నేడే శంఖారావం | general elections campaign in kcr | Sakshi
Sakshi News home page

నేడే శంఖారావం

Published Sun, Apr 13 2014 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

నేడే శంఖారావం - Sakshi

నేడే శంఖారావం

 తెలంగాణ వికాసమే నినాదం
 కలిసొచ్చిన కరీంనగర్ నుంచే శ్రీకారం
 భారీ ఏర్పాట్లు చేసిన టీఆర్‌ఎస్
 లక్ష మంది జనసమీకరణ
 ఎస్సారార్ కళాశాల మైదానం వేదిక


 
 సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సభకు కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌లో దిగనున్నారు. అక్కడినుంచి ఎస్సారార్ కళాశాల వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
 
 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : కలిసొచ్చిన కరీంనగర్ నుంచి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. తెలంగాణ తెచ్చింది తామేనని, వికాసం కూడా తమతోనే సాధ్యమనే ప్రధాన అస్త్రాన్ని టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో సంధిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలనే విషయాన్ని ఆదివారం నగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సాక్షాత్కరింపజేయనున్నారు.


 తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సహకరించిన పార్టీగా బీజేపీ ఎన్నికల రంగంలోకి దిగగా.. ఆ రెండు పార్టీలతో తలపడాలంటే తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాదు... వచ్చిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కూడా తమతోనే సాధ్యమనే నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకున్నారు. ఈ సరికొత్త వాదాన్ని ప్రజల్లోకి బలంగా పంపించేందుకు కేసీఆర్ కరీంనగర్‌లో జరగనున్న బహిరంగ సభను వినియోగించుకోనున్నారు.

 

సార్వత్రిక ఎన్నికల్లో ఇది తొలి బహిరంగ సభ కావడంతో, ఈ సభను ఎట్టి పరిస్థిత్లోనూ భారీ స్థాయిలో నిర్వహించాలనే యోచనలో పార్టీ ఉంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి, తెలంగాణ ప్రజలు తమ వెంటే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలని గులాబీ బాస్ ఉబలాటపడుతున్నారు.

ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా లక్ష్యాలు నిర్ధేశించి, జనసమీకరణ చేపడుతున్నారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి 30 వేలు, సమీపంలోని చొప్పదండి, పెద్దపల్లి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు నుంచి అధిక సంఖ్యలో, దూరంగా ఉన్న రామగుండం, మంథని, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నుంచి కాస్త తక్కువగా జనాలను తరలించేందుకు ఇప్పటికే స్థానిక నాయకత్వానికి లక్ష్యాలు నిర్ధేశించారు.


 సెంటిమెంట్
 టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి తనకు అన్ని విధాలా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే తెలంగాణ వికాసం నినాదంతో మరో ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. 2001లో సింహగర్జన పేరుతో ఇదే ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ అనూహ్య విజయం సాధించింది.

ఆ సభ అందించిన స్ఫూర్తితో కేసీఆర్ పుష్కరకాలంగా ఉద్యమాన్ని సజీవంగా కొనసాగిస్తూ వచ్చారు. ఆ సభతోపాటు టీఆర్‌ఎస్, తెలంగాణ ఉద్యమానికి కీలక  మలుపులకు కరీంనగర్ జిల్లా వేదిక అయింది. 2004లో కరీంనగర్ నుంచే కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఆ తరువాత 2006లో జరిగిన తొలి ఉప ఎన్నికలో 2 లక్షల రికార్డు మెజార్టీతో విజయం సాధించి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆ సమయంలోనే ప్రజలకిచ్చిన మాట మేరకు  తీగలగుట్టపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. 2008లో మరోసారి ఉప ఎన్నికలో కరీంనగర్ నుంచే విజయం సాధించారు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన సకలజనుల సమ్మె సన్నాహక సభను కూడా కేసీఆర్ కరీంనగర్‌లోనే నిర్వహించారు.

 

2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు ముందు అచ్చొచ్చిన కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌లోనే బస చేశారు. ఇక్కడి నుంచి దీక్షాస్థలికి వెళుతున్న ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేశారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వేదిక అయిన కరీంనగర్‌ను  కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం, వస్తున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే గట్టి ప్రయత్నంలో ఉన్న ఆయన తెలంగాణ వికాసం నినాదంతో చేపట్టనున్న ఉద్యమానికి కరీంనగర్ సెంటిమెంట్‌ను ఎంచుకున్నారు.
 
 పార్కింగ్ ఏర్పాట్లు
 సభకు వచ్చే వాహనాల కోసం రూట్ల వారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
 జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు ఈద్గా ముందు స్థలంలో పార్కింగ్ చేయాలి.
 వేములవాడ, సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలు చింతకుంట బైపాస్ మీదుగా వచ్చి విద్యానగర్ వాటర్‌ట్యాంక్ వెనకాల ఉన్న స్థలంలో నిలపాలి.హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ఆర్ట్స్ కళాశాల మైదానం లేదా వరలక్ష్మి గార్డెన్స్ పక్క స్థలంలో పార్కింగ్ చేయాలి. పెద్దపల్లి, చొప్పదండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఆదర్శనగర్ మీదుగా వరలక్ష్మి గార్డెన్స్ సమీపంలోని మైదానంలో నిలపాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement