చంద్రబాబు మాటలు నమ్మితే అధోగతే | Anantha Venkata Ramana Chowdhury elections Campaign in Turpucodavaram | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటలు నమ్మితే అధోగతే

Published Mon, Mar 31 2014 12:08 AM | Last Updated on Tue, Aug 14 2018 7:49 PM

చంద్రబాబు మాటలు నమ్మితే అధోగతే - Sakshi

చంద్రబాబు మాటలు నమ్మితే అధోగతే

తూర్పుచోడవరం (నల్లజర్ల రూరల్), న్యూస్‌లైన్ : అన్నీ ఉచితం (ఆల్ ఫ్రీ) అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని వైసీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు అనంత వెంకట రమణ చౌదరి ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మితే ప్రజల జీవితాలు అధోగతేనని, బాబు గత చరిత్ర చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. నల్లజర్ల మండలం తూర్పుచోడవరంఅంబేద్కర్ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం వైసీపీ పరిషత్ ఎన్నికల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండగా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేశారో లేదో ప్రజలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
 
  హామీలు ఇవ్వడమే గాని అమలు చేయడం ఆయన వల్ల కాదన్నారు. అధికార కాంక్షతో చంద్రబాబు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నిరంకుశ విధానాలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసేందుకు  రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చిన విషయాన్ని మరువరాదని సూచించారు. అటువంటి వ్యక్తి నేడు అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. రాష్ట్ర విభజన విషయంలో నోరుమెదపని  బాబు కొత్త రాజధానిని సింగపూర్‌గా మారుస్తాననడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 
 
 సింగపూర్‌లో అసలు వ్యవసాయమే ఉండదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మఒడి, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్ల మొత్తం పెంపు, రైతులకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. వీటితో పాటు దివంగత వైఎస్ సంక్షేమ పథకాలు అమలుకావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. గుండేపల్లి, తెలికిచెర్లలో ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, మండల పార్టీ అధ్యక్షడు గగ్గర శ్రీనివాసరావు, కారుమంచి రమేష్, జెడ్పీటీసీ అభ్యర్థి తొమ్మండ్రు సాయిరాణి,తూర్పుచోడవరం, గుండేపల్లి, తెలికిచెర్ల ఎంపీటీసీ అభ్యర్థులు ఒంపుగడప ఝాన్సీరాణి, కణతల ధనలక్ష్మి, బండి చిననాగరాజు, ఎ.చంద్రబోస్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement