల్’ భూదోపిడీ!
‘రియల్’ భూదోపిడీ!
Published Tue, Sep 6 2016 8:51 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
* అభివృద్ధి అంతా విజయవాడ వైపే
* చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు
పాత గుంటూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల భూములను సేకరించారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం కాదని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు విమర్శించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు వేల ఎకరాలతో పూర్తయ్యే రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు సేకరించారో ఇప్పటికే రైతులకు అర్థమయిందన్నారు. ఇతర దేశాలకు భూములను తాకట్టు పెట్టి ఆర్థికంగా లబ్ధిపొందేందుకే టీడీపీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అభివృధ్ధి అంతా విజయవాడ, విశాఖ పట్టణాలకే పరిమితం చేశారని, రాజధాని ప్రకటన తర్వాత గుంటూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా తమ స్వప్రయోజనాల కోసం ప్యాకేజీలు అడుగుతున్నారన్నారు. ప్రత్యేక హోదాను సాధించకపోతే చరిత్రహీనులవుతారని విమర్శించారు. ఇప్పటికైనా మాయమాటలతో కాలయాపన చేయకుండా ప్రతిపక్షాలను కలుపుకొని ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ పోరాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు షరాబ్ కృష్ణమూర్తి. కార్యదర్శులు గొల్లపూడి రాంబాబు. రంగా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement