బాల్యం  వారికిద్దాం బరువు  మనం మోద్దాం | Healthy evolution of children to understand children | Sakshi
Sakshi News home page

బాల్యం  వారికిద్దాం బరువు  మనం మోద్దాం

Published Mon, Aug 20 2018 12:02 AM | Last Updated on Mon, Aug 20 2018 5:04 AM

 Healthy evolution of children to understand children - Sakshi

పెద్దవాళ్లు ట్రిమ్‌ చేస్తుంటే తీర్చిదిద్దినట్లు క్రోటన్‌ మొక్కల్లా పెరుగుతున్న పిల్లలు సహజమైన వికాస పరిమళాలను మాత్రం వెదజల్లలేకపోతున్నారు. ఇప్పుడొస్తున్న వాణిజ్య ప్రకటనలు ఈ పరిస్థితిని మార్చి పిల్లల్ని అర్థం చేసుకునేలా  పెద్దల్నే తీర్చిదిద్దుతుండడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం.

నెస్లే.. మ్యాగీ నూడుల్స్‌ను ఇండియాలో మార్కెట్‌ చేయడానికి ఇక్కడి టీమ్‌ చాలానే కసరత్తు చేసిందట. అప్పటి దాకా మన దగ్గర నిమిషాల్లో అయిపోయే స్నాక్స్‌ ఏవీ లేవు. నూడుల్స్‌ వంటి చైనీస్‌ ఫుడ్‌ మనింట్లో ఘుమఘుమలాడించిన దాఖలా అంతకన్నా లేదు. అలాంటి సంప్రదాయంలో మ్యాగీని ఎలా ఇమడ్చాలి? ఆ మార్కెటింగ్‌ స్ట్రాటజీని ఎలా తయారు చేయాలి? ‘‘పిల్లలు... యెస్‌ వాళ్లను టార్గెట్‌ చేస్తే..?’’ అనుకున్నారు నెస్లే ఇండియా అప్పటి మార్కెటింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ సంగీతా తల్వార్‌. పిల్లలకు ఏదైనా ఆటే. తినడం కూడా! స్పూన్‌తో తీసుకుంటూ ఉంటే నూడుల్స్‌ జారిపోతూ ఉండడం.. మళ్లీ వాటిని ఫోర్క్‌కు చుట్టుకోవడం నోట్లో పెట్టుకుని చివరి నూడుల్‌ను లోపలికి పీల్చుకోవడం.. పిల్లలు ఎంజాయ్‌ చేస్తారని అనిపించింది.  పైగా అప్పుడు పిల్లల్ని ఏ యాడ్‌ ఏజెన్సీలూ పెద్దగా పట్టించుకోవడంలేదు.. పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే వాళ్లను పెట్టుకుని రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీని మార్కెట్‌ చేసి ఇప్పుడు పెద్దవాళ్లకూ ఫేవరేట్‌ అయ్యేంత ప్రాచుర్యంలోకి తెచ్చింది. 

మింగేస్తున్నాం
పిల్లలు నిన్నమొన్నటిదాకా  నెగ్లెక్టెడ్‌ కేటగిరీయే. వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఇష్టాఇష్టాలు, వాళ్లవే అయిన ఆటలుపాటలు, వాళ్ల పరిశీలనలు, ఆసక్తులు, అభిరుచులను పట్టించుకుంటున్న పెద్దలు నేటికీ తక్కువే. వాళ్లు ఆడినా.. పాడినా.. అబ్బురపడేలా చేసినా.. వెనక పెద్దవాళ్ల బలవంతమే. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ల బాల్యాన్ని స్కెచ్‌ చేస్తున్నది పేరెంట్సే. క్లచెస్‌లో పెద్దవాళ్లకు నచ్చిన ఆకృతిలో పెరుగుతున్న క్రోటాన్‌ మొక్కలు. ఎప్పటికప్పుడు కొమ్మలు, రెమ్మలు కోతకు గురవుతూ చక్కటి తీరులో బాల్యం పెరుగుతోంది.. సహజ పరిమళాలను కోల్పోతూ! ఇక మన పెద్దవాళ్లం.. పిల్లలను ఊరించే మ్యాగీ పెద్దవాళ్లకూ ఆహారమైనట్టు పిల్లల కోసం ఏమీ మిగల్చకుండా వాళ్ల హక్కులను హరించేస్తున్నాం. మన అభిరుచులను వాళ్ల మీద రుద్దుతూ.. వారి బాల్యాన్నీ లాక్కుంటున్నాం. భావితరాల కోసం కించిత్తయినా చింతిస్తున్నామా? చింతన చేస్తున్నామా?

ఇవి కావాలి
ప్రకటనలకు చాలా ప్రభావం ఉంటుంది! మనమెలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా మసులుకోవాలో కూడా మార్కెటే నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే యాడ్స్‌. ఇప్పుడు అవి మానవసంబంధాలనూ వాడుకుంటున్నాయి. తప్పులేదు.. కమాడిటీతోపాటు ఓ విలువనూ సేల్‌ చేసే కమర్షియల్స్‌ ఇప్పుడు అవసరమే.  క్యాడ్‌బరీ చాక్‌లెట్‌ యాడ్‌లా! అన్న హోంవర్క్‌ చేసుకుంటుంటాడు.. దగ్గర్లోనే తమ్ముడు.. టీపాయ్‌ మీద అయిపోయిన చాక్‌లెట్‌ రాపర్‌ పెట్టి కళ్లుమూసుకుని దేవుడికి దండంపెట్టుకుంటుంటాడు.. ‘‘దేవుడా.. ఇది తీసుకొని కొత్త చాక్‌లెట్‌ ఇవ్వూ’’ అని. కళ్లు తెరిచి చూస్తే  ఖాళీ రాపరే కనిపిస్తుంది వెక్కిరిస్తున్నట్టుగా. ఏడుపు మొహం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుని వేడుకుంటాడు దేవుడిని. కళ్లు తెరుస్తాడు. చాక్‌లెట్‌. తమ్ముడి కళ్లు మెరుస్తాయి. అన్న దగ్గరకు పరిగెత్తుకెళ్లి.. దేవుడు చాక్‌లెట్‌ ఇచ్చాడు అని చెప్తాడు. ‘‘ఒక్కటేనా? నా కోసం కూడా ఎందుకడగలేదురా?’’ అంటాడు అన్న. ‘‘అయ్యో.. నెక్స్‌›్ట టైమ్‌’’ అని తుర్రుమంటాడు తమ్ముడు. అన్న మొహంలో నవ్వు. అప్పుడు వాళ్లమ్మ వచ్చి అడుగుతుంది.. ఆ ఖాళీ రాపర్‌ నన్ను పడేయమంటావా? నువ్వు పడేస్తావా?’’ అని. అన్న అమ్మను చూస్తాడు. తమ్ముడి కోసం అన్న చేసిన త్యాగం. అమ్మానాన్న నేర్పిన ప్రేమ. ఒకరికోసం ఒకరనే భావన! ముందు ఇంట్లో సిబ్లింగ్‌ రైవల్రీ లేకపోతే భారతీయులంతా సోదరసోదరీమణులే.. ద్వేషమంటే తెలియకుండా పెరుగుతారు కాబట్టి. ఈ విషయాన్ని పెద్దవాళ్లకూ చెప్పాలి. పేరెంటింగ్‌ నేర్పాలి. క్యాడ్‌బరీ యాడ్‌ అదే చేసింది. 

ఫస్ట్‌ కాదు బెస్ట్‌
ఇది క్లాస్‌మేట్‌ కంపాస్‌బాక్స్‌ యాడ్‌. లెక్కల్లో తక్కువ మార్కులు వస్తాయి పాపకు. ఫస్ట్‌ మార్క్స్‌ వస్తే చాక్‌లెట్‌ కేక్‌ చేస్తానని ప్రామిస్‌ చేస్తుంది అమ్మ. అందుకే కేక్‌ చేయొద్దులే మార్కులు రాలేదు అంటుంది కూతురు స్కూల్‌నుంచి వస్తూనే నిస్సత్తువగా. అమ్మ రాత్రి అమ్మాయి అసైన్‌మెంట్‌ బుక్‌ చూస్తుంది. ప్రతిసారీ మార్క్స్‌ ఇంప్రూవ్‌ అవుతూంటాయి. తెల్లవారి పాప బడికెళ్లే టైమ్‌కల్లా చాక్‌లెట్‌ కేక్‌ డైనింగ్‌ టేబుల్‌ మీద రెడీగా ఉంటుంది. బిడ్డ కళ్లు విప్పారుతాయి సంతోషంగా. అంతలోకే మొహం ముడుచుకుపోతుంది. ఫస్ట్‌ రాలేదు కదా కేక్‌ ఎందుకూ? అని అడుగుతుంది. బెస్ట్‌గా ఉన్నందుకు అంటుంది అమ్మ. లైఫ్‌లో ఫస్ట్‌ కాదు బెస్ట్‌గా ఉండాలన్న సందేశం ఆ యాడ్‌దే. అదీ అమ్మానాన్నల నోటి నుంచి రావాలి. మార్కులు, ర్యాంకుల్లో కాదు మానవత్వంలో ముందుండాలి. బెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌గా బతికేలా పిల్లలకు నేర్పాలనే స్పిరిట్‌ను చాటే యాడ్‌ అది. పిల్లలు భవిష్యత్‌ తరాల బాగును ఆలోచించే రేపటి పౌరులుగా తయారు కావాలి. ఆ బాధ్యత పెద్దలుగా మనం ఇప్పుడు నిర్వర్తించాలి. బాల్యాన్ని వాళ్లకిద్దాం. బరువును మనం మోద్దాం. సమాజంలో పిల్లలు నెగ్లెక్ట్‌ అవకూడదు. వాళ్ల స్పేస్‌ను పెద్దలు ఆక్రమించకూడదు! ఈ విషయాన్నే ఇప్పుడొస్తున్న యాడ్స్‌ చక్కగా, మనసుకు హత్తుకునేలా చెబుతున్నాయి. 
– సరస్వతి రమ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement