– ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీది అలుపెరుగని పోరాటం
– ఆగస్టు 2న బంద్‌ను విజయవంతం చేయండి
– పార్టీ నేతలు శంకరనారాయణ, విశ్వ, గురునాథరెడ్డి
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేర్కొన్నారు. ఆ ముగ్గురినీ ‘ప్రత్యేక’ ద్రోహులుగా అభివర్ణించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా మన హక్కన్నారు. ఈ విషయంలో ముందు నుంచి చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. అందరూ కలిసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అధోగతి పడుతోందన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో టీడీపీ ఎంపీలు బీజేపీని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరు సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారన్నారు.
జిల్లాలోని మేధావులు, యువకులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి పడుతుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏ విధంగా జనం రోడ్లమీదకొచ్చారో ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఎర్రిస్వామిరెడ్డి, బుర్రా సురేష్‌బాబు, మహమ్మద్ గౌస్, వలిపిరెడ్డి శివారెడ్డి, గోపాల్‌మోహన్, చింతకుంట మధు, మారుతీనాయుడు, బాల నరసింహారెడ్డి, పాలే జయరాం నాయక్, కొర్రపాడు హుస్సేన్ పీరా, వెంకటరామిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ మైనుద్దీన్, శివశంకర్, వాయల శీన, పసులూరి శీన తదితరులు పాల్గొన్నారు.
2న విద్యా సంస్థల బంద్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆగస్టు 2న చేపట్టిన రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం తెలిపారు. బంద్‌కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు.
ఆ ముగ్గురూ ‘ప్రత్యేక’ ద్రోహులు
Published Sat, Jul 30 2016 9:04 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement