దేశీ ఆవులైనా రోజూ కొన్ని గంటల పాటు ఆరు బయట తిరుగాడుతూ సహజ సిద్ధంగా పెరిగే గరిక, ఔషధ మొక్కలను మేసే వెసులుబాటు ఉన్నప్పుడే ఆ ఆవు ఆరోగ్యంగా ఉంటుందని.. దాని పాల ఉత్పత్తులు, పేడ, మూత్రం కూడా ఔషధ విలువలతో కూడి ఉంటాయని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని గోశాలలకు గౌరవ సలహాదారుగా ఇటీవల నియమితులైన డాక్టర్ ములగలేటి శివరాం చెప్పారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కూరాడలో జన్మించిన ఆయన పశుసంవర్థక శాఖలో సహాయ సంచాలకులుగా ఉద్యోగ విరమణ చేశారు. ఒంగోలు గోజాతిపై లోతైన అవగాహన కలిగిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ముఖ్యాంశాలు డా. శివరాం (78936 92277) మాటల్లోనే..
ఔషధ విలువలున్న పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతం, ఘనజీవామృతం, సబ్బులు, షాంపూలు నాణ్యంగా ఉంటాయి. ఆవు పేడ, మూత్రంలో ఔషధ విలువలున్నప్పుడే గో ఆధారిత వ్యవసాయంలో రైతులు ఆశించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. రోజంతా కట్టేసి ఉంచకుండా శీతాకాలంలో 7–8 గంటల పాటు దేశీ ఆవులు ఆరుబయట తిరిగే ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా గోశాలల్లో ఉన్న ఆవుల సంఖ్యకు తగినట్లు భూమి అందుబాటులో లేకపోవడం వల్ల ఆవులు ఆరుబయట తిరగలేని స్థితి నెలకొంది. ఏ గోశాలలోనూ దేశీ గోజాతుల అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు.
గోశాలలను సక్రమంగా నిర్వహించాలంటే వంద గోవులకు తిరిగి మేత మేయడానికి 50 ఎకరాలు, పచ్చిగడ్డి పెంపకానికి 15 ఎకరాలు, షెడ్లకు 70 ఎకరాల చొప్పున భూమి అవసరం ఉంటుంది. 100 ఆవులకు 3 ఇంచుల నీటిని ఇచ్చే 2 బోర్లు ఉండాలి. ఆవులు తిరిగి గడ్డి మేయడానికి కేటాయించిన భూమిని 6 భాగాలుగా చేసి, ఒక్కో భాగంలో పదేసి రోజుల చొప్పున ఆవులను మేపాలి. రెండు నెలల్లో గడ్డి బాగా పెరుగుతుంది కాబట్టి ఆవులు తిరుగుతూ గడ్డి మేయడానికి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం అన్నవరం, సింహాచలంలలో గోశాలలకు తప్ప.. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహిస్తున్న చాలా గోశాలలకు ఈ వసతుల్లేవు. పచ్చిగడ్డి పెంచడానికి తగినంత స్థలం అందుబాటులో ఉంటే ఆవులకు దాణా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఖర్చు కూడా తగ్గుతుంది.
ఒంగోలు, పుంగనూరు వంటి దేశీ గోజాతుల అభివృద్ధిపై ఏ గోశాలలోనూ దృష్టి కేంద్రీకరించడం లేదు. దేశీ గోజాతులను అభివృద్ధి చేసుకుంటేనే ఆలయాలకు స్వచ్ఛమైన దేశీ ఆవుల పాలు అందుబాటులోకి వస్తాయి. పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్యాకెట్ల పాలతో అభిషేకం చేయడం వల్ల శివలింగం కరిగిపోతున్నదని గుర్తించి, నేరుగా లింగంపై అభిషేకం చేయడమే నిలిపివేసే పరిస్థితి నెలకొంది. గతంలో ద్వారకా తిరుమల గోశాలలో రైతులకు గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఇవ్వటం వల్ల ప.గో. జిల్లాలో 3–4 వేల మంది రైతులు రసాయనిక వ్యవసాయాన్ని వదిలి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ఆరోగ్యదాయకమైన పంటలు పండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment