పాప కనబడుట లేదు! | Do not see the baby! | Sakshi
Sakshi News home page

పాప కనబడుట లేదు!

Published Wed, Mar 9 2016 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

పాప కనబడుట లేదు!

పాప కనబడుట లేదు!

హాలీవుడ్ సినిమా / ఫ్లైట్ ప్లాన్
 
థ్రిల్ల్లర్ సినిమాలను రక్తి కట్టించడం చాలా కష్టం. అందులోనూ విమానం లాంటి లిమిటెడ్ లొకేషన్‌లో ఇంకా కష్టం. దానికి డ్రామా, సెంటిమెంట్ జోడించగలిగితే అద్భుతమనే చెప్పాలి.  ఓ స్త్రీ తన భర్త, ఆరేళ్ల పాపతో బెర్లిన్‌లో హాయిగా జీవిస్తోంది. ఆమె ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ కూడా. అనుకోకుండా ఆమె భర్త బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోయాడు. భర్త అంత్యక్రియలు న్యూయార్క్‌లోనే జరిపించడానికి భర్త శవపేటికతో విమానంలో బయల్దేరింది కెయిలీ (జోడీ ఫాస్టర్), కూడా ఆరేళ్ల పాప జూలియా. పాప విమానాన్ని ఓ అద్భుతంగా చూస్తోంది. ఆ విమానం ఇంజన్ల రూపకల్పనలో తల్లి కెయిలీ పాత్ర ఉంది. కిటికీ అద్దం నుంచి ఆకాశాన్ని చూస్తూ అద్దంపై తన చిన్నారి వేలితో హృదయం బొమ్మ వేసింది జూలియా. కెయిలీ విషాదాన్ని దిగమింగుతూ, చిన్న కునుకు తీసి లేచేటప్పటికి పక్కన జూలియా లేదు. ఫ్లైట్ టాయ్‌లెట్స్ అన్నీ వెదికింది - కెయిలీ. తన ఆరేళ్ల పాప కనిపించడం లేదని గగ్గోలు పెట్టింది. విమానంలో ఎవరూ ఆ పాపని చూడలేదన్నారు. ఇటు బెర్లిన్, అటు న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ప్రయాణికుల జాబితాలో జూలియా పేరు లేదు. కెయిలీ దగ్గర బోర్డింగ్ పాస్ మాయమైంది.

37 వేల అడుగుల ఎత్తున ఎగురుతున్న ఆ విమానంలో పాప ఉన్నట్లుండి ఎలా మాయమైంది. కెయిలీ రోదనా-వేదనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆమె మానసికస్థితి సరిగా లేదని భావించారు తోటి ప్రయాణికులంతా. భర్త చనిపోవడంతో పిచ్చిదై అలా మాట్లాడుతుందన్నారు. ఎయిర్‌మార్షల్ జెన్ కార్సన్ ఆమెకి సంకెళ్లు వేసి, పక్కనే ఉండి గమనించసాగాడు. ఫ్లైట్ కెప్టెన్ మార్కస్ రిచ్ మొదట పాప మాయమైందని నమ్మినా, తర్వాత బెర్లిన్ నుంచి వచ్చిన ఓ వైర్‌తో కెయిలీ చెబుతున్నది అబద్ధమనుకుంటాడు. జూలియా తన తండ్రితో కలిసి, రూఫ్ పైనుంచి కిందపడి, తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చనిపోయిందనేది బెర్లిన్ నుంచి వచ్చిన సమాచారం.
 కెయిలీ ఇదంతా అసత్యమని ఎమోషనల్‌గా రియాక్టయింది. ఫ్లైట్‌లో ఉన్న ఓ సైకో థెరపిస్ట్ కెయిలీని ఓదార్చే ప్రయత్నం చేసింది. అప్పుడు కెయిలీకి తన సీటు పక్కనే కిటికీ అద్దం మీద జూలియా గీసిన హార్ట్ బొమ్మ కనపడింది. అంటే జూలియా తనతో ఫ్లైట్ ఎక్కడం నిజం. మాయం కావడం నిజం. బెర్లిన్‌లో చనిపోకపోవడమూ నిజమే. ఆ విమానంలోనే ఎక్కడో ప్రాణాలతోనో, ప్రాణాల్లేకుండానో జూలియా ఉండే ఉంటుంది.

బెర్లిన్ నుంచి బయల్దేరిన ఆ విమానం న్యూయార్క్ చేరుకునేలోగా తన బిడ్డని వెదకాలి. ఆ తల్లి విమానంలో వెదుకులాట ప్రారంభించింది. వాష్‌రూమ్‌లోకి వెళ్లి, తను ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ కాబట్టి - పై కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి - ఎలక్ట్రానిక్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. విమానంలో కలకలం - మరోవైపు కెయిలీ తన భర్త శవపేటికని చూసి, మరింత భావోద్వేగానికి గురయింది. కార్సన్ ఆమెని పట్టుకుని, ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఆమెని అరెస్ట్ చేయడం గ్యారెంటీ అని చెప్పాడు.  ఆమె భర్త శవపేటికలో దాచిన ఎక్స్‌ప్లోజివ్స్‌ను బయటికి తీశాడు ఎయిర్ మార్షల్ కార్సన్. కెప్టెన్ దగ్గరికి వెళ్లి కెయిలీ ఓ హైజాకర్ అని, 50 మిలియన్ల డాలర్లు తను చెప్పిన బ్యాంక్ ఎకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయకపోతే విమానాన్ని పేల్చేస్తానని బెదిరిస్తున్నట్లు చెప్పాడు. నిజానికి ఎయిర్ మార్షల్ కార్సన్, ఫ్లైట్ అటెండెంట్ స్ట్టెఫనీ, బెర్లిన్‌లోని మార్చురీ డెరైక్టర్ ముగ్గురూ కలిపి పన్నిన కుట్ర ఇది. కెయిలీ భర్త డేవిడ్‌ని చంపింది వాళ్లే. పాప జూలియాని అడ్డం పెట్టుకుని - ఈ హైజాక్ డ్రామా రక్తి కట్టించడానికి జూలియాని కిడ్నాప్ చేశారు. మత్తుమందిచ్చి, ఆ ఫ్లైట్‌లోనే ఓ చోట దాచిపెట్టారు. 50 మిలియన్ల డాలర్లు చేతికి అందగానే జూలియాని చంపేసి, ఫ్లైట్ పేల్చేసి, అది కెయిలీ చేసిందని సాక్ష్యాలు సృష్టించబోతున్నట్లు కార్సన్ ప్లాన్ చేశాడు.  ఈ హైజాకింగ్ డిమాండ్‌తో, ఆ ఫ్లైట్‌ని అత్యవసర పరిస్థితుల్లో కెనడాలో ల్యాండ్ చేశారు. కెప్టెన్ మాట్లాడిన మాటలతో తనని హైజాకర్‌గా చిత్రించారని కెయిలీ అర్థం చేసుకుంది.

కెయిలీ ఇదే మంచి అవకాశంగా భావించింది. తనే హైజాకర్ అన్నట్లుగా ప్రవర్తిస్తూ, కార్సన్‌ని, మిగిలిన క్రూని ఫ్లైట్‌లోనే ఉండమంది. కాదని ఎదురు తిరిగితే కార్సన్ ఆడిన నాటకం బయటపడుతుంది. ఫ్లైట్ డోర్ మూతపడగానే - కెయిలీ అగ్నిమాపక యంత్రంతో కార్సన్ తలమీద కొట్టింది. సంకెళ్లు వేసి బంధించింది. అతని జేబులోని డిటొనేటర్‌ను స్వాధీనం చేసుకుంది. స్ట్టెఫనీని చితక్కొట్టింది. బిన్‌లో చివరికి స్పృహ తప్పి ఉన్న తన పాప జూలియాని దక్కించుకోగలిగింది కెయిలీ. అప్పుడు ప్రయాణికులంతా కెయిలీ మాటలని నమ్మారు. తప్పిపోయిన పాప కోసం ఓ తల్లి పడ్డ వేదన, వెదుకులాట వందలాది ప్రయాణికులను కాపాడింది.
 - తోట ప్రసాద్
 
2005లో ఇంగ్లిష్, జర్మన్ భాషల్లో ఈ చిత్రం బడ్జెట్ 50 మిలియన్ డాలర్లు. వసూలు చేసింది 225 మిలియన్ల డాలర్లు. పీటర్ ఎ డేరింగ్ అనే బ్రిటిష్ రచయిత, బిల్లి రే అనే అమెరికన్ రచయిత కలిసి రాసిన ఈ స్క్రిప్టుకి జర్మన్ దర్శకుడైన రాబర్ట్ స్వీబెంట్క్ దర్శకత్వం వహించాడు. అను‘క్షణం’ ఉత్కంఠ కలిగించిన ఈ తాజా తెలుగు చిత్రం కూడా ఇటువంటి కథాంశంతో రూపొందించినదే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement