:కాశీపేట వద్ద ఉభాలు కాని భూములు
వర్షాభావం వెంటాడుతోంది
Published Thu, Aug 11 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
నారుపోసి 30 రోజులైనా పూర్తవని ఉభాలు
ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకం
పంట కోసం రూ.లక్షల పెట్టుబడి
అన్నదాతల ఆందోళన
సీతానగరం: వర్షాభావం వెంటాడుతోంది. పొలాల్లో తడారిపోతోంది. ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్ధకమవుతోంది. రైతాంగానికి వేదన మిగులుతోంది. వరినారు వేసిన సమయంలో వర్షాలు కురవడంతో అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి నారు పోసారు. నారుపోసి 30 రోజులు గడుస్తున్నా ఉభాలకు నీటి సౌకర్యం కల్పించక, వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో వర్షాధారంగా వరి పండించే గాదెలవలస, జానుమల్లువలస, ఏగోటివలస, దయానిధిపురం, పూను బుచ్చింపేట, కోటసీతారాంపురం, రంగంపేట, అనంతరాయుడుపేట తదితర గ్రామాల్లో రైతులు రూ.లక్షల పెట్టుబడితో దమ్ములు చేసి ఉభాలు పూర్తి చేశారు. వర్షాలు కురవక పోవడం, వరినాట్లు వేసిన భూములు నీరులేక ఆరిపోవడంతో చెరువులు, కాలువల్లోని సాగునీటిని ఆయిల్ ఇంజిన్లతో సరఫరా చేసి తడుపు కోవల్సి వచ్చింది.
500 ఎకరాల్లో పూర్తవని ఉభాలు
సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో 3,670 ఎకరాలకు సాగునీరందించాలని పాలక వర్గం నిర్ణయించగా 500 ఎకరాలకు సాగునీరందక ఉభాలు కాలేదు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో 1971 హెక్టార్లలో వరిపంట సాగవుతుండగా 1225 హెక్టార్లలో నాట్లు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయినా చెరువులకు నీరు సరఫరా చేసిన దాఖలాల్లేవు. దీంతో ఆగస్టు నెలలో పుష్కలంగా నీరుండాల్సిన చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. సీతానగరం ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్.వెంకంపేట, కాశీపేట, పణుకుపేట గ్రామాలకు కాలువ నీరు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఉభాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఉభాలు కాని రైతులకు ఇన్‌పుట్ రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకూ అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నీరు విడుదల చేస్తాం: తెంటు వెంకటప్పలనాయుడు, సీతానగరం ప్రాజెక్ట్ చైర్మన్
వర్షాలు తక్కువగా కురవడంతో ఎగువ గ్రామాల రైతులు ఉభాలు చేస్తున్నందున దిగువ భూములకు నీరందించడం ఆలస్యమైంది. రెండు రోజుల్లో దిగువ గ్రామాల భూముల్లో ఉభాలకు అవసరమైన నీరు విడుదల చేస్తాం.
వథాగా వీఆర్‌ఎస్ మిగులు జలాలు: వై.సింహాచలం, రైతు, జానుమల్లువలస
వీఆర్‌ఎస్ మిగులు జలాలు వథాగా పోతున్నాయి. కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి వర్షాధార భూములకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలి.
Advertisement