తెలంగాణకే వైఎస్ పెద్దపీట | ysr maintain mostly intrested in telengana developing | Sakshi
Sakshi News home page

తెలంగాణకే వైఎస్ పెద్దపీట

Published Mon, Apr 14 2014 2:40 AM | Last Updated on Mon, May 28 2018 1:21 PM

తెలంగాణకే వైఎస్ పెద్దపీట - Sakshi

తెలంగాణకే వైఎస్ పెద్దపీట

ఖమ్మం జిల్లా జనభేరిలో షర్మిల

ఖమ్మం: ‘వైఎస్సార్.. తెలంగాణను, సీమాంధ్రను ఎప్పుడూ వేరుచేసి చూడలేదు. రెండు ప్రాంతాలను రెండు కళ్లుగా చూశారు. అందరూ నాబిడ్డలేనంటూ అందరి అభివృద్ధినీ సమానంగా ఆకాంక్షించారు. సీఎంగా ఉన్న ఐదేళ్లలో రైతులకు రుణమాఫీ, విద్యుత్ కనెక్షన్లు, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ విషయంలో వైఎస్ తెలంగాణకే పెద్ద పీట వేశారు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి సోదరి షర్మిల తెలిపారు. వైఎస్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్రను మొదలు పెట్టింది కూడా తెలంగాణలోనే అని, 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీరుుంబర్స్‌మెంట్.. ఇలా ఎన్నోపథకాలను తెలంగాణలోనే ప్రారంభించి ఈ ప్రాంతం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో షర్మిల ప్రారంభించారు.

పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, బచ్చోడు, సుబ్లేడు, తిరుమలాయపాలెం, పెద్దతండాలతో పాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగిం చారు. వైఎస్‌ఆర్ అనే మహావృక్షం కింద తెలుగు ప్రజలందరూ సేద తీరారని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన చెరపలేని స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు ఆ బాధను తట్టుకోలేక ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎక్కువమంది చనిపోయారని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు, వైఎస్‌ఆర్‌కు మధ్య ఉన్న చెరగని అనుబంధం, తెలంగాణ బిడ్డల గుండెల్లో వైఎస్‌ఆర్‌కు ఉన్న సుస్థిర స్థానం అదని చెప్పారు. అందుకే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు? అని రెండు నెలల క్రితం హెడ్‌లైన్స్ టుడే చానెల్ అడిగితే తెలంగాణ ప్రజలు 60 శాతం మంది వైఎస్‌ఆర్‌కే ఓటేశారని తెలిపారు.

 వైఎస్సార్ మీ గుండెల్లో ఉన్నారు..

 ‘‘జీవితాన్ని పంచుకున్న వారు, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు, తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, కాపాడే దేవుడికి మాత్రమే మనం గుండెల్లో చోటిస్తాం... అలాంటిది తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో వైఎస్‌ఆర్‌కు చోటిచ్చారు. ఆ అభిమానాన్ని ఈరోజు వరకు చెక్కు చెదరకుండా ఉంచుకున్నారంటే అది సామాన్య విషయం కాదు. మీరు గుండెల్లో పెట్టుకోవటం వల్లే వైఎస్‌పై మీకున్న ప్రేమ ఇంకా చెరిగిపోలేదు. ఇందుకు మీరు కాదు వైఎస్‌ఆర్ కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోడానికే మేము మీ ముందుకు వచ్చాం..’’ అని షర్మిల అన్నారు. ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫ్యాను గుర్తుపై ఓటేసి, పాలేరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేస్తున్న సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌ను సుత్తి-కొడవలి-నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement