తమిళనాడులోని శ్రీవిల్లి వుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడుండేవాడు. ఆయన నిరంతర ం వటపత్రశాయికి మాలా కైంకర్యం చేసేవాడు. అందుకు కావలసిన తులసి వనం కోసం భూమిని దున్నుతుండగా ఒక శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను పిల్లలు లేని ఆ దంపతులు భగవత్ప్రసాదంగా భావించి గోదాదేవి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ బాలిక చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణుని మీద అమితమైన భక్తితో ఉంటూ, స్వామికి సేవించుకుంటూ ఉండేది. తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యం చేస్తుండటం చూసి గోదాదేవి తండ్రి కట్టిన మాలలు ఆయనకు తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతినీటిలో పడిన తన ప్రతిబింబంలో తన సౌందర్యం చూసుకుంటూ తిరిగి ఆ మాలలను యథాస్థానంలో ఉంచేది.
ఒకనాడు మాలలో పొడవాటి వెంట్రుక ఉండడం గమనించిన తండ్రి, చాటుగా ఉండి ఏం జరుగుతోందో చూసి నివ్వెరపాటుతో గోదాదేవిని ‘‘అమ్మా! స్వామికి సమర్పించవలసిన పూలదండను నీవు ముందర ధరించటం అపచారం’’ అంటూ మందలించాడు. నిర్మాల్యమైన ఆ మాలను స్వామికి సమర్పించడానికి మనసొప్పక ఆనాడు పూమాలలు సమర్పించలేకపోయానన్న దిగులుతో నిద్రపోయాడు. విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి కనిపించి తనకు మాలను ఎందుకు సమర్పించలేదని అడిగాడు.
విష్ణుచిత్తుడు తన తనయ చేసిన అపరాధాన్ని వివరించి అందుకే మీకు మాలలను సమర్పించలేక పోయానని విన్నవించుకున్నాడు. వటపత్రశాయి చిరునవ్వుతో విష్ణుచిత్తుని చూసి ‘‘ఈ విషయంలో నీవు చింతించవద్దు. గోదాదేవి ధరించిన దండనే నేను రోజూ ఎంతో ఇష్టంతో స్వీకరిస్తున్నాను. ఇకపై ఆమె కొప్పులో ధరించని పూమాలికలు మాకు వద్దు.’’ అని చెప్పాడు. గోదాదేవి యుక్త వయస్సుకు రాగానే గోపికలు కృష్ణుని పట్ల చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు శ్రీ కృష్ణుని కోసం కాత్యాయన వ్రతమాచరించారని విన్న గోదాదేవికి మంచి మార్గం దొరికినట్లయింది.
ధనుర్మాసంలో తెల్లవారు ఝామున చన్నీటి స్నానం చేసి వటపత్రశాయిని శ్రీ కృష్ణునిగాను, తనను తాను ఒక గోపాంగనగానూ భావించి రోజుకో పాశురాన్ని ద్రావిడ భాషలో రాసి కమనీయంగా పాడుతూ వటపత్రశాయికి ధూప దీప నైవేద్యాలతో కాత్యాయనీ వ్రతం చేసింది. చివరి రోజున రాత్రి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని కలలో కనిపించి ‘నేను నీ పుత్రికను వివాహమాడతాను, సిద్ధంగా ఉండు’ అని చెప్పాడు. మరుసటిరోజు శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళాలతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని, విష్ణుచిత్తుని పల్లకిలో కూర్చుండబెట్టుకుని సగౌరవంగా శ్రీరంగానికి తీసుకొని వెళ్లారు.
స్వామి సూచన మేరకు శ్రీరంగనాథుని అర్చావిగ్రహానికి గోదాదేవినిచ్చి వివాహం చేశారు. గోదాదేవి అందరూ చూస్తుండగా శ్రీరంగనాథుని గర్భాలయం లోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది. శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని ‘మామా’ అని సంబోధించి ఆయనకు తిరుప్పరి పట్టం, తోమాల, శఠకోపం, ఇతర సత్కారాలు చేసి సగౌరవంగా పంపాడు. నిర్మలమైన భక్తి, దృఢసంకల్పం ఉంటే సాధించరానిదేమీ ఉండదని గోదాదేవి ఇతివృత్తం మనకు చాటి చెబుతోంది. అదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment