గేట్లు ఎత్తడంతో ఉధతంగా ప్రవహిస్తున్న తాలిపేరు
- జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు
- సాగు చేసిన మెట్ట పంటలకు ఊపిరి
- అత్యధికంగా కొత్తగూడెంలో 9.6 సెం.మీ. వర్షపాతం
- తాలిపేరు తొమ్మిది గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల
సాక్షిప్రతినిధి, ఖమ్మం : మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతులు సాగు చేసిన మెట్ట పంటలకు ఊపిరి పోసినట్లయింది. నైరుతి రుతుపవనాలు తొలకరితో పలకరించినట్లే పలకరించి.. వెనక్కు తగ్గాయి. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. వేల హెక్టార్లలో ఎండిపోయే దశకు చేరుకున్న పంటలకు ఈ వర్షం జీవం పోసింది. మంగళవారం రాత్రి జిల్లాలోని కొత్తగూడెంలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెంతోపాటు తల్లాడ, బోనకల్, ఇల్లెందు, ములకలపల్లి, గార్ల తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తొలకరిలో కురిసిన వర్షాలతో రైతులు ఆనందంతో పంటల సాగు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వరి పంటను 65,337 హెక్టార్లు, మొక్కజొన్నను 13,428 హెక్టార్లు, పెసర 25,624 హెక్టార్లు, కంది 8,935 హెక్టార్లు, సోయాబీన్ 140 హెక్టార్లు, పత్తి 1, 18,472 హెక్టార్లలో సాగు చేశారు. అయితే పంటలు వేసిన తర్వాత సరైన వర్షాలు కురవక పోవడంతో వరి 181 హెక్టార్లలో, పెసర 2,177 హెక్టార్లు, సోయాబీన్ 120 హెక్టార్లలో పంటను నష్టపోయారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో 2,478 హెక్టార్లు ఎండిపోగా, మరో 12,611 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. వాటిలో వరి, మొక్కజొన్న, పెసర, కంది, సోయాబీన్, పత్తి పంటలున్నాయి. ఏజెన్సీలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందుల్లో కుంటలు, చెరువులు జలకళతో కళకళలాడుతున్నాయి. కామేపల్లిలోని బుగ్గవాగు, నిమ్మవాగు, కామేపల్లి పెద్దవాగుల్లోకి నీరు చేరింది. బయ్యారం పెద్ద చెరువు భారీ వర్షానికి అలుగు పోస్తోంది. కొత్తగూడెంలో ముర్రేడువాగులో నీరు ప్రవహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి 21,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది.
తాలిపేరుకు భారీ వరద
చర్ల: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 25 క్రషర్ గేట్లలో తొమ్మిది గేట్లను మూడు అడుగుల చొప్పున ఎత్తి ఉంచి 21,600 క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని అటవీప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 21,915 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా, 21,600 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి మరింతగా వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. భారీగా వస్తున్న వరదకు తాలిపేరు వాగు ఉధతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా, వరద ఉధతిని దష్టిలో ఉంచుకొని నీటి మట్టాన్ని 73.45 మీటర్ల వద్ద స్థిరంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.