విశిష్ట ఉపగ్రహం...జీశాట్-16 | Indian Space Research Organisation launched GSAT 16 | Sakshi
Sakshi News home page

విశిష్ట ఉపగ్రహం...జీశాట్-16

Published Thu, Dec 18 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

విశిష్ట ఉపగ్రహం...జీశాట్-16

విశిష్ట ఉపగ్రహం...జీశాట్-16

భారత్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో జీశాట్-16 రూపంలో మరో కలికితురాయి చేరింది. డిసెంబరు 7, 2014న ఏరియేన్ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇస్రో నుంచి నింగికి చేరిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో జీశాట్ 16 బరువైంది. ఇంటర్నెట్, టీవీ, డీటీహెచ్ సేవలను మరింత విస్తరించడంలో ఇది దోహదపడుతుంది.
 
 దేశంలో ఉపగ్రహ సమాచార సేవలు మరింత విస్తృతం అయ్యే దిశగా మరో ముందడుగు పడింది. కొత్త సమాచార ఉపగ్రహం జీశాట్-16ను ఇస్రో విజయవంతంగా నింగికి పంపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచి గయానాలోని కౌరూ అంత రిక్ష  కేంద్రం నుంచి డిసెంబరు 7న తెల్లవారుజామున 2.10 గంటలకు ఏరియెన్-5వీఏ -221 రాకెట్ ద్వారా జీశాట్-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని డిసెంబరు 6నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంతో వాయిదా పడింది.
 
  32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16ను భూ స్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం 2.41 గంటలకు బెంగళూరులోని హసన్ వద్ద గల ఇస్రో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను మూడుసార్లు మండించి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఐదురోజుల వ్యవధిలో ఉపగ్రహంలోని ట్రాన్స్‌పాండర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. సంకేతాలు అందుకుని, ప్రసారం చేసేవాటినే ట్రాన్స్‌పాండర్లు అంటారు.
 
 ఈ ఉపగ్రహం బరువు 3181 కిలోలు. ఇంతటి బరువున్న ఉపగ్రహాన్ని ప్రయోగించే సామర్థ్యం మన దగ్గర ఉన్న జీఎస్‌ఎల్‌వీ- మార్క్ - ఐ, మార్క్ - ఐఐ లకు లేకపోవడంతో ఇస్రో ఏరియెన్ రాకెట్ ద్వారా ప్రయోగించాల్సి వచ్చింది. భావి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం ప్రయోగించే ఉద్దేశంతో జీఎస్‌ఎల్‌వీ మార్క్ - ఐఐఐ అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేసింది. 4,500 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం జీఎస్‌ఎల్‌వీ-మార్క్ - ఐఐఐ ప్రయోగించ గలదు. జీశాట్-16 ద్వారా ఇన్‌శాట్ వ్యవస్థ మరింత బలపడింది.
 
 ఇన్‌శాట్ చరిత్ర
 ఇన్‌శాట్ (ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్) వ్యవస్థను ఇస్రో 1983లో ప్రారంభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఇన్‌శాట్ ఒకటి. అంతరిక్ష విభాగం, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, టె లికమ్యూనికేషన్స్‌విభాగం, భారత వాతావరణ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నాయి. ఉపగ్రహ ఆధారిత రేడియో, టీవీ కార్యక్రమాల ప్రసారం, డెరైక్ట్ టు హోం (డీటీహెచ్), టెలివిజన్ సేవలు, టెలికమ్యూనికేషన్స్, వాతావరణ సమాచార సేకరణ, హెచ్చరికల జారీ, విపత్తు నిర్వహణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలి ఎడ్యుకేషన్, టెలి మెడిసిన్, వీశాట్ మొదలైన సేవలను ఇన్‌శాట్ వ్యవస్థ అందిస్తుంది. ఈ వ్యవస్థలోని ఉపగ్రహాలను జియో స్టేషనరీ, జియో సింక్రనస్ కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ (జీ ఎస్‌ఎల్‌వీ) నౌకను అభివృద్ధి చేసింది.
 
 దీని పేలోడ్ సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఐరోపాకు చెందిన ఏరియెన్ రాకెట్  ద్వారా అత్యధిక ఇన్‌శాట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఇస్రో జీఎస్‌ఎల్‌వీ - మార్క్ - ఐఐఐ అనే కొత్త తరహా వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇన్‌శాట్ వ్యవస్థలో భాగంగానే జీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది. ఇన్‌శాట్ ఉపగ్రహాలలోని ప్రధాన పరికరాలు, ట్రాన్స్‌పాండర్లు. ఇవి రిసీవర్, ట్రాన్స్ మీటర్, మాడ్యులేటర్‌ల కలయికగా పనిచేస్తాయి. వీటి ద్వారానే అప్‌లింక్, డౌన్‌లింక్ ఫ్రీక్వెన్సీలో కమ్యూనికేషన్స్ నిర్వహిస్తారు.
 
 జీశాట్-16 స్వరూపం -సేవలు   
  జీశాట్ 16 బరువు 3181.6 కిలోలు. దీనిలో 440 న్యూట న్ల బలం ఉత్పత్తి చేసే లిక్విడ్ అపోజీ మోటారు (ఔఅక) ఉంది. దీనిలో మోనో మిథైల్ హైడ్రోజన్‌ను ఇంధనంగా, నత్రజని ఆక్సైడ్లను మిశ్రమంగా ఉపయోగిస్తారు. దీని జీవిత కాలం 12 ఏళ్లు. జీశాట్ 16 ఉపగ్రహంలో మొత్తం 48 కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇదివరకు ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇన్ని  ట్రాన్స్ పాండర్లు లేవు. జీశాట్ 16లో 12 కేయూ బ్యాండ్,    24 సీ బ్యాండ్, 12 అప్సర ఎక్స్‌టెండెడ్ ఎల్ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. క్యూబ్యాండ్ ట్రాన్స్‌పాండర్లలో ఒక్కోదానిలో 36 మెగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్‌లో దేశ ప్రధాన భూభాగం, అండమాన్,నికోబార్ దీవుల కవరేజీ ఉంటుంది. భారత భూభూగం, దీవుల ప్రాంతాల్లో 24 సీ బ్యాండ్  , 12 ఎక్స్‌టెండెడ్, ట్రాన్స్‌పాండర్లు తమ సేవలను అందిస్తాయి. జీశాట్ 16 ఉపగ్రహం ద్వారా టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విస్తరించనున్నాయి.
 
 ఇన్‌శాట్-3ఈకి ప్రత్యామ్నాయంగా..
 ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇన్‌శాట్-3ఈ ఉపగ్రహం విఫలమవడంతో దాని స్థానంలో  జీశాట్ 16ను ఇస్రో వేగంగా అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరిలో    జీఎస్‌ఎల్‌వీ-డి5 ద్వారా ఇస్రో జీశాట్-14 ప్రయోగం అనంతరం జరిగిన కమ్యూనికేషన్ ప్రయోగమిదే. మునుపెన్నడూ ఇస్రో ఈ స్థాయిలో భారీ ఉపగ్రహాన్ని ప్రయోగించలేదు. ఏరియెన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-16ను ప్రయోగించిన తర్వాత లిక్విడ్ అపోజీ మీటరు (LAM)ను డిసెంబరు 8న మండించి మొదటి కక్ష్య మార్పిడి నిర్వహించారు. డిసెంబరు 12న ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
    
 అవసరాలెన్నో... కానీ?
 ఇప్పటివరకు ఇన్‌శాట్ వ్యవస్థలో 188 ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇన్‌శాట్ వ్యవస్థలో టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ సేవలను ఈ ట్రాన్స్ పాండర్లు అందిస్తున్నాయి. జీశాట్-16 ప్రయోగంతో వీటి సంఖ్య 236కు చేరింది. అయినప్పటికీ, డిమాండ్‌కు తగ్గట్టుగా ఇస్రో ట్రాన్స్‌పాండర్లను అభివృద్ధి చేసి ప్రయోగించలేకపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రయోగించలేకపోవడంతో 95 ట్రాన్స్‌పాండర్ల వరకు  ఇస్రో విదేశీ కంపెనీల నుంచి లీజుకు తీసుకొని దేశ అవసరాలకు వినియోగిస్తుంది. ముఖ్యంగా డీటీహెచ్ సేవలకు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నాం.
 
 విజయాలకు దూరంగా జీశాట్, ఇన్‌శాట్..
  పీఎస్‌ఎల్‌వీ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్ తన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు జరిగిన 28 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో వరుసగా 27 విజయాలను పీఎస్‌ఎల్‌వీ నమోదు చేసుకుంది. విదేశీ ఉపగ్రహాలను కూడా ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగిస్తుంది. ఇదే విజయం ఇన్‌శాట్/జీశాట్ వ్యవస్థ ఉపగ్రహాల ప్రయోగంలో నమోదు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం జీఎస్‌ఎల్‌వీ వైఫల్యాలే. ఇప్పటివరకు నిర్వహించిన 8 జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మూడు విఫలమయ్యాయి.
 అవి:     1. GSL-V FO2,       2. GSLV-D3,
           3. GSLV-FO6.
 
 జీఎస్‌ఎల్‌వీకి కావాల్సిన క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ సరఫరాకు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి రష్యా 1990లో నిరాకరించడంతో 1996లో దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ నిర్మాణం మొదలైంది. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ 2010లో  అభివృద్ధి చేసినప్పటికీ, అదే ఏడాది ఏప్రిల్ 15న జరిగిన జీఎస్‌ఎల్‌వీ-డి3 ప్రయోగం విఫలమైంది. ఈ ఏడాది జనవరి 5న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-డి5 ప్రయోగంలో చివరకు దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించారు.
 
 విదేశీ రాకెట్లపై ఆధారం.. భారీ వ్యయం
 మొదటి, రెండు తరాల జీఎస్‌ఎల్‌వీ నౌకలు (జీఎస్‌ఎల్‌వీ-మార్క్ - ఐ, జీఎస్‌ఎల్‌వీ - మార్క్ - ఐఐ) పేలోడ్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో భారీ ఇన్‌శాట్ ఉపగ్రహాల ప్రయోగానికి విదేశీ ఏరియెన్ 5 రాకెట్‌పై ఆధారపడాల్సి  వస్తుంది. ఇలా విదేశీ రాకెట్‌పై ఆధారపడటం ద్వారా ఇన్‌శాట్ వ్యవస్థ విస్తరణ ఆలస్యం అవుతోంది. దీంతోపాటు ప్రయోగ వ్యయం కూడా బాగా పెరుగుతుంది. ఏరియెన్ ద్వారా జీశాట్-16నుప్రయోగించడానికి దాదాపు రూ. 560 కోట్ల ఖర్చయింది. మొత్తం జీశాట్ -16 ఖర్చు రూ.880 కోట్లయితే అందులో ప్రయోగఖర్చుకే రూ. 560 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీనిద్వారా విదేశీ రాకెట్లపై ఆధారపడితే ఎంత భారం మోయాల్సి వస్తుందో స్పష్టమవుతోంది.
 
 జీఎస్‌ఎల్‌వీ-మార్క్3తో స్వయం సమృద్ధి
 ఈ ఉద్దేశంతోనే అధిక పేలోడ్ సామర్థ్యమున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్-ఐఐఐ ఉపగ్రహాన్ని ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ మూడో తరం జీఎస్‌ఎల్‌వీ ద్వారా 4,500-5,000 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించ డం సాధ్యమవుతుంది. ఇలాంటి స్వదేశీ రాకెట్ల ద్వారా ఇన్‌శాట్/జీశాట్ వ్యవస్థను మరింత వేగంగా విస్తరింపజేయవచ్చు. ఫలితంగా విదేశీ ట్రాన్స్‌పాండర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి ప్రయోగించిన ఉపగ్రహాల జీవితకాలం పూర్తవడం లేదా సాంకేతిక కారణాలతో వాటి విధులు నిలిచిపోతున్నాయి. దీంతో టాన్స్‌పాండర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు మించి విదేశీ అవసరాలకు ట్రాన్స్‌పాండర్లను ఎగుమతి చేసే స్థాయికి ఇస్రో ఎదగాలి.  
 
 ప్రస్తుతం సేవలందిస్తున్న ఇన్‌శాట్ ఉపగ్రహాలు
 
     ఉపగ్రహం    ప్రయోగతేదీ    నౌక
 1    జీశాట్-16    7 -12-2014    ఏరియెన్- 5
 2.    జీశాట్-14    05-01-2014    జీఎస్‌ఎల్‌వీ-డీ5
 3.    జీశాట్-7    30-08-2014    ఏరియెన్-5
 4.    ఇన్‌శాట్-3డి    26-07-2013    ఏరియెన్-5
 5.    జీశాట్-10    29-09-2012    ఏరియెన్-5
 6.    జీశాట్-12    15-07-2011    పీఎస్‌ఎల్‌వీ-సీ17
 7.    జీశాట్-8    21-05-2011    ఏరియెన్-5
 8.    ఇన్‌శాట్-4సీఆర్    02-09-2007    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ఓ4
 9.    ఇన్‌శాట్-4బి    12-03-2007    ఏరియెన్- 5
 10.    ఇన్‌శాట్-4ఎ    22-12-2005    ఏరియెన్
 11.    ఇన్‌శాట్-3ఏ    10-04-2003    ఏరియెన్
 12.    కల్పన -1    12-09-2002    పీఎస్‌ఎల్‌వీ-సీ4
 13.    ఇన్‌శాట్-3సీ    24-01-2002    ఏరియెన్
 
 - సి. హరికృష్ణ
 సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement