3 ఏకే లతో భారత్ కు ముప్పు
ఆంటోనీ, కేజ్రీవాల్.. పాక్ ఏజెంట్లు: మోడీ
వీళ్లు మాట్లాడేది పాకిస్థాన్ భాష
ఆంటోనీ, కేజ్రీలను ఏకే-47తో పోల్చిన మోడీ
జమ్మూ కాశ్మీర్ నుంచి తొలి ‘భారత విజయ ర్యాలీ’ ప్రారంభం
జమ్మూ: రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. వారిద్దరూ పాకిస్థాన్ ఏజెంట్లని, భారత్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. బుధవారమిక్కడ ఆయన బీజేపీ సభలో మాట్లాడారు. ‘‘మూడు ఏకేలు పాకిస్థాన్‌కు అపూర్వమైన ఆయుధాలుగా మారాయి. ఒకటి ఏకే-47.. ఇది కాశ్మీర్‌లో రక్తపాతం చిందిస్తోంది. రెండోది ఏకే ఆంటోనీ. పాకిస్థాన్‌కు చెందిన కొందరు మన సైనికుల తలలు నరికేశారని మన సైన్యం చెబుతుంటే.. ఈయన మాత్రం పాక్ దుస్తులు ధరించిన వారెవరో మన వారి తలలు నరికేశారని పార్లమెంటులో చెబుతారు.
మీ ప్రకటనతో ఎందుకు వారికి లబ్ధి చేకూర్చాలని అనుకున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇక మూడో ఏకే.. అరవింద్ కేజ్రీవాల్.. ఈయన ఏకే-49 (సీఎంగా బాధ్యతలు చేపట్టిన 49 రోజులకే రాజీనామా చేశారని గుర్తుచేస్తూ). ఈయన పార్టీ వెబ్‌సైటులో భారత పటాన్ని చూస్తే.. అందులో కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమని చెప్తోంది. ఆయన పార్టీకి చెందిన ఓ సీనియర్ సభ్యుడేమో కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలంటాడు. పాకిస్థాన్ ఈ ప్రకటనల్నీ చూసి ఇంకా రెచ్చిపోతోంది. వీళ్లు పాకిస్థాన్ ఏజెంట్లు, భారత శత్రువులు..’’ అని ఘాటుగా విమర్శించారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ కోసం తన ప్రాణాలు త్యాగం చేస్తే.. వీళ్లేమో పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మరే యుద్ధంలోనూ లేనంతగా కాశ్మీర్‌లో సైనికులు ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు.
భారత్ విజయ్ ర్యాలీ ప్రారంభించిన మోడీ
దేవీ హీరానగర్: దేశవ్యాప్తంగా 185 సభలు నిర్వహించే లక్ష్యంతో తలపెట్టిన ‘భారత్ విజయ ర్యాలీ’ని మోడీ బుధవారం జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభించారు. దీనికి ముందు ఆయన వైష్ణో దేవీ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం జమ్మూ జిల్లాలోని హీరానగర్‌లో నిర్వహించిన తొలి ‘భారత్ విజయ ర్యాలీ’లో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ నుంచి తన ప్రచారం ప్రారంభించడం అదృష్టమన్నారు. ‘ఈ ఉదయమే నేను మాతా వైష్ణోదేవికి మొక్కాను.. ఇప్పుడు ప్రజలకు నమస్కరిస్తున్నాను’ అని అన్నారు. ధరల పెరుగుదలపై, అవినీతిపై, దుష్ట పాలనపై, నిరుద్యోగ సమస్యపై విజయం సాధించడమే.. భారత విజయ ర్యాలీ లక్ష్యమన్నారు. దేశాన్ని రాచరిక పాలన నుంచి విముక్తం చేయాలన్నారు. కాగా, యూపీలోని బులంద్‌షెహర్‌లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ లౌకికవాదం పేరుతో కాంగ్రెస్ ముస్లిం యువత జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
ప్రధాని అభ్యర్థి మాట్లాడాల్సిన భాష కాదిది: కేజ్రీవాల్
ఏకే49 అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ప్రధాని అభ్యర్థికి ఇలాంటి భాష తగదని అన్నారు. అల్లర్లు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి టికెట్లు ఎలా ఇచ్చారంటూ మోడీని ప్రశ్నించారు. మోడీ సమస్యలపై మాట్లాడాలని, పనికిరాని విమర్శలు మంచివి కావని అన్నారు. ‘‘మోడీ గ్యాస్ ధరలపై మాట్లాడరేం? గుజరాత్ అభివృద్ధి అబద్ధమన్న వ్యాఖ్యలపై మాట్లాడరేం? రైతు ఆత్మహత్యలపై మాట్లాడరేం?’’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.