చలికాలం అమ్మోకీళ్లు | joints pains in winter | Sakshi
Sakshi News home page

చలికాలం అమ్మోకీళ్లు

Published Wed, Dec 21 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

చలికాలం అమ్మోకీళ్లు

చలికాలం అమ్మోకీళ్లు

కంట్లో నీళ్లు

ఆరంభం నుంచీ వ్యాయామం లేకపోవడం, సరైన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి అధికమవ్వడం, అధిక బరువు / స్థూలకాయం, మహిళల్లో అయితే హార్మోన్ల ప్రభావం... ఈ అంశాలన్నీ కీళ్ల ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేసేవేనని చెప్పుకోవచ్చు.

కీళ్ల సమస్యలు... వందలాది రకాలు!
నొప్పితో బయటపడే కీళ్ల వ్యాధులలో ప్రధానంగా కొన్ని వందల రకాల సమస్యలు ఉంటాయి. అయితే కీళ్లకు సంబంధించి ప్రధానంగా... కీళ్ల అరుగుదల, కీళ్ల వాతం వంటివి మనం తరచూ చూసే సమస్యలు. ఇవి నిత్యం మన సమాజంలో కనిపిస్తుంటాయి. కీళ్ల అరుగుదల (ఆస్టియో ఆర్థరైటిస్‌) అనే సమస్య సాధారణంగా వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌) ఎవరిలోనైనా కనిపించే సమస్య. అయితే ముఖ్యంగా స్త్రీలలో ఇటీవల చిన్న వయసులోనే ఇది బయటపడుతుంది. ఇక వయసు పైబడుతున్న కొద్దీ, ఆహారపుటలవాట్లు మారుతున్న కొద్దీ, సొరియాసిస్‌ వంటి చర్మ సంబంధమైన వ్యాధులు సోకినప్పుడు, మహిళల్లో హార్మోన్లకు సంబంధించిన తేడాలు వచ్చినప్పుడు... అవన్నీ కీళ్ల మీద ప్రభావం చూపుతాయి. రకరకాల కీళ్ల సమస్యలకూ, కీళ్లనొప్పులకు కారణమవుతాయి. ఉదాహరణకు గౌటీ ఆర్థరైటిస్‌ అన్నది మాంసాహారం ఎక్కువగా తీసుకునే వారిలో, ఆల్కహాల్, స్మోకింగ్‌ వంటి అలవాట్లు ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఇలా జరిగితే అనుమానించాల్సిందే..!
శరీరంలోని ఏ కీలు అయినా కొన్ని నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపెడుతూ, అక్కడి కదలికలు కష్టంగా మారినప్పుడు... కాలం గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రతరమవుతున్నప్పుడు కీళ్లకు సంబంధించిన సమస్య ఉందేమోనని అనుమానించాల్సి ఉంటుంది. కీళ్ల అరుగుదల వల్ల మన శరీర బరువును మోసే పెద్ద జాయింట్స్‌పై ప్రభావం చూపుతుంది. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్‌ అంటారు. ఇక సమస్య వల్ల చిన్న కీళ్లు ప్రభావితమైతే క్రమంగా ఆ దుష్ప్రభావం పెద్దకీళ్లకు విస్తరిస్తుంది. ఈ సమస్యను ‘రుమాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు. దీన్నే ‘కీళ్ల వాతం’గా పేర్కొనవచ్చు.  

సమస్య నిర్ధారణ ఇలా...
రోగి వయసు, వారిలో కనిపిస్తున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకొని అది ఏ రకమైన కీళ్ల సమస్య కావచ్చు అన్న అంశాన్ని నిపుణులు నిర్ధారిస్తారు. కొన్ని కండిషన్స్‌ను అనుమానిస్తారు. వాటి నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేస్తారు. కీళ్ల అరుగుదల సమస్య నిర్ధారణ కోసం ఎక్స్‌–రే తీయించడం, అలాగే కీళ్ల వాతం లేదా ఇతర ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌తో తలెత్తే జాయింట్‌ పెయిన్స్‌ను నిర్ధారణ చేయడానికి ఆర్‌.ఏ ఫ్యాక్టర్, యాంటీ సీసీపీ, ఈఎస్‌ఆర్, సీఆర్‌పీ (సీ–రియాక్టివ్‌ ప్రోటీన్‌), ఏఎన్‌ఏ, హెచ్‌ఎల్‌యే–బి27 వంటి రక్త పరీక్షలు అవసరమవుతాయి.

నివారణలు – జాగ్రత్తలు
కీళ్లనొప్పులు తొలి దశలో ఉండి... అవి మరింత ముదరకుండా చూసుకోవాలన్నా లేదా కీళ్లనొప్పులను సాధ్యమైనంత ఆలస్యం చేయాలనుకున్నా... మోకాళ్లు మడిచి బాసింపట్టు వేయకుండా ఉండటం, చక్లంముక్లం వేసుకోకుండా ఉండటం, కింద కూర్చోకుండా కుర్చీ మీదనే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవడం, వెస్ట్రన్‌ టాయ్‌లెట్‌ను వాడటం, కుదిరినంతవరకు టైబుల్‌పైనే భోజనం చేయడం, చిన్న చిన్న నొప్పులను తగ్గించుకునే విధంగా ఫిజియోథెరపీ చేయడం, కొన్ని మందులు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో నొప్పులను తేలిగ్గానే నివారించుకోవచ్చు. నయం చేసుకోవచ్చు. పెరగకుండా చూసుకోవచ్చు.

అవసరాన్ని బట్టి డాక్టర్‌ సలహా మేరకు క్యాల్షియమ్, విటమిన్‌–డి సప్లిమెంట్లు, రోజ్‌హిప్‌ టాబ్లెట్లు వాడితే మరికొన్ని కీళ్ల సంబంధమైన సమస్యలకు మంచి ఉపశమనం దొరుకుతుంది. నొప్పి తీవ్రతను బట్టి పెయిన్‌ కిల్లర్స్, జాయింట్‌లలో సైనో వియల్‌ ఫ్లూయిడ్‌ సప్లిమెంట్స్‌ను ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవడం అవసరం పడవచ్చు. కీళ్లనొప్పులు, కీళ్లు బిగుసుకుపోయినట్లుగా ఉండటం (జాయింట్‌ స్టిఫ్‌నెస్‌) వంటి సమస్య ఎక్కువవుతూ చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే... వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రతించాలి. అప్పుడు వారు తగిన పరీక్షలు చేసి, ఇక చివర ప్రత్యామ్నాయంగా... కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు (జాయింట్‌ రీ–ప్లేస్‌మెంట్‌ సర్జరీ)లను సూచిస్తారు. ఇది మరీ ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇలా సర్జరీని ఆలస్యం చేయడం వల్ల ఒక్కోసారి ఆ కీళ్లు మరింతగా అరిగిపోయి రీ–ప్లేస్‌మెంట్‌ ప్రక్రియ క్లిష్టతరంగా మారే అవకాశం ఉంది.

చలికాలంలో కీళ్లనొప్పులను తగ్గించుకునేదెలా?  
చలికాలంలో మన కండరాలు బిగుసుకుపోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి రక్తసరఫరా ఎక్కువవుతుంది. ఫలితంగా కీళ్ల ఇంకా ఎక్కువగా నొప్పి కలుగుతుంది. ఈ తీవ్రతను తగ్గించడం కోసం ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాలి. దాని వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది.

కీళ్లను వెచ్చగా ఉంచేందుకు వార్మ్‌ క్లోతింగ్‌తో పాటు చేతులకు గ్లోవ్స్, మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి ‘నీ క్యాప్‌’ వేసుకోవడం మంచిది.

వింటర్‌లో నీళ్లు తాగడం తగ్గిపోతుంది. దాంతో డీ హైడ్రేషన్‌ కారణంగా నొప్పులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవడం మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.

కాల్షియమ్, విటమిన్‌–డి సప్లిమెంట్లతో పాటు, వాపుని తగ్గించే ఒమెగా–3, ఒమెగా–6, ఒమెగా–9 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి.

తరచూ ఒంటిని సాగదీస్తున్నట్లుగా ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్‌) చేస్తుండటం వల్ల నొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, అవసరమైతే నొప్పిగా ఉన్న కీళ్లను ఉప్పు (కళ్ళుప్పు) వేసిన గోరు వెచ్చటి నీళ్లలో కాసేపు మునిగి ఉండేలా చూడటం మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

►  చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి క్రాస్‌ ట్రైనర్, స్టేషనరీ సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.


  జాయింట్స్‌ దగ్గర వాపు ఉంటే ఐస్‌ ప్యాక్‌ పెట్టడం మంచి ఉపశమనాన్నిస్తుంది.
   కండరాలు రిలాక్స్‌ కావాలంటే గోరువెచ్చటి నువ్వుల నూనెతో తేలిగ్గా మసాజ్‌ చేసుకోవడం కూడా మంచి ఉపశమనాన్నిస్తుంది.
    బరువు పెరగకుండా ఉండేందుకు ఒంటికి అవసరమైన అన్ని పోషకాలూ అందేలా సమతుల ఆహారం తీసుకోవడం అన్నది కీళ్లకూ మేలు చేస్తుంది.
   అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే పెయిన్‌ కిల్లర్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ ఇంజెక్షన్స్‌ తీసుకోవడం ద్వారా కీళ్లనొప్పుల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

ఆరోగ్యంగా ఉండేవారికి చలికాలం ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ భయాలు అధికమవుతాయి.æవారి సమస్యలు చలిపెరిగే కొద్ది తీవ్రమవుతుంటాయి కాబట్టే వారికి ఆ ఆందోళన. కీళ్లనొప్పులతో బాధపడేవారు చలికాలంలో లేదా చల్లటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు శారీరక, కీళ్ల కదలికలతో వచ్చే నొప్పుల వల్ల తాము అనుకున్నవిధంగా ప్రకృతిని ఆస్వాదించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఒకప్పుడు 70 ఏళ్లకు పైబడిన వారికి జాయింట్‌ పెయిన్స్‌ కారణంగా బాధలకు గురయ్యేవారు. అయితే ఇటీవల కేవలం నలభై ఏళ్ళ వయసులోనే నాలుగు అడుగులు వేయలేక బాధపడేవారినీ చాలా మందినే చూస్తుంటాం. అలాంటి వారంతా ఈ సీజన్‌లో వచ్చే తమ కీళ్ల నొప్పులకు కారణాలనూ, తగ్గించుకునేందుకు మార్గాలనూ తెలుసుకోవడం కోసమే ఈ కథనం.

డాక్టర్‌ దశరథ
రామారెడ్డి తేతలి,
చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, యశోద
హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement