బ్యాంకు చార్జీలపై కన్నేయండి
ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతేనో.. లేదా చెక్కులు బౌన్స్ అవుతేనో బ్యాంకులు పెనాల్టీలని, ఇతర చార్జీలని వడ్డిస్తుంటాయని అనుకుంటాం. కానీ, ఇవే కాకుండా ఇతర చార్జీలు కూడా చాలానే ఉంటాయి. ఉదాహరణకు.. చెక్కుల వాడకాన్ని చాలా మటుకు తగ్గించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఇంటి అద్దె నుంచి మిగతా బిల్లుల దాకా ప్రతీ
దానికి చెక్కు నింపే అలవాటు ఉన్నవారు.. బ్యాంకులకు మరికాస్త ఎక్కువే కట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంకులు ప్రతి ఏటా నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే చెక్ లీఫ్‌లను ఉచితంగా ఇస్తాయి. అవి కూడా పూర్తయిపోయి మరిన్ని చెక్కులు కావాలంటే అదనంగా కట్టాల్సిందే. కొన్ని బ్యాంకులు ఏటా 25-50 దాకా ఉచిత చెక్కులు ఇస్తున్నాయి. మరిన్ని కావాలంటే.. చెక్కు లీఫ్‌కి రూ. 2 చొప్పున తీసుకుంటున్నాయి. చెక్కుల బాదరబందీ లేకుండా ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపే వీలుంది. అయితే, దీనికీ నగదు పరిమాణాన్ని బట్టి కనిష్టంగా రూ. 2.5 నుంచి చార్జీలు ఉంటున్నాయి.
సర్వీస్ అలర్ట్‌లు..
ఆర్థిక లావాదేవీలు భద్రంగా ఉండాలంటే.. వద్దనుకున్నా కొన్ని చార్జీల నుంచి తప్పించుకోలేము. అలాంటివే సర్వీస్ అలర్టులు. డబ్బు వేసినప్పుడు, తీసినప్పుడు మీకు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్ల రూపంలో బ్యాంకులు అలర్టులు పంపిస్తుంటాయి. ఇందుకోసం కొన్ని బ్యాంకులు ఏడాదికి రూ. 60 దాకా చార్జీలు విధిస్తున్నాయి.
క్రెడిట్ కార్డుల చెల్లింపులు..
సాధారణంగా చాలామంది ఆఖరు నిమిషం దాకా క్రెడిట్ కార్డులకు కట్టాల్సిన వాటిని వాయిదా వేస్తుంటారు. చివర్లో చెక్కు వేస్తే మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో బ్యాంకుకు వెళ్లి డబ్బు కట్టేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డులకు ఇలా డబ్బు రూపంలో కట్టినా బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇలాంటి వాటిపై క్యాష్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 100 వసూలు చేస్తున్నాయి. అటు క్రెడిట్ లిమిట్‌ను మించి వాడుకున్న పక్షంలో ఓవర్‌డ్రాయల్ ఫీజు కింద బ్యాంకును బట్టి కనీసం రూ. 500 అయినా కట్టాల్సి వస్తుంది.
ఒకోసారి ఒక కార్డు మీద చేసిన ఖర్చులను తక్కువ వడ్డీ రేటు ఉంది కదాని వేరే కార్డుకు బదలాయిస్తుంటాం. ఇలాంటప్పుడు కూడా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు అని పడుతుంది. కొన్ని సార్లు బదలాయించిన మొత్తంలో 4 శాతం దాకా కూడా ఈ ఫీజులు ఉంటాయి. కాబట్టి, వడ్డీ తక్కువ కదా అని ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ప్రయోజజనం అటుంచి అంతకన్నా ఎక్కువ కట్టాల్సి వచ్చే పరిస్థితి ఎదురవుతుంది.