మీసాల్లో దురద తగ్గేదెలా? | how to decrease to itch mustache? | Sakshi
Sakshi News home page

మీసాల్లో దురద తగ్గేదెలా?

Published Wed, Sep 30 2015 8:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

మీసాల్లో దురద తగ్గేదెలా?

మీసాల్లో దురద తగ్గేదెలా?

హోమియో కౌన్సెలింగ్
 
మా అబ్బాయికి వంటి మీద చిన్న చిన్న కురుపుల్లా వచ్చాయి. వేళ్ల మధ్యలో కూడా పొక్కుల్లా వున్నాయి. వీటిమూలంగా దురదతో చాలా బాధ పడుతున్నాడు. దీనికి హోమియోలో మంచి మందులు ఉంటే తెల్పగలరు.
 - నీలిమ, హైదరాబాద్

 మీ అబ్బాయికి వచ్చినది దురదతో కూడిన ఒక అంటువ్యాధి. ఇది సార్కోప్టెస్ స్కాబీ అనే ఒక పరాన్నజీవి వలన ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది చర్మంలో రంధ్రా లు చేసి దురదను కలిగిస్తుంది. ఈ జీవి ఎగరలేదు కాని చాలా వేగంగా పాకుతుంది. దోమకాటు, నల్లికాటు, కుక్క లేదా పిల్లిని పెంచడం వల్ల వాటి ఒంటి మీద ఉండే రోమాల కారణంగా కూడా దురదతో కూడిన ఇన్ఫెక్షన్ ఉంటుంది. దురద రాత్రిపూట ఎక్కువగా ఉండటం, చర్మం కన్నాలు పడినట్లు ఉండటం గమనించవచ్చు.

 లక్షణాలు: చర్మంపై చిన్న చిన్న కురుపులలాగా, రక్తంతో కూడిన బొబ్బల మాదిరిగా వస్తాయి. ఇవి చేతివేళ్లమధ్యలో, మణికట్టు, కీళ్లవెనుక, నడుము, నాభి, పాదాల దగ్గర ఎక్కువగా వస్తాయి. దురద మొదట తక్కువగానే ఉంటుంది. కాని కాలం గడిచేకొద్దీ దురద ఎక్కువ అవుతుంది. నిద్రాభంగం కూడా అవుతుంది. గోక్కోవడం  వలన చర్మం దెబ్బతిని ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.  
 కారణాలు: వ్యాధిగ్రస్థులు వాడే వస్తువులు వాడటం వలన, ఇతరుల పక్కబట్టలు, వ్యాధి కలవారిని తాకినా వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణంగా మానసిక వికలాంగులలో, శరీరభద్రతావ్యవస్థ లోపించిన వారిలో, ఎయిడ్స్, లింఫోమా ఉన్న వారిలో రావచ్చు. మోకాళ్లు, అరచేతులు, నుదురు, అరికాళ్లలో ఎక్కువగా వస్తుంది. చర్మం మొదట పొడిబారిపోయి పొట్టులాగా ఏర్పడుతుంది. తర్వాత పులిపిర్లలాగా లేదా చీముగడ్డలలాగా మారుతుంది. గోళ్లు మందంగా అయ్యి, రంగు మారతాయి. దుర్వాసనతో కూడిన చెమటలు ఎక్కువగా పడతాయి. చలిని తట్టుకోలేరు. దురద  ఉంటుంది కాని సాధారణ స్కాబిస్ ఇన్ఫెక్షన్‌లా ఇందులో దురద అంత తీవ్రంగా ఉండదు. పుండు ఉన్న చోట చుట్టూ చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. లింఫ్ గ్రంథుల వాపు, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలు కనపడతాయి. మానసిక ఆందోళన అధికమైన కొద్దీ దురద, చిరాకు, మంటలు ఎక్కువ అవుతాయి.

నివారణ: వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, వ్యాధిగ్రస్థులు వాడిన దుస్తులు, దువ్వెనలు తదితర వస్తువులను ఉపయోగించకపోవటం, లక్షణాలు కనిపించినప్పుడే అశ్రద్ధ చేయకుండా వైద్యుని సంప్రదించడం అవసరం.
 
స్టార్ హోమియోపతి చికిత్స: మెర్క్‌సాల్, హెపార్ సల్ఫ్, పెట్రోలియా, సారస్పరిల్లా, ఎకినీషియా వంటి మందులను వ్యాధి లక్షణాలను బట్టి, రోగి వ్యక్తిత్వాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుని మందును నిర్ధారిస్తారు.
 
కార్డియాలజీ  కౌన్సెలింగ్
 
నా వయసు 23 ఏళ్లు. గత ఐదేళ్లుగా రుమాటిక్ ఫీవర్‌తో బాధపడుతున్నానను. ప్రస్తుతం నేను పెన్సిలిన్ ఎల్‌ఏ 1200 తీసుకుంటున్నాను. ఇంకా రెండేళ్ల వరకు పెనిడ్యూర్ ఇంజెక్షన్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇంజెక్షన్ తీసుకోకపోతే నాకు ఒక్కసారిగా కీళ్లనొప్పి, ఛాతీలో నొప్పి మొదలవుతాయి. నేను ఎంతకాలం ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వివరంగా చెప్పండి.
 - మురళీకృష్ణ, కందుకూరు

 మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీ గుండెలోని ఎడమవైపు గదుల్లో ఉండే  మైట్రల్ వాల్వ్ వనే కవాటం పరిమాణం పెరిగి మందమైనట్లుగా తెలుస్తోంది. కాబట్టి గుండె సంకోచం జరిగేటప్పుడు రుమాటిక్ ఫీవర్ వస్తోంది. కాబట్టి మైట్రల్ వాల్వ్‌కు ఎలాంటి ఇన్షెక్షన్ సోకకుండా, నష్టం జరగకుండా మీరు పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ (ముందుజాగ్రత్తగా) ఇంజెక్షన్ వాడాల్సి ఉంటుంది. మీ వాల్వ్ పరిస్థితిని పరిస్థితులను గమనించడానికి పన్నెండు నెలలకు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. మీరు పాల ఉత్పాదనలు (డయరీ ప్రాడక్ట్స్), పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యులను సంప్రదిస్తూ ఉంటే  మీరు అందరిలాగే పూర్తికాలం జీవించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
 
మా నాన్నగారి వయసు 60 ఏళ్లు. బరువు 90 కిలోలు. గత మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌ను సంప్రదిస్తే కరొనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష నిర్వహించి, గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని చెప్పారు. ఇది కండరాలకు సంబంధించిన నొప్పి అని తేల్చారు. అయితే ఛాతీలో నొప్పికి కారణం ఏమిటో తెలియడం లేదు. దయచేసి మా నాన్నగారి విషయంలో తగిన సలహా ఇవ్వండి.
 - జయకుమార్, నందిగామ

 సాధారణంగా ఛాతీలో నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఛాతీ భాగంలో కండరాలు, ఆహారనాళం, ఊపిరితిత్తులు, దాని పొరలు... ఇలా అనేక అంతర్గత భాగాలు ఉంటాయి. కరొనరీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బహుశా అది గ్యాస్ట్రయిటిస్ సమస్య కావచ్చు. అయితే నిర్దిష్టంగా సమస్యను నిర్ధారణ చేయడానికి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 26 ఏళ్లు. నాకు మీసాలలో విపరీతమైన దురద వస్తోంది. రోమం మూలల్లో ఇది ఎక్కువగా  అనిపిస్తోంది. గత నెల రోజులుగా ఇలా జరుగుతోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
 - కిశోర్, హైదరాబాద్

 మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీరు సెబోరిక్ డర్మటైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీసాలలో దురద రావడం అనే సమస్య సెబమ్ అనే నూనె వంటి స్రావం ఎక్కువగా స్రవిస్తున్నందువల్ల కావచ్చు. మీ సమస్యను అధిగమించడానికి ఈ కింది సూచనలు పాటించండి.
   మోమటోజోన్‌తో పాటు టెర్బనాఫిన్ యాంటీ ఫంగల్ ఉండే కార్టికోస్టెరాయిడ్ కాంబినేషన్ క్రీమును ప్రతిరోజూ రాత్రిపూట మీ మీసాల వద్ద చర్మంపై రాసుకోండి. ఇలా పది రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.   కొద్ది నెలల పాటు ఐసోట్రెటినాయిడ్ టాబ్లెట్లను నోటి ద్వారా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్య సత్వర పరిష్కారానికి డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
నా వయసు 31 ఏళ్లు. నేను రజస్వల అయినప్పటి నుంచి నా శరీరం దుర్వాసన ఎక్కువగా వస్తోంది. రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్నా ఈ దుర్వాసన తగ్గడం లేదు. నా సమస్యకు సరైన పరిష్కారం ఇవ్వండి.
 - ఒక సోదరి, గుంటూరు

 కొంతమందిలో చర్మంపై ఉండే సెబేషియస్ గ్లాండ్స్ చాలా ఎక్కువగా పనిచేస్తుంటాయి. చర్మంపై ఉన్న ఈ గ్రంథుల నుంచి సీబమ్ అనే ఒక రకమైన నూనె స్రవిస్తుంటుంది. ఈ స్రావాలకు చెమట కూడా తోడైతే, దాని వల్ల చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా చర్మం నుంచి దుర్వాసన వస్తుంది. దీన్ని అధిగమించడానికి మీరు చేయాల్సినవి...  మీ చర్మంపైన ఎక్కువ చెమట పట్టే బాహుమూలాల వంటి ప్రదేశాల్లో కొద్దిపాటి సువాసన ఉండే యాంటీబ్యాక్టీరియల్ మెడికేటెడ్ సబ్బుతో రోజుకు మూడు సార్లు శుభ్రపరచుకోండి.  ఆ ప్రాంతాలలో రోజూ టాల్కమ్ పౌడర్‌ను చల్లుకోండి.  రోజూ ఉదయం పూట అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ ఉండే లోషన్‌ను ఒంటిపై రాసుకోండి. ఇది మిమ్మల్ని మరింత సేపు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.  అప్పటికీ మీ ఒంటి దుర్వాసన తగ్గకపోతే మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement