ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
- ఆర్‌అండ్‌బీ అధికారులకు తుమ్మల ఆదేశం
గండుగులపల్లి(దమ్మపేట):జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్‌అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధి శాఖ అధికారులను ఆదేశించారు.మంగళవారం గండుగులపల్లిలోని తన నివాసంలో మంత్రి తుమ్మలను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ లింగయ్య, ఈఈ రవీంద్రకుమార్,డీఈఈలు తానేశ్వర్, మనోహర్‌లు›కలిశారు. ఈ సందర్భంగా వారితో మంత్రి మాట్లాడుతూ కల్లూరు నుంచి ఊటుకూరు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన అధికారులను ప్రశ్నిస్తూ వర్షాలు వచ్చే వరకు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరితహారంలో అటవీశాఖ ముందుండాలి..
హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ముందు వరుసలో ఉండాలని దమ్మపేట, సత్తుపల్లి అటవీశాఖ రేంజర్లు శ్రీనివాస్, నాగసాయి ప్రసాద్‌లకు సూచించారు. అటవీ భూముల్లో జామాయిల్ ప్లాంటేషన్లు తగ్గించి,అడవి మొక్కలనే నాటాలని ఆదేశించారు. ములకలపల్లి మాజీ ఎంపీపీ కీసర లక్ష్మణరావు మంగళిగుట్ట నుంచి బూరుగువాయి వరకు రోడ్డు నిర్మాణం చేయాలని మంత్రిని కోరారు.మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, యువజన విభాగం నాయకులు కాసాని నాగప్రసాద్, తాటి బొజ్జి, కురిశెట్టి సత్తిబాబు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు తదితరులున్నారు.