ఉప్పు సత్యాగ్రహం
ఉప్పు సత్యాగ్రహం
Published Mon, Dec 5 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
ఉప్పు సత్యాగ్రహాన్నే శాసనోల్లంఘనోద్యమం, పౌర నియమ అతిక్రమణ ఉద్యమం, దండి సత్యాగ్రహం అంటారు. 1929లో లాహోర్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు. ఇందులో ఆయన పూర్ణస్వరాజ్ తీర్మానం చేశారు. దీని ప్రకారం 1930 జనవరి 26న భారత ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకోవాలి. త్రివర్ణ పతాకాలను చేపట్టి ప్రజలందరూ ఐక్యత చాటాలి. పన్నులు కట్టకుండా బ్రిటిష్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలి. గాంధీజీ తన ‘యంగ్ ఇండియా’ పత్రికలో బ్రిటిష్ వారికి 11 అంశాలు విన్నవించారు. వాటిలో ‘స్వరాజ్య’ అంశం లేదు. ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఉప్పు సత్యాగ్రహం చేపట్టాలని గాంధీజీ పిలుపునిచ్చారు. 78 మంది అనుచరులతో 240 మైళ్ల దూరం నడిచి 1930 ఏప్రిల్ 6న దండి ప్రాంతం చేరుకున్నారు. ఇది అరేబియా సముద్ర తీర ప్రాంతం.ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించి గాంధీజీ అరెస్టయ్యారు.
ఈ ఉద్యమంలో భాగంగా మద్యపాన శాలలు, విదేశీ వస్త్ర దుకాణాల ముందు ధర్నా, రాస్తారోకో వంటి నిరసన కార్యక్రమాలు అహింసాయుతంగా నిర్వహించారు. గాంధీజీ పిలుపుతో దేశం నలువైపుల నుంచీ ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజలు నిరసనలు తెలిపారు. అస్సాంలోని సిల్హెట్, బెంగాల్‌లోని నౌఖాలీ, మద్రాస్ రాష్ర్టంలోని మద్రాస్, ఆంధ్ర, కేరళలోని కాలికట్, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, నేటి పాకిస్తాన్‌లోని (ఆనాటి భారత్) పెషావర్ తదితర ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం వివిధ నిరసన రూపాల్లో జరిగింది. గహర్వాల్ ప్రాంతంలో ప్రజలపై కాల్పులు జరపడానికి సైనికులు నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ర్టలోని షోలాపూర్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికులు సమ్మెకు దిగారు. ‘ఎత్తిన జెండా దించని’ ఉద్యమం కూడా ఇందులో భాగంగా ప్రారంభమైంది.
సామ్రాజ్యవాదానికి, దాని అణచివేత విధానాలకు, పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా శాసనోల్లంఘనోద్యమం జరిగింది. ఈ ఉద్యమం వల్ల మద్యపానం, విదేశీ వస్త్రాల వాడకం తగ్గి, స్వదేశీ వస్త్ర, వస్తు వాడకం పెరిగింది. ఆంధ్రలో ఉద్యమ సారథి.. ‘దేశభక్త’ బిరుదాంకితులు కొండా వేంకటప్పయ్య. కొమరవోలు, సీతానగరం, పల్లిపాడు ఆశ్రమాలు ఉద్యమ కేంద్రాలుగా ప్రజలు, నాయకులు విజృంభించారు. మద్రాసులో ఆంధ్ర ప్రాంత నాయకులైన కాశీనాథుని నాగేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ కీలకపాత్ర పోషించారు. స్త్రీలు సైతం ఈ ఉద్యమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా 1934 మే 20న శాసనోల్లంఘనోద్యమాన్ని నిలిపేశారు. ఈ ఉద్యమాన్ని జాతి ఐక్యతకు చిహ్నంగా భావించవచ్చు.
ఉప్పుసత్యాగ్రహం-ప్రముఖులు
సి. రాజగోపాలాచారి
ఠ తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి వేదారణ్యం వరకు నడిచి ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. దక్షిణాది ఉప్పు సత్యాగ్రహ నాయకుడు.
అబ్బాస్ త్యాబ్జీ
‘గ్రాండ్ ఓల్డ్‌మ్యాన్ ఆఫ్ గుజరాత్’గా ప్రసిద్ధులు. గాంధీజీ అరెస్ట్ తర్వాత ఈ ఉద్యమానికి త్యాబ్జీ నాయకత్వం వహించారు. గాంధీ వారసుడిగా ఈ ఉద్యమంలో కీర్తి పొందారు.
ఖాన్ అబ్దుల్ గపార్ ఖాన్
సరిహద్దు (ఫ్రాంటియర్) గాంధీగా పిలుస్తారు. పఠాన్‌లను ఈ ఉద్యమంలో ముందుండి నడిపింు. పెషావర్‌లో (నేటి పాకిస్తాన్‌లో) సత్యాగ్రహం సాగించారు.
‘ఖుదైఖిద్మత్‌ఘర్’ (దైవ సేవకులు) స్థాపించారు. దీని యూనిఫాం రెడ్‌షర్‌ట్స. ఫక్తూన్ అనే వార్తా పత్రిక ఏర్పాటు చేశారు.
వెబ్‌మిల్లర్
ధరశామ (దర్శన) ఉప్పు డిపోపై దాడి, ఇతర సంఘటనలను రాసిన అమెరికా ప్రతికా (యునెటైడ్ ప్రెస్) విలేకరి.
కేలప్పన్
కాలికట్ నుంచి పాయనూర్‌కు యాత్ర సాగించి సత్యాగ్రహం చేశారు.
రామ్సే మెక్‌డొనాల్డ్
1932, ఆగస్టు 16న కమ్యూనల్ అవార్‌డ ప్రకటించారు. దీని ప్రకారం వివిధ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తారు.
వెర్‌డవుడ్‌బెన్
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ కాలంనాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి.
ఇర్విన్
ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన కాలం నాటి భారత బ్రిటిష్ వైస్రాయ్. 1931 మార్చి 5న గాంధీతో చర్చలు జరిపారు. ఇతడిని క్రిస్టియన్ వైస్రాయ్ అంటారు.
ఖాన్ సాహిబ్
ఉత్తరప్రదేశ్‌లో ఉప్పు సత్యాగ్రహోద్య
మంలో రైతులకు నేతృత్వం వహించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్
గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహాన్ని.. ఏల్బా నుంచి పారిస్ వరకు నెపోలియన్ చేపట్టిన యాత్రతో పోల్చారు. ఈ ఉద్యమాన్ని నిలిపేయడాన్ని తీవ్రంగా విమర్శించారు.
సరోజినీ నాయుడు
ఉప్పు సత్యాగ్రహ రాణి అని కీర్తి పొందారు. ధరశామ ఉప్పు కొటారు దాడిలో కీలక పాత్ర పోషించారు.
గాంధీతోపాటు వ్యక్తిగత హోదాలో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
మదన్ మోహన్ మాలవ్య
2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో గాంధీతోపాటు హాజరయ్యారు. 1915లో వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. మహాత్మ అని గౌరవం పొందారు. సత్యమేవ జయతే అనే సూక్తిని వ్యాప్తి చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
1930, 1931, 1932ల్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. కమ్యూనల్ అవార్డులను ప్రకటింపజేయడంలో సఫలీకృతులయ్యారు.
పురుషోత్తందాస్ టాండన్
రాజర్షి బిరుదాంకితులు. ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఉప్పు సత్యాగ్రహంలో నె్రహూతోపాటు అరెస్టయ్యారు.
కృష్ణన్ పిళ్లై
కేరళలో ‘ఎత్తిన జెండా దించని’ స్వాతంత్య్ర సమరవీరుడు.
లార్‌డ విల్లింగ్టన్
ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో భారత వైస్రాయ్‌గా ఇర్విన్ తర్వాత వచ్చారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్
దండి యాత్ర ఎలా జరగాలో గాంధీజీ సూచన మేరకు ఏర్పాట్లు చేశారు. దండిలో గాంధీ కంటే ముందే అరెస్టయ్యారు.
మణిలాల్ గాంధీ
ధరశామ ఉప్పు డిపో వద్ద రెండు వేల మంది కార్యకర్తలతో సత్యాగ్రహం చేశారు.
కొండా వేంకటప్పయ్య
ఉప్పు సత్యాగ్రహాన్ని సమర్థంగా నిర్వహించారు. ఆంధ్ర దేశ శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు.
త్రిపురనేని రామస్వామి చౌదరి
‘కవిరాజు’ అని పిలుస్తారు. సూతాశ్రమం ఈయన స్వగృహం. ఉప్పుసత్యాగ్రహం సందర్భంగా ‘‘వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి’’ అని రాశారు. సూత పురాణం, శంభూక వథ రాశారు.
గైడిన్లూ
రాణి గైడిన్లూగా పేర్గాంచిన ఈమె నాగాలాండ్‌కు చెందినవారు. శాసనోల్లంఘనోద్యమంలో కీలక పాత్ర పోషించారు. రింగామి నాగాలకు నాయకత్వం వహించారు.
శరణు రామస్వామి చౌదరి
ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో తెనాలిలో ఊరేగింపుగా వస్తుండగా ఈయనను చూసి త్రిపురనేని రామస్వామి ‘‘వీరగంధము తెచ్చినారము’’ గేయం పాడారు.
ఉన్నవ లక్ష్మీనారాయణ
శాసనోల్లంఘనోద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. మాలపల్లి, బుడబుక్కల జోస్యం మొదలైన గ్రంథాలు రాశారు. గాంధేయవాది, హరిజనోద్ధారకుడు.
దండు నారాయణరాజు
ఉప్పుసత్యాగ్రహంలో అరెస్టయి నెల్లూరు జైల్లో మరణించారు.
బులుసు సాంబమూర్తి
‘మహర్షి’ బిరుదాంకితులు. శాసనోల్లంఘనోద్యమంలో తీవ్ర లాఠీ దెబ్బలు తిన్నారు.
తెన్నేటి విశ్వనాథం
విశాఖపట్నంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.
తోట నర్సయ్య నాయుడు
ఆంధ్రలో ‘ఎత్తిన జెండా దించని’ స్వాతంత్య్రయోధుడిగా కీర్తిపొందారు. ఈయనను జెండా నర్సయ్య అంటారు.
బెజవాడ గోపాలరెడ్డి
నెల్లూరులోని మైపాడు బీచ్ ప్రాంతంలో ఉప్పు తయారు చేసి పురవీధుల్లో విక్రయించారు.
అయ్యదేవర కాళేశ్వరరావు
గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో తొలిసారిగా ఉప్పు సత్యాగ్రహాన్ని మచిలీపట్నంలో నిర్వహించారు.
కల్లూరి సుబ్బారావు
రాయలసీమ (బళ్లారి) ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. రాయలసీమ కురువృద్ధుడుగా ప్రసిద్ధులు.
టంగుటూరి ప్రకాశం పంతులు
మద్రాసులో తన స్వగృహం ‘వేదవనం’లో సత్యాగ్రహ శిబిరాలు ఏర్పాటు చేశారు.
గొల్లపూడి సీతారామశాస్త్రి
గాంధీజీ పిలుపుతో ఆంధ్రలో కల్లు చెట్ల నరికివేత కార్యక్రమం చేపట్టారు. ఈయననే స్వామి సీతారాం అంటారు. శాసనోల్లంఘనోద్యమంలో కీలకపాత్ర పోషించారు.
జగ్గన్న శాస్త్రి
ఈ ఉద్యమ కాలంలో ‘బార్డోలీ సత్యాగ్రహ విజయం’, ‘భారత స్వరాజ్య యుద్ధం’ లాంటి గీతాలు రాశారు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య
‘మచిలీపట్నం నా మక్కా’ అని ప్రబోధించారు. ఉప్పు సత్యాగ్రహాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. ‘భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర’ అనే గ్రంథం రాశారు. 1948లో జైపూర్ ఐఎన్‌సీకి అధ్యక్షత వహించారు.
జేవీపీ కమిటీ (ఆంధ్ర రాష్ర్ట ఏర్పాటుకు)లో సభ్యుడు.
రావి నారాయణరెడ్డి
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో డాక్టర్ రామారావు సహకారంతో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. ఈయన ప్రముఖ తెలంగాణ కమ్యూనిస్ట్ నాయకుడు.
బొమ్ము శేషారెడ్డి
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. మైపాడులో ఉప్పు సత్యాగ్రహం స్థూపం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పల్లెపాడును ఉప్పు సత్యాగ్రహ కేంద్రంగా చేసు
కున్నారు.
ఓరుగంటి వెంకటసుబ్బయ్య
నెల్లూరు జిల్లా మైపాడులో 1930 ఏప్రిల్ 11న ఉప్పు తయారు చేసి తిప్పరాజు వారి సత్రం వద్ద విక్రయించారు.
షేక్ ఫకీర్
నెల్లూరు జిల్లా మైపాడులో ఉప్పు తయారు చేసి పట్టణంలో విక్రయించారు.
ఎన్.జి. రంగా
1930లో గాంధీజీ పిలుపుతో తన ప్రొఫెసర్ వృత్తికి రాజీనామా చేశారు. రైతులతో మమేకమై వారి శ్రేయోభివృద్ధికి కృషిచేశారు.
ఖాసా సుబ్బారావు
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. సి. రాజగోపాలాచారి సహాయ సహకారాలతో స్వరాజ్య పత్రికను స్థాపించారు.
ఎర్నేని సుబ్రమణ్యం
దండి యాత్రలో గాంధీజీతోపాటు పాల్గొన్న 78 మంది అనుచరుల్లో ఏకైక ఆంధ్రుడు. కొమరవోలులో ఆశ్రమాన్ని స్థాపించారు.
బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం
సీతానగర ఆశ్రమ స్థాపకులు. దీన్ని ‘ఆంధ్రా దండి’ అంటారు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు
ఈ ఉద్యమాన్ని తనదైన శైలిలో నిర్వహించారు. మహిళల కోసం ‘సౌందర్యవల్లి’ పత్రిక నడిపారు. ఆంగ్ల పదం ఎడిటర్‌కు ‘సంపాదకుడు’ అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టారు.
రామదాసు పంతులు
ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో కేంద్ర శాసన సభకు రాజీనామా చేశారు.
స్వామి వెంకటాచలం
ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా శాసన మండలికి రాజీనామా చేశారు.
ప్రతివాద భయంకరాచారి
సామర్లకోట వాసి. కాకినాడ బాంబు (1933) కేసు సంఘటనలో అరెస్టయ్యారు.
ఓరుగంటి రామచంద్రయ్య
కాకినాడ బాంబు కేసులో అరెస్టయిన బాలుడు. తర్వాత ఆంధ్రా వర్సిటీ నుంచి చరిత్ర విభాగంలో పట్టా పొంది ఆచార్యుడయ్యారు.
బసవరాజు అప్పారావు
‘కొల్లాయి గడితేనేమి.. మా గాంధీ కోమటై పుడితేనేమి’ గీతం రాశారు.
క్రొవ్విడి లింగరాజు
ఈ ఉద్యమ సమయంలో దేశద్రోహ నేరంపై జైలుకెళ్లారు. ఈయన ‘ది కాంగ్రెస్’ పత్రిక సంపాదకులు. మాక్సిం గోర్కీ రాసిన రష్యన్ నవల ‘ది మదర్’ను ‘అమ్మ’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
మాగంటి బాపినీడు
ఉప్పు సత్యాగ్రహాన్ని అంచనా వేయడానికి లండన్ నుంచి భారత్ లీగ్ ప్రతినిధులుగా భారత్ వచ్చిన వి.కె. కృష్టమీనన్, హెరాల్డ్‌లాస్కి, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారికి ఆంధ్ర ప్రాంత పరిస్థితులు చూపించి తీవ్రత వివరించారు.
ఎం.వెంకటరమణరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ.
Advertisement
Advertisement