పని ఎక్కువ.. జీతం తక్కువ | Savarkarabharat co ordinators are the worst wages. | Sakshi
Sakshi News home page

పని ఎక్కువ.. జీతం తక్కువ

Published Sat, Jun 10 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

పని ఎక్కువ.. జీతం తక్కువ

పని ఎక్కువ.. జీతం తక్కువ

అరకొర వేతనాలతో బతుకీడుస్తున్నసాక్షరభారత్‌ కోఆర్డినేటర్లు
పెండింగ్‌లో ఏడాది జీతం
ఆదుకోవాలని వేడుకోలు

సూర్యాపేటరూరల్‌: నిరక్షరాస్యులకు చదువు నేర్పించేందుకు నియమించిన సాక్షరభారత్‌ కో ఆర్డినేటర్లను వేతన కష్టాలు వెక్కిరిస్తున్నాయి. పార్ట్‌టైం పేరుతో నియమించబడిన సిబ్బందిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యులను చేస్తున్నారు. దీంతో వీరు ఫుల్‌ టైం పని చేయాల్సి వస్తోంది. పొద్దస్తమానం పని చేస్తున్నా.. వీరికి అందే వేతనం మాత్రం అరకొరగానే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అందరి వేతనాలనూ పెంచుతూ తమను మాత్రం పట్టించుకోవడం లేదని సాక్షరభారత్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వయోజనులను అక్షరాస్యులుగా చేయాలనే ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం ప్రతి గ్రామపంచాయతీకి ఇద్దరు కో ఆర్డినేటర్లను, మండలానికి ఒక మండల కో ఆర్డినేటర్‌ను నియమించారు. సూర్యాపేట మండలంలో 18 గ్రామపంచాయతీలకుగాను 36 మందిని నియమించారు. వీరిలో గ్రామ కో అర్డినేటర్లకు నెలకు రూ.2000, మండల కో ఆర్డినేటర్‌కు రూ.6 వేల వేతనం అందిస్తున్నారు.

ఫుల్‌ టైం పని...
కో ఆర్డినేటర్లు పార్ట్‌టైంగా పని చేస్తున్నారన్న కారణంతో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే చాలా చోట్ల సాక్షరభారత్‌ సిబ్బందిని ఫుల్‌టైం వాడుకుంటున్నారు. కేంద్రాల్లో నిరక్షరాస్యులకు విద్యాబోధన చేయడంతో పాటు ప్రభుత్వ పరంగా వివిధ శాఖల తరుపున జరిగే సర్వేలు, ఇతర కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ పనులు చేయిస్తున్నారు. 20 రోజులగా రైతుల సమగ్ర సర్వేలో వారి భాగస్వామ్యం కీలకమే.

సకాలంలో అందని వేతనాలు..
సాక్షరభారత్‌లో పనిచేసే సిబ్బందికి ఏనాడూ సకాలంలో వేతనాలు అందలేదు. ఆరేడు నెలలకోసారి వేతనాలిస్తారు. ఒక్కోసారి ఏడాదైనా వేతనం అందదు. ప్రస్తుతం గ్రామ కో ఆర్డినేటర్లకు గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనాలు చెల్లించలేదు. మండల కో ఆర్డినేటర్లకు ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని కో ఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లకు రూ.10వేలు, మండల కో ఆర్డినేటర్‌కు రూ.15 వేలు కనీస వేతనం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

వేతనాలు పెంచాలి..
సాక్షరభారత్‌ మండల కో ఆర్డినేటర్‌గా ఫుల్‌టైం పని చేయాల్సి వస్తుంది. ఇతర ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా వేతనాలు పెంచాలి. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనం అమలయ్యేలా చూడాలి.
– మిడనతనపల్లి సురేష్, సాక్షరభారత్‌ కోఆర్డినేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రతి నెలా వేతనం చెల్లించాలి..
మాకు చెల్లించే అరకోర వేతనాలైనా.. ప్రతి నెల సకాలంలో చెల్లించాలి. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో.. తీవ్ర  ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం అందిరి మాదిరే మాకు కూడా వేతనాలు పెంచి ప్రతి నెలా ఇస్తే బాగుంటుంది.
– ఎడ్ల వెంకన్న, గ్రామ కో ఆర్డినేటర్,రాయినిగూడెం

Advertisement
Advertisement