జనన మరణాల నుంచి విముక్తికి... నచికేతయజ్ఞం | special story for yama | Sakshi
Sakshi News home page

జనన మరణాల నుంచి విముక్తికి... నచికేతయజ్ఞం

Published Sat, Feb 27 2016 11:54 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

జనన మరణాల నుంచి విముక్తికి...  నచికేతయజ్ఞం - Sakshi

జనన మరణాల నుంచి విముక్తికి... నచికేతయజ్ఞం

ఉపనిషత్తులకు తలమానికమూ, దశోపనిషత్తులలో ప్రముఖమూ కఠోపనిషత్తు. రెండు అధ్యాయాలుగా ఉండే ఈ కఠోపనిషత్తు ప్రథమాధ్యాయం ప్రథమవల్లిలో నచికేతుడు అనే బాలుడు యముడి వద్దకు వెళ్లడం, ఆ సమయంలో యముడు అక్కడ లేకపోవడంతో మూడుదినాలపాటు ఆయన ఇంటి ముంగిట నిద్రాహారాలు లేకుండా పడిగాపులు పడటం, యముడు వచ్చి, తన అతిథి తన ఇంట మూడురాత్రులు నిరాహారంగా ఉన్నందుకు ప్రాయశ్చిత్తంగా మూడువరాలు ఇస్తాననడం, ఆ మూడువరాలలో రెండవ వరమైన స్వర్గానికి చేర్చే యజ్ఞమేది అని నచికేతుడు సందేహాన్ని వెలిబుచ్చటాన్ని గురించి గతవారం మనం చెప్పుకున్నాం. నచికేతుడి సందేహానికి యముడు చెప్పిన సమాధానం ఈ వారం...

‘‘నాయనా! స్వర్గానికి చేరటానికి, అనంతలోకాలను పొందటానికి శాశ్వతమైన విద్యగా ఉన్న ఈ రహస్యాన్ని నీవు తెలుసుకో’’ అంటూ యముడు నచికేతుడికి అన్ని లోకాలలో ఆది అయిన అగ్నిని గురించి చెప్పాడు. యజ్ఞానికి ఏ ఇటుకలు ఎన్ని కావాలో, వాటిని ఎలా పేర్చాలో యజ్ఞం ఎలా చెయ్యాలో వివరంగా బోధించాడు. శ్రద్ధగా విన్న నచికేతుడు యముడు చెప్పినదంతా తు.చ. తప్పకుండా అప్పచెప్పాడు. అతని గ్రహణశక్తికి, ధారణశక్తికి యముడు ఎంతో సంతోషించాడు. ‘‘నాయనా! ఈ విద్య ఇకనుంచి నీ పేరుతో ‘నచికేతాగ్ని’గా పిలవబడుతుంది. ప్రకాశంతమైన ఈ హారాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ నచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసినవాడు మూడు రకాల కర్మలు చేసినవాడై జనన మరణాల నుంచి విముక్తుడవుతాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. అగ్నిని సాక్షాత్కరింపజేసుకుని పరమానందాన్ని, శాంతిని పొందుతాడు. నాచికేతాగ్నిని మూడుసార్లు ఉపాసించిన విద్వాంసుడు మృత్యుపాశాన్ని ఛేదిస్తాడు. శోకాన్ని పోగొట్టుకుంటాడు. స్వర్గసుఖాలనుభవిస్తాడు.

 ‘‘నాయనా! ఇక మూడోవరం ఏం కావాలో కోరుకో’’ అన్నాడు యముడు.
‘‘యమధర్మరాజా! మరణించిన తరువాత మానవుడు ఉన్నాడని కొందరు, లేడని ఇంకొందరు అంటున్నారు. ఈ రహస్యాన్ని నీ సన్నిధిలో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది నా మూడోవరం’’ అన్నాడు నచికేతుడు.

 నచికేతుడు అడిగిన మొదటివరం భౌతిక సంబంధం. రెండోవరం యజ్ఞయాగాది కర్మ సంబంధం. మూడోవరం బ్రహ్మజ్ఞాన సంబంధం. మానవుల సాధన, అన్వేషణ ఈ క్రమంలో జరగాలని కఠోపనిషత్తు అనుశాసనం. అందరూ ఒకటి రెండు వరాలతో ఆగిపోతారు. ఆకర్షణలకు లొంగిపోతారు. మూడవ దశకు చేరుకోవడమే ఉత్తమ స్థితి. అందుకే యముడు నచికేతుణ్ణి పరీక్షిస్తున్నాడు.

 యముడు ‘‘నచికేతా! దేవతలకు కూడా నీలాంటి సందేహమే వచ్చింది. ఇది పరమ సూక్ష్మం. తెలుసుకోవడమే కష్టం. సాంతం తెలియదు. ఇది చెప్పమని నన్ను ఒత్తిడి పెట్టకు. ఇంకేమైనా అడుగు ఇస్తాను’’ అన్నాడు.

 ‘‘దేవతలకు కూడా తీరని సందేహాన్ని తేలికగా తెలుసుకోలేని విషయాన్ని నీకన్నా సమగ్రంగా చెప్పగలవారు మరొకరు ఎవరు దొరుకుతారు? కనుక ఈ వరం కంటే మరేదీ గొప్పది కాదు. నాకు ఇదే కావాలి’’ అన్నాడు.

 ‘‘నచికేతా! నూరేళ్లు జీవించే పుత్రపౌత్రుల్ని కోరుకో. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశుసంపదను, బంగారాన్ని, సమస్త భూవలయాన్ని కోరుకో. ఎన్నేళ్లు బతకాలనుకొంటే అంతకాలం బతుకు. మొత్తం భూగోళానికి చక్రవర్తివి అవ్వు. నువ్వు ఏది కోరితే అది జరిగే వరమైనా ఇస్తాను.  అంతేకాని మరణం గురించి చెప్పమని నన్ను అడక్కు’’ అన్నాడు.

‘‘యమధర్మరాజా! నువ్వు చెప్పివన్నీ క్షణికమైనవే. ఇంద్రియాల తేజస్సును నాశనం చేసేవే. నువ్వు ఎంత ఆయుష్షు ఇచ్చినా మానవ జీవితం స్వల్పమే. నాకు ఇస్తానన్న సిరిసంపదలు, భోగాలు అన్నీ నువ్వే ఉంచుకో. మనిషి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తృప్తిపడడు. నీ దర్శనం వల్ల సంపదలు ఎలాగూ వస్తాయి. నువ్వు ఆయుష్షు ఇచ్చినంతవరకు ఎలాగైనా బతుకుతాం. మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకోవాలన్నదే నా కోరిక.

క్షయమూ నాశనమూ లేని నీ దగ్గర నుంచి తాత్కాలికమైన వరాలు పొందాలనీ దీర్ఘకాలం జీవించాలనీ తెలివైనవాడు ఎవరు కోరుకుంటారు? కనుక మృత్యుదేవా! ఇక నన్ను పరీక్షించటం ఆపు. ఎవరికీ తెలియనిదీ, తెలుసుకోలేనిదీ, నువ్వు తప్ప మరొకరు చెప్పలేనిదీ అయిన ఆత్మజ్ఞానాన్ని తప్ప ఈ నచికేతుడు నిన్ను మరో వరం అడగడు. అని నచికేతుడు యమధర్మరాజుకు తేల్చి చెప్పాడు. దీంతో కఠోపనిషత్తు ప్రథమ వల్లి పూర్తి అయింది.  - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement