తల్లి మందలించిందని కుమార్తె ....
శ్రీకాకుళం జిల్లా : చెప్పిన పని చేయలేదని తల్లి మందలించినందుకు మనస్తాపానికి గురైన కుమార్తె చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకొంది. లింగాలవలస పంచాయతీ పరిధి బొబ్బాదిపేట గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ట్రైనీ ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది సత్యం, చిన్నమ్మడు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరు వెంకటాపురం గ్రామంలో టిఫిన్ కొట్టు నడుపుతూ జీవిస్తున్నారు. సోమవారం ఉదయం టిఫిన్ కొట్టుకు వెళ్తూ బొబ్బాది చిన్నమ్మడు పెద్ద కుమార్తె మౌనిక(16)ను చెట్నీ చేసి కొట్టుకు తెమ్మని చెప్పి వెళ్లింది. మౌనిక ఎంతకీ చెట్నీ తేకపోవడంతో చిన్నమ్మడు ఇంటికి వచ్చి గట్టిగా మందలించి తిరిగి కొట్టుకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగింది.
తరువాత కొట్టుకు వెళ్లి తల్లికి చె ప్పింది. వెంటనే తల్లిదండ్రులు మౌనికను వెంకటాపురం గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకువెళ్లగా ఆయన చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో విజయనగరం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్‌ఐ చిరంజీవి, పీసీలు ఉమా, మీనాలు విజయనగరం వెళ్లి మౌనిక మృతదేహాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు.
మౌనిక మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి గ్రామానికి తీసుకువచ్చారు. ట్రైనీ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యూరు. చేతికందివచ్చిన కుమార్తె మృతి చెందడంతో బోరున రోదిస్తున్నారు.