ఫీటల్ మెడిసిన్ : పిండం గండాలు ఇక దూరం..! | fetus problems may decrease from now onwards | Sakshi
Sakshi News home page

ఫీటల్ మెడిసిన్ : పిండం గండాలు ఇక దూరం..!

Published Wed, Oct 30 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

ఫీటల్ మెడిసిన్ :  పిండం గండాలు ఇక దూరం..!

ఫీటల్ మెడిసిన్ : పిండం గండాలు ఇక దూరం..!

 కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా సమస్య వస్తే... దాన్ని కడుపులో ఉన్నప్పుడే సరిచేయగలిగితే... ఎంత బాగుంటుంది! ఈ అవకాశం ఇప్పుడు నిజంగానే మనకు సొంతం. పురోగతి సాధిస్తున్న ఆధునిక వైద్య శాస్త్రంలో ‘ఫీటల్ మెడిసిన్’ అనే సరికొత్త విభాగం కడుపులో బిడ్డ ఉన్నప్పుడు మనకు మనసులో కలిగే చాలా భయాలను తొలగిస్తోంది, చాలా సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఈ నెల 31న ‘వరల్డ్ ఫీటల్ మెడిసిన్ డే’ సందర్భంగా ఈ విభాగంపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించిందే ఈ ప్రత్యేక కథనం.
 
 ఒక కొత్త జీవి ఉద్భవించడం ఎంత సంక్లిష్టమైన అంశమో, ఎంత అబ్బురం కలిగించే విషయమో తెలిస్తే నిజంగానే అద్భుతమనిపిస్తుంది! మహిళ గర్భంలో ఒకే ఒక్క కణం ఉండే పిండం... అనేక కణాలుగా విడిపోయి, ఆ కణాలు అనేక కణజాలాలుగా, అనేక అవయవాలుగా, అనేక వ్యవస్థలుగా రూపుదిద్దుకోవడం ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. ఇదెంతో లోపరహితంగా జరుగుతూ ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు ఆకృతినిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగితే... అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యమే. దానికి దోహదపడే వైద్యశాస్త్ర విభాగమే ‘ఫీటల్ మెడిసిన్’.  
 
 గర్భం ధరించేది మహిళే అయినా ఆ మాతృత్వపు అనుభూతి అటు దంపతులిద్దరికీ ఆనందం కలిగించే అంశం. సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడే పిండదశలోనే పుట్టబోయే బిడ్డలో కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్ సమస్యలుగా పేర్కొంటారు. అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ పాలెట్) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలకు కూడా పుట్టగానే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) ఉంటే పుట్టిన వెన్వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి శస్త్రచికిత్స చేయాలి.
 
  అందుకే ఇలాంటి సమస్యలున్నాయా అన్న విషయాన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ గర్భవతి, పుట్టగానే తనబిడ్డకు చికిత్స జరిగేందుకు వీలుగా అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రి (టెరిషియరీ సెంటర్)లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. అదే ‘ఫీటల్ థెరపీ. అయితే మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్‌సెఫాలీ అనే కండిషన్‌లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి అసలు గర్భాన్ని కొనసాగించాలా లేదా అన్న సంగతి స్పష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇది త్వరగా జరగాలి. ఎందుకంటే ఒకవేళ ఆలస్యమైతే ఇది పెద్ద ప్రాణానికి ముప్పు తేవచ్చు. ఇది ఫీటల్ మెడిసిన్ విభాగంలో డయాగ్నసిస్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెంటనే చికిత్స అవసరమా తెలుసుకోవచ్చు.
 
 పిండం పెరుగుదల - పర్యవేక్షణ: కడుపులోని పిండం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఏ వారానికి ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న విషయాలను వేలకొద్దీ ఉదాహరణలను అధ్యయనం చేసి, వైద్యశాస్త్రం వాటి ఫలితాలను నమోదు చేసింది. వీటి ఆధారంగా పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో  దానికి అనుగుణంగా ఉందా లేదా అన్న విషయాలను తెలుసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది. ఆ ఎదుగుదల ఆరోగ్యకరం (నార్మల్)గా ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. ఒకవేళ అలా లేకపోతే, దానికి కారణాలు తెలుసుకుని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్ మెడిసిన్’ దోహదపడుతుంది. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే కడుపులో ఉన్న బిడ్డ బరువునూ తెలుసుకునేందుకు అవకాశం ఉంది. దీనికి దోహదపడే విజ్ఞానమే ‘కలర్ డాప్లర్’ సాంకేతికత! ఈ సాంకేతికత సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఆయా సమయాలకు అనుగుణంగా సాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.
 
 మరికొన్ని సమస్యలూ తెలుసుకునే అవకాశం: ప్రతి డాక్టరూ గర్భవతికి ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఇస్తుంటారు. ఫోలిక్ యాసిడ్ అనే పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో భవిష్యత్తులో వెన్నుపాముగా రూపొందే ‘న్యూరల్ ట్యూబ్’ సరిగా రూపుదిద్దుకుంటుంది. ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ‘డీఎన్‌ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం దోహదపడుతుంది. ఒకవేళ అది జరగకపోతే పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగా, మానసికంగా వైకల్యం వచ్చే అవకాశం ఉంది. అలాంటి అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలను తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. వాటికి అవకాశం ఇచ్చే వైద్య విభాగమే... ‘ఫీటల్ మెడిసిన్’. ఇలా వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేస్తారు.
 
 ఇందులో ఆల్ఫా ఫీటో ప్రోటీన్‌ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్‌సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్ పాళ్లను తెలుసుకుంటారు. ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి లేదు. అయితే ఇలా పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్ అనే పరీక్ష నూ, యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్ ఫలితం వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్ పాజిటివ్‌నా) అన్నది నిర్ధారణ చేస్తారు.
 
 క్రోమోజోమల్ సమస్యలు: ప్రతికణంలోనూ నిర్దిష్టంగా క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే ఆ జీవి... ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డ జన్యుపరమైన లోపాలతో పుడుతుంది. అలా పుట్టే బిడ్డలకు బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్ సిండ్రోమ్’. ఇలా డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ద కంబైన్‌డ్ టెస్ట్ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్‌డ్ టెస్ట్ అని పిలుస్తారు. దీన్ని గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు.
 
 జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలు: బిడ్డ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇందులో క్రోమోజోమల్ సమస్యలూ తెలుస్తాయి. ఈ పరీక్ష ద్వారా బిడ్డలోపలి అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ-చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, కడుపులోపలి భాగాల గురించి తెలుసుకోవచ్చు.
 
 జెనెటిక్ కౌన్సెలింగ్‌కు అవకాశం: ఫీటల్ మెడిసిన్ విభాగపు నిపుణులు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండోగర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు ఫీటల్ మెడిసిన్ నిపుణులు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించి, ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, తద్వారా కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుని, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.
 - నిర్వహణ: యాసీన్
 
 రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ?
 చాలా సందర్భాల్లో రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్‌సాంజియస్ మ్యారేజెస్) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్యసమస్యలు ఎక్కువగా వస్తాయని చాలామంది చెబుతుంటారు. ఇదెందుకు జరుగుతుందో పరిశీలిద్దాం. ఒక కొత్తజీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే సమాచార కణాంగాలు. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారనుకుందాం. అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపభూయిష్టంగా ఉందనుకుందాం.
 
  ఉదాహరణకు తండ్రిలోని ఆ జన్యువులో లోపం ఉందనుకుందాం. అలా లోపం ఉన్న జన్యువును రిసెసివ్ జీన్ అంటారు. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు లోపంతో ఉన్న తండ్రి నుంచి వచ్చిన జన్యువును డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును డామినెంట్ జీన్ అంటారు. దాంతో ఈ డామినెంట్ జీన్ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. అదే దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్ జీన్సే ఉంటాయి. తద్వారా ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసీజెస్ (జన్యుపరమైన లోపాలు) వస్తాయి. కాబట్టి ఇద్దరి జన్యువుల్లోనూ అదే తరహా లోపాలు ఉన్నప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు లేకపోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువన్నమాట. అందుకే రక్తసంబంధీకుల్లో వివాహాలు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే రిస్క్ అధికం. అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు చేసుకోకపోవడమే మంచిదని ఆధునిక ‘ఫీటల్ మెడిసిన్’ పేర్కొంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement