చేతులకు ఫోన్‌ దొరక్కుండా చేస్తే..? | Smart Phone Detoxification For Family And Relations | Sakshi
Sakshi News home page

చేతులకు పథ్యం పెట్టండి

Published Thu, Feb 27 2020 11:01 AM | Last Updated on Thu, Feb 27 2020 11:01 AM

Smart Phone Detoxification For Family And Relations - Sakshi

శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో.. బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ దీక్ష  అలా అవసరం. లంకణం పరమౌషధం అన్నారు పెద్దలు.పొట్టను మాడిస్తే జబ్బు పారిపోతుందని అంటారు.మరి చేతులను మాడిస్తే?వాటికి ఫోన్‌ దొరక్కుండా చేస్తే?కంప్యూటర్‌ దొరక్కుండా చేస్తే?టీవీ రిమోట్‌ దొరక్కుండా చేస్తే? చేతులకు పత్యం పెడితే?ఈ పత్యం చాలా మంచిదిఅంటున్నారు నిపుణులు.సోషల్‌ మీడియాకు, స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి వారానికి ఒకసారి లంకణం పెట్టిస్తే కుటుంబ అనుబంధాలుదగ్గరికి వస్తాయి. మనుషులు దగ్గరఅవుతారు. సంతోషం దగ్గరికొస్తుంది.ఒక్కమాటలో చెప్పాలంటే దూరమైనవన్నీ దగ్గరకొస్తాయి.

ఒక కుటుంబం.. అత్యంత సన్నిహితులతో ఆత్మీయసమ్మేళనం జరుపుకుంటోంది. చిన్నాపెద్దా, యూత్‌ అంతా కలిసి పాతిక మంది వరకూ ఉన్నారు. కాని ఆ ఇంట్లో ఏమాత్రం సందడి æలేదు. హాల్లో వినిపిస్తున్న, కనిపిస్తున్న ఎల్‌ఈడీ టీవీ సౌండ్‌ తప్ప. వయసులో పెద్దవాళ్లు నలుగురైదుగురు టీవీలో లీనమయ్యారు. మిగిలిన వాళ్లంతా స్మార్ట్‌ ఫోన్స్‌తో ఎంగేజ్‌ అయ్యారు. పిల్లలు ఎవరికి వారే తమ చేతుల్లో ఉన్న ట్యాబ్స్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నారు. మధ్యవయస్కులు యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటున్నారు. మగవాళ్లు తాము కూర్చున్న చోటే కాస్త పక్కకు తిరిగి ఫోన్‌ మాట్లాడుకుంటున్నారు. మెసేజ్‌ చేసుకుంటున్నారు. ఆడవాళ్లు సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమ్మేళనానికి హాజరైన వారితోనే ఫ్యామిలీ గ్రూప్‌లో చాట్‌ చేసుకుంటున్నారు. అక్కడే వాళ్ల సమక్షంలో దిగిన ఫోటోలనే అందులో పెడుతున్నారు. వాళ్ల పక్కనే ఉన్న వాళ్లు.. ‘వావ్‌ .. నైస్‌.. భలే ఉంది చీర.. డిజైన్‌ చేయించావా?’ ‘ హేయ్‌..  నీ ఫొటో వెనక కనపడుతున్న షో పీస్‌ భలే ఉంది... అమెజాన్‌లో కొన్నావా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలదైతే అదో లోకం. పబ్జీ నుంచి టిక్‌టాక్‌ల దాకా.. ఈ మూల ఒకరు.. ఆ బాల్కనీలో ఒకరు.. కారిడార్‌లో ఒకరు.. కిచెన్‌లో ఒకరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోచోట ఒక్కో యాప్‌లో బిజీ. తీరా ఎప్పటికో పెద్దవాళ్లకు ఆకలేసి టీవీలోంచి మొహం బయటపెట్టి మిగిలిన వాళ్లను పలకరించే ప్రయత్నం చేశారు. ఎవరూ ఈ లోకంలో లేరు. అంతలోకే ఫోన్‌లోంచి తన చుట్టూ ఉన్న పరిసరాల మీదకు దృష్టి మరల్చిన ఆ ఇంటి కోడలికి పరిస్థితి అర్థమై ఆ ఫ్యామిలీ గ్రూప్‌లోనే  మెసేజ్‌ పెట్టింది ‘లంచ్‌ చేద్దామా?’ అంటూ.

‘యెస్‌’ అంటూ ఒకరివెంట ఒకరు రిప్లయ్‌. లంచ్‌ చేసేప్పుడు కూడా చిన్న పిల్లలు తమ చేతుల్లోంచి ట్యాబ్స్‌ తీసి పక్కన పెట్టలేదు. నిజానికి ట్యాబ్స్‌ తీసేస్తే ముద్ద మింగడం లేదు వాళ్లు. దాంతో తల్లులు అందులో రైమ్స్‌ పెట్టి.. అన్నం తినిపించడం మొదలుపెట్టారు. ఆ ట్యాబ్‌ వంకే కళ్లప్పగించి గబగబా ముద్దలు మింగేస్తున్నారు. ఏం తింటున్నామో.. దాని రుచి ఏంటో కూడా తెలియనంతగా.

అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న ఫ్రెండ్స్‌ గ్రూప్‌ ఒకటి సినిమాకు వచ్చింది. అందరూ కలిసి సినిమా చూడాలని ప్లాన్‌ చేసుకొని మరీ వచ్చారు. సినిమా టైమ్‌కు కంటే కాస్త ముందే వచ్చారు. ‘హాయ్‌’ అంటూ విష్‌ చేసుకోవడం తప్ప వాళ్లు మాట్లాడుకున్నదేమీ లేదు. ఎవరి ఫోన్లో వాళ్లు మెసేజ్‌లు, వీడియోలు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలోకే సినిమా టైమ్‌ అయింది. అలాగే ఫోన్లు చూసుకుంటూనే లోపలికి వెళ్లారు. సీట్లు వెదుక్కొని కూర్చున్నారు. సినిమా విన్నారు.. సెల్‌ఫోన్‌ చూసుకున్నారు.

పెళ్లవుతోంది...
పెళ్లికి హాజరైన అతిథుల్లో చాలామంది చేతుల్లో ఫోన్లు. ఆ ఫోన్లలోనే వాళ్ల దృష్టంతా. పెళ్లిని చూసిందే లేదు. నవ్వుకుంటూ ఆటపట్టించుకోవడమూ లేదు. సెల్ఫీలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. ఎన్నాళ్లుగానో కలవని చాలామంది ఆ పెళ్లిలో కలుసుకున్నారు. ఆ ఆనందం ఎవరి మొహాల్లోనూ లేదు పెద్దగా. మాటామంతీ జరపలేదు. కాలక్షేపం అంతా స్మార్ట్‌ఫోన్‌తోనే జరిగింది.

పైన చెప్పిన ఉదంతాలన్నీ ‘హికికొమోరి’కి దగ్గరగా ఉన్నాయి. జపాన్‌లోని యువతను, మధ్య వయస్కులను ఇంకా చెప్పాలంటే స్కూల్‌కు వెళ్లే పిల్లలనూ పీడిస్తున్న మానసిక జాడ్యం హికికొమోరి. ఒక వ్యక్తి తనంతట తానుగా ఇంటికే పరిమితమైపోయి బాహ్య పరిసరాలు, మనుషులకు దూరమైపోవడం ఈ జాడ్యం లక్షణం. ప్రస్తుతం మన దేశంలో మనుషులంతా కలిసి ఒకే చోట ఉన్నా ఫోన్ల వల్ల ఎవరికి వారుగానే ఉన్నారు. అందరూ కలిసి ఒక వినోదాన్ని ఆస్వాదించాలని వచ్చినా ఎవరికి వారే సోషల్‌ నెట్‌వర్క్‌లో వినోదాన్ని వెదుక్కుంటున్నారు. కళ్లముందు వేడుక జరుగుతున్నా మనుషులను, పరిసరాలను గమనించడం లేదు.. గ్రహించడం లేదు. ఎలక్ట్రానిక్‌ డివైజే నేస్తం.. దానితోనే చెలిమి.. అదే ఒక బంధం.. బంధనంగా బతుకుతున్నారు.
దాన్ని నిరోధించాలంటే జీవన శైలి మార్చుకోవాలి అంటున్నాను మానసికవైద్య నిపుణులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు. డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ చేయాలి అంటున్నారు. అంటే శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపడానికి వారంలో ఒకరోజు ఉపవాస దీక్ష ఎలా చేపడ్తామో కుటుంబంతోపాటు చుట్టాలు, స్నేహితులు, నిత్యం మనం మెదిలే పరిసరాలతో బంధాలు, అనుబంధాలు పెంచుకోవడానికి డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ దీక్ష అవసరం అంటున్నారు.

అసలు జీవితం చిన్నదైపోతుంది
స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన మెదడు పూర్తిగా స్మార్ట్‌ఫోన్‌ మీదే ఆధారపడిపోతుంది. అసలు జీవితం చిన్నదైపోతుంది. చేతిలోనో కనుచూపు మేరలోనో ఫోన్‌ కనిపించకపోతే ఏదో అభద్రతగా అనిపిస్తుంది. ఇదొక వ్యసనం. అందులోంచి బయట పడడానికి ఈ డిజిటల్‌ డీటాక్సిఫికేషన్‌ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కసారిగా ఫోన్‌కు దూరంగా ఉండకుండా.. నెమ్మదిగా అంటే ముందు ఓ గంట, తర్వాత గంటన్నర, ఆ తర్వాత రెండు గంటలు.. ఇలా రోజురోజుకు దాన్ని దూరంగా ఉంచే సమయాన్ని పెంచుకుంటూ పోయి వారానికి ఒకరోజు పూర్తిగా ఫోన్‌ ఉపయోగించక పోవడం.. ఆ తర్వాత వారానికి రెండు రోజులు.. ఇలా పెంచుకుంటూ పోయి.. ఆ వ్యసనాన్ని మానుకోవచ్చు. ఈ అడిక్షన్‌ ఆల్కహాలు, స్మోకింగ్‌ లాంటిదే. అలవాటు పడిన మెదడు ఊరుకోదు. అందుకే ఫోన్‌లో గేమ్స్‌ ఆడాలి. అయితే ఒక్క విషయం... ఈ డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియ ముందు పెద్దల నుంచే స్టార్ట్‌ అవ్వాలి. అప్పుడే పిల్లలు మనల్ని అనుసరిస్తారు. – డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

వారానికి ఒకరోజు సెల్‌ఫోన్‌తోపాటు దానికి అనుసంధానంగా ఇంటర్నెట్, అది వాహకంగా ఉన్న సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడం, రోజంతా దాన్ని ఉపయోగించకుండా మన చుట్టూ భౌతిక ప్రపంచానికి దగ్గరగా మెదలడమే డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌. మనుషులను ఆక్రమించుకున్న ఈ సాధనాల వల్ల కలిగే దుష్పరిణామాలు అర్థమై ఇప్పుడు అంతా వాటిని ఉపవసించే పనిలో పడ్డారు. ఈ ఉపవాస దీక్ష ఒక ధోరణిలా మొదలైనా... ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు దీన్నొక శుభపరిణామంగా అనుకోవచ్చు. – కథనం : సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement