చిక్కడు... ఇక దొరకడు! | Bhopal gas tragedy fugitive Warren Anderson dies; survivors say he died ‘unpunished | Sakshi
Sakshi News home page

చిక్కడు... ఇక దొరకడు!

Published Sat, Nov 1 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

Bhopal gas tragedy fugitive Warren Anderson dies; survivors say he died ‘unpunished

ప్రపంచంలోనే అత్యంత దారుణమైన, హేయమైన పారిశ్రామిక ప్రమాదంగా చరిత్రకెక్కిన భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతం సంభవించి మూడు దశాబ్దాలు గడుస్తున్నా బాధితులకు ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఆ ఉదంతంలో ప్రధాన ముద్దాయిగా ఉండి కూడా ఆనాటి ప్రభుత్వాల సంపూర్ణ సహాయ సహకారాలతో స్వేచ్ఛగా దేశం దాటి వెళ్లిపోయిన వారెన్ ఆండర్సన్ అమెరికాలో రహస్యంగా బతికి, రహస్యంగానే మరణించాడు.

మొన్న సెప్టెంబర్ 29న 92 ఏళ్ల వయసులో ఆండర్సన్ చనిపోయాడని ఆయన కుటుంబం నెల్లాళ్ల తర్వాత గురువారం వెల్లడించింది. అరచేతిలో సమస్త ప్రపంచాన్నీ ఒడిసిపట్టగల సాంకేతికత అందుబాటులోకొచ్చి, సమాచార మాధ్యమాలు ఇంతగా విస్తరించివున్న ఈకాలంలో కూడా ఆండర్సన్ మృతి సంగతిని ఆ కుటుంబం రహస్యంగా ఉంచగలగడం వింతే. అయితే, అంతకన్నా అంతుచిక్కనిది- ఆ బాధితులకు న్యాయం చేయడంలో దశాబ్దాలు గడుస్తున్నా సాగుతున్న నిర్లక్ష్యం.
 
భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంనుంచి 1984 డిసెంబర్ 2-3 తేదీల మధ్య అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు టన్నులకొద్దీ లీకై వెనువెంటనే ఆ సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న 2,259మంది మరణించారు. నిశిరాతిరి వేళ మృత్యువులా ముంచుకొచ్చిన ఆ విషవాయువు బారినుంచి తమను తాము రక్షించుకోవడానికి వేలాదిమంది హాహాకారాలు చేస్తూ వీధుల్లో పరుగులు తీశారు. తల్లులు కావలసిన ఎంతోమందికి గర్భస్రావాలయ్యాయి.

అనంతర కాలంలో ఆస్పత్రులపాలైనవారిలో 25,000మంది మరణించారు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ జన్యుపరమైన లోపాలతో శిశువులు జన్మిస్తున్నారు. ఏటా వందల కోట్ల రూపాయల లాభాలను తరలించుకుపోతూ కూడా కర్మాగారంలో కనీస ప్రమాణాలు పాటించని యాజమాన్యమే ఈ ఘోరకలికి కారణం. భారత్‌లోని కార్బైడ్ సంస్థలో తనకు 51 శాతం వాటా మాత్రమే ఉన్నది గనుక అందులో తన బాధ్యతేమీ లేదని మాతృ సంస్థ తప్పించుకోజూసింది. గణనీయంగా పడిపోయిన ఆ సంస్థ లాభాలు 1982లో ఆండర్సన్ చైర్మన్ కాగానే పుంజుకున్నాయి.

ఉత్పాదకతనూ, అమ్మకాలనూ పెంచడానికి అనేకానేక పథకాలను ఆయన అమలుచేశాడు. ఈ క్రమంలోనే అత్యంత క్రూరమైన గ్యాస్ లీక్ ఉదంతం చోటుచేసుకున్నదని బాధితుల తరఫున పోరాడిన ఉద్యమకారులు నిరూపించారు. పీపాల్లో ఉంచాల్సిన అత్యంత ప్రమాదకరమైన మిథైల్ ఐసోసైనేట్ రసాయనాన్ని నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద ట్యాంకుల్లో నిల్వచేశారని... లోపభూయిష్టమైన డిజైన్లు వాడారని చూపారు.

ఒకరిని చంపినా, పదిమందిని హతమార్చినా అలాంటి వ్యక్తి చట్టం దృష్టిలో నేరస్తుడవుతాడు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద ఆ వ్యక్తిపై హత్యానేరం నమోదుచేయాలి. కానీ ఇన్నివేలమంది మరణానికీ, మరిన్ని వేలమంది అంగవైకల్యానికీ బాధ్యుడైన వ్యక్తిని మాత్రం అరెస్టు చేసినట్టే చేసి కొన్ని గంటల్లోనే రాజలాంఛనాలతో విమానం ఎక్కించి దేశం దాటించారు మన పాలకులు!  ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత మన దేశం వచ్చిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచడం, ఆయనకు బెయిల్ ఇవ్వొచ్చని పోలీసులు చెప్పడం, వెనువెంటనే విడుదలకావడం అన్నీ చకచకా పూర్తయ్యాయి. ఈ క్రమంలో మన పరువు బజారునపడుతుందని, నవ్వులపాలవుతామని వారికి తట్టలేదు.

ఆండర్సన్‌నుంచి వివరాలు రాబట్టామని, ఆయన అవసరం ఇక లేదని పోలీసులు చెప్పడంవల్లే పంపిచేయాల్సివచ్చిందని ఆనాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్ సంజాయిషీ ఇచ్చుకున్నారు. అనంతరకాలంలో అప్పటి కేంద్ర హోంమంత్రి పీవీ నరసింహారావు సలహా మేరకే అలా చేశానని ఆయన స్వరం మార్చారు. కానీ, అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అమెరికా పాలకుల అభీష్టాన్ని మన్నించి దీన్నంతటినీ నడిపించారని మీడియా కోడై కూసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆండర్సన్‌ను అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం 1993లో అమెరికా ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు పంపింది. అలాంటివన్నీ బహుళజాతి సంస్థ ముందు బలాదూరయ్యాయి.

మన చట్టాలు, నిబంధనలు, అభ్యర్థనలూ ఆండర్సన్ దరిదాపులకు కూడా చేరలేకపోయాయి. ఆండర్సన్‌ను అప్పగించాలన్న అభ్యర్థనలపై విదేశాంగ శాఖతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు వెల్లడించాలని సమాచార హక్కు చట్టంకింద కోరితే, అది ఆయనపై సాగుతున్న ప్రాసిక్యూషన్‌కు, అప్పగింతకు అడ్డంకిగా మారుతుందని సీబీఐ జవాబిచ్చింది!  2010లో ఒక వెబ్‌సైట్ ఆండర్సన్ ఆనుపానులు పట్టుకుని, ఆయన జీవనశైలిని లోకానికి వెల్లడించింది. అనంతరకాలంలో ఆమాత్రమైనా వినబడలేదు. అమెరికాలో చిన్నపాటి నేరం చేసి తప్పించుకుని ఇక్కడికొచ్చినా అలాంటివారిని అరెస్టుచేసి ఆ దేశానికి అప్పజెబుతున్నాం.

ఉగ్రవాదులు ప్రపంచంలో ఏమూల ఏ దేశంలో ఉన్నా అలాంటివారిపై దాడి చేసే హక్కు తమకున్నదని, అందుకు ఎవరి అనుమతులూ అవసరం లేదని ‘ఉగ్రవాదంపై యుద్ధం’ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ప్రకటించారు. కానీ, ఇక్కడ ఇన్ని వేలమంది హననానికి, లక్షలమంది వైకల్యానికి బాధ్యుడైన వ్యక్తి మాత్రం చట్టానికి చిక్కకుండా, అసలు ఎక్కడున్నాడో స్పష్టంగా తెలియకుండా కనుమరుగైపోయాడు.

అన్యాయానికి గురైనవారు తమకు న్యాయం లభించాలని, జరిగిన నష్టానికి దీటుగా పరిహారం లభించాలని, బాధ్యులను కఠినంగా దండించాలని కోరడం అత్యాశేమీ కాదు. కానీ వర్ధమాన దేశంలో నిరుపేదలుగా పుట్టి అలాంటివి కోరుకోవడం గొంతెమ్మ కోరికలే అవుతాయని ఇన్ని దశాబ్దాల అనుభవం తర్వాత భోపాల్ బాధితులకు అర్ధమై ఉంటుంది. ఆండర్సన్ వ్యవహారం మన వ్యవస్థ వైఫల్యానికి నిలువుటద్దం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement