సంధివాతం :ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేద చికిత్స
ఆస్టియో ఆర్థరైటిస్‌ను ఆయుర్వేదశాస్త్రంలో వాతదోష ప్రధాన వ్యాధిగా పరిగణిస్తారు. దీన్ని ‘సంధివాతం’ అని ఆచార్యులు వర్ణించారు. సామాన్య పరిభాషలో కీళ్లు అరిగిపోయాయని చెప్పే ఈ సమస్య 40-45 ఏళ్లు పైబడ్డ వారిలో సాధారణంగా వస్తుంటుంది. ముఖ్యంగా ఆ వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎముకలు ఒకదానికి మరొకటి ఒరుసుకోవడం (రాపిడి) వల్ల కీళ్లలో నొప్పి వస్తుంది. సరిగా నడవలేక, జీవితం దుర్భరమవుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఒకసారి వస్తే అది తగ్గదనే అభిప్రాయం ఉంది. కానీ అది సరైనది కాదు.
మానవ శరీరంలో ఒక రక్షణవ్యవస్థ (డిఫెన్స్ మెకానిజమ్) పనిచేస్తుంది. దీన్నే ఆయుర్వేదంలో ‘వ్యాధిక్షమత్వశక్తి’ (రోగ నిరోధకశక్తి)గా పరిగణిస్తారు. సమస్య చిన్నది అయితే శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుంటుంది. వ్యాధి తీవ్రత (దోష బలం) ఎక్కువ అయితే మరమ్మతు వీలుకాదు. అప్పుడు మోకాలి కీలు, తుంటి కీలు ఉబ్బినట్లు (వాపు) అవుతాయి. కీలు లోపల సున్నితమైన పొర ఉంటుంది. దీన్నే శ్లేషక కల అంటారు. అక్కడ శ్లేషక కఫం ఉత్పత్తి అయి, కీళ్ల సాధారణ కార్యం జరుగుతుంది. వాత ప్రకోపం వల్ల శ్లేషక కఫంతో శ్లేషక కల అరిగిపోయి సంధివాతం వస్తుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీన్ని డీ-జనరేటివ్ మార్పుగా పరిగణిస్తారు.
ఆయుర్వేద చికిత్స పద్ధతులు
ఆయుర్వేద శాస్త్రంలో సంధివాతానికి (ఆస్టియో ఆర్థరైటిస్)మూడు పద్ధతుల ద్వారా చికిత్స చేయవచ్చు.
నిదాన పరివర్జనం: వ్యాధి మూలకారణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఉదాహరణకు పగటినిద్ర, రాత్రిళ్లు మేల్కొని ఉండటం వంటి అంశాలకు దూరంగా ఉండాలి.
ఆహార నియమాలు: సరైన సమయానికి సంతులిత ఆహారం తీసుకోవడం, కాల్షియం అవసరమైతే ఆహారంలో వెన్న శాతం లేని పాలు, పప్పుధాన్యాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే శరీరానికి తగినంత వ్యాయామం, విశ్రాంతి కూడా అవసరం.
శమనశోధన చికిత్సలు: శమనం అంటే దోషాలను శమించే ఔషధాలను సేవించడం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వాతప్రధాన దోషం కనుక దానికి శమనంగా అస్థి ధాతువు (ఎముక) బలానికి అవసరమైన ఔషధాలు వాడాలి. ఆయుర్వేదంలో అలాంటివి కషాయాలు, లేహ్యాలు, తైలాల రూపంలో అభ్యమవుతున్నాయి. అయితే వాటిని వైద్యుల పర్యవేక్షణలో వాడినట్లయితే వేదన, వాపు లాంటి లక్షణాలనుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో వారు ఇక తమ దైనందిన కార్యాలలో చురుగ్గా పాల్గొనే అవకాశం పెరుగుతుంది.
స్నేహకర్మ (అభ్యంగన), స్వేదకర్మ వల్ల కీళ్లలో మంచి మృదుత్వాన్ని సాధించవచ్చు. అలాగే వస్థికర్మ, స్థానిక ధారా, జానువస్తి లాంటి పంచకర్మల వల్ల రోగికి సత్వర ఉపశమనం కలిగించవచ్చు.
ఆస్టియో ఆర్థరైటిస్ (సంధివాత)
లక్షణాలు
ఈ సమస్య వచ్చినప్పుడు కీళ్లలో వాపు, బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో తీవ్రమైన బాధ కలుగుతుంది. కీలుభాగాన్ని సులభంగా కదిలించలేరు. కీళ్ల వద్ద రాపిడి శబ్దం వస్తుంది.
శరీర కదలికలు జరిగినప్పుడు వేదన ఎక్కువవుతుంది. సమస్య తీవ్రత పెరిగినకొద్దీ కీళ్ల భాగాలు ఉబ్బుతాయి. వాపు వస్తూ పోతూ ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి ఎక్కువ అవుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల (ముఖ్యంగా చలికి), అలాగే వ్యాయామ సమయంలో కూడా వేదన పెరుగుతుంది.
{పారంభదశలో బాధ, బిగుసుకుపోవడం (లాకింగ్) ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్‌కు చేరినదశలో హార్మోనల్ హెచ్చుతగ్గుల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
- డాక్టర్ రమణరాజు
(ఎం.డి. ఆయుర్వేద)
స్టార్ ఆయుర్వేద
సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
ఫోన్ : 7416 107 107 / 7416 109 109
www.starayurveda.com