అవార్డు ఎంపికల్లో అసంతృప్తి
అవార్డు ఎంపికల్లో అసంతృప్తి
Published Wed, Sep 7 2016 10:53 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ అర్బన్ : జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 70 మందిని ఎంపిక చేశారు. ఈ ఎంపిక సక్రమంగా లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇతర శాఖల వారు ప్రతిపాదించిన వారికి అవార్డులు ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కనీస అర్హతలను పట్టించుకోకుండా అనర్హతలకు ఎంపిక చేయడంపై వివాదాస్పద మవుతోంది. సంఘాల నాయకులు నిరసనలు చేయాలని నిర్ణయించారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో ఈ ఏడాది 70 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసేందుకు మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి దరఖాస్తులను పరిశీలించాలి. అర్హత గల వారిని గుర్తించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయాలి. ఈ ఏడాది కూడా ఇదే ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల కోసం జిల్లా వ్యాప్తంగా 39 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎంఈవో, ఉపవిద్యాధికారులు 26 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు.
తుది నివేదిక కలెక్టర్‌కు చేరడంతో అక్కడ మార్పులు, చేర్పులు జరిగాయి. 26 మందితో ఉన్న నివేదిక 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్ధమైంది. ఇందులో కలెక్టర్ అవార్డు ఎంపికలో మరుగుదొడ్ల నిర్మాణానికి విశేష కృషి చేసిన వారిని, హరితహారంలో ముందు ఉన్న వారిని, వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన వారిని, పాఠశాలల్లో ల్యాబ్‌ల నిర్వహణ ఉన్నవారిని ఎంపిక చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగానే ఉత్తమ ఉపాధ్యాయుల నివేదిక 70 మందికి చేరింది. ఇందులో హరితహారంలో కృషి చేసినందుకు డ్వామా నుంచి ఐదుగురు ఉపాధ్యాయులను ప్రతిపాదించారు.
హరితహారం పరిశీలకులు శ్రీహరి నుంచి పది మంది ఉపాధ్యాయులను.. జవహార్‌బాల ఆరోగ్య రక్షలో భాగంగా వైద్య ఆరోగ్య నుంచి పది మంది టీచర్లను ప్రతిపాదించారు. వీరిని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. ఇందులో అవార్డుకు సంబంధించి కనీస అర్హతలను గుర్తించలేదు. విశేషమేమిటంటే జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన 26 మందిలో ఒక్కరికి కూడా ఉత్తమ అవార్డు లభించలేదు. 70 మందిలో 69 మంది ఉన్నత పాఠశాలలలకు చెందిన ఉపాధ్యాయులే ఉన్నారు.
ఒక్కరు మాత్రమే యుపీఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఉన్నాడు. మరోవైపు ఆర్మూర్ మండలానికి ఏకంగా 15 మంది ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. మాక్లూర్, ఎల్లారెడ్డి, ఎడపల్లి, వేల్పూరు, తాడ్వాయి మండలాలకు ఒక్కరు చొప్పున ఉత్తమ అవార్డుగా ఎంపికయ్యారు. కొన్ని మండలాలకు సంబంధించి ఐదుకు లోబడే అవార్డులు ఎంపిక కావడం గమనార్హం. ఉత్తమ అవార్డుకు సంబంధించి ప్రతిభను, విద్యాబోధన పరిగణలోకి తీసుకోకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
నిరసనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు
ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖకు సంబంధం లేకుండా ఇతర శాఖలకు సంబంధించి వారు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అవార్డు ఎంపికకు సంబంధించి పునపరిశీలన జరుగాలని కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది.
అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ముందుకు పోనున్నట్లు కమిటీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం నిర్వహించారు. తక్షణమే అవార్డు ఎంపిక విధానంను వ్యతిరేకించాలని.. ఎంపిక విధానం మళ్లీ నిర్వహించేలా పోరాటం చేయాలని నిర్ణయించారు.
పునఃపరిశీలన చేయండి..
ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ఎంపికలో అధికారులు పునఃపరిశీలన చేయాలి. విద్యాశాఖ ద్వారానే ఎంపిక చేయాలి. ఎప్పటిలాగే నిబంధనల ప్రకారం అవార్డుల ఎంపిక జరగాలి. ప్రస్తుతం ఎంపిక విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం.
– శంకర్, టీటీజేఏసీ చైర్మన్
ఉత్తమ ఉపాధ్యాయులకు అన్యాయం..
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఇతర శాఖల జోక్యం వల్ల అసలైన ఉత్తమ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. ఎప్పటిలాగే అవార్డు ఎంపిక జరగాలి. ఎక్కువ మంది ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం సమంజసమే. కానీ.. విద్యాశాఖ ఎంపిక చేస్తే బాగుంటుంది.
– కమలాకర్‌రావు, పీఆర్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి
Advertisement
Advertisement