పేర్లు చెప్పండి చూద్దాం! | special story to womens cricket | Sakshi
Sakshi News home page

పేర్లు చెప్పండి చూద్దాం!

Published Fri, Jul 21 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

special  story to  womens cricket

అబ్బో... మగాళ్లు మహిళలకిచ్చిన గౌరవం తక్కువేం కాదు. అదేదో అన్నారు. ఏమన్నారూ... ఆకాశంలో సగం! మరి భూమ్మీద? ముప్పైమూడు పర్సెంట్‌ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? మహిళలు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కి వచ్చేశారంటే.. గెలవడానికి ఫిఫ్టీ–ఫిఫ్టీ ఛాన్స్‌ ఉన్నట్లే. అంటే.. భూమ్మీద కూడా సగం ఛాన్స్‌. మరి ఇంత కాన్ఫిడెంట్‌గా, బలంగా బ్యాట్‌తో బాల్‌ని కొట్టి మరీ చెప్తున్నాం కదా.. ఏదీ.. ఇంటర్నెట్‌ చూడకుండా.. మన మహిళా టీమ్‌లోని ప్లేయర్‌ల పేర్లు చెప్పుకోండి. అందరి పేర్లూ అక్కర్లేదు.. ఆకాశంలో సగంలా.. కనీసం సగం చెప్పండి చూద్దాం?!

ఇట్స్‌ ఓకే! ఉమెన్‌ టీమ్‌లో ఎవరి పేర్లు ఏమిటో మీకు తెలికపోవడాన్ని అలా ఉంచండి. సాక్షాత్తూ విరాట్‌ కొహ్లికే తెలియదంటే ఏమనుకోవాలి?! ఉమెన్‌ క్రికెట్‌ని ఆయన క్రికెట్‌గా గుర్తించడం లేదనా? మగాళ్లు ఆడితేనే అది క్రికెట్‌ అని కోహ్లి కూడా అనుకుంటున్నాడనా?! ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. కోహ్లి నిజంగా వీళ్ల ఆటను చూశాడో లేక ఎవరైనా అంటుంటే విన్నాడో ‘వావ్‌ మిథాలీ’ అని ట్విట్టర్‌లో కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. ‘ఎ గ్రేట్‌ మూమెంట్‌’ అంటూ మొదలైన ఆ ప్రశంస.. ‘చాంపియన్‌ స్టఫ్‌’ అంటూ నాలుగు చిన్నచిన్న లైన్‌లలో ముగిసింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఆ కాంప్లిమెంట్‌కి ఆయన పెట్టిన ఫొటోలో ఉన్నది నిజానికి మిథాలీ కాదు... పూనమ్‌ రౌత్‌!

కోహ్లి ఒక్కడే కాదు!
అప్పటికి (మిథాలీ రికార్డు సాధించే రోజుకు) ఉమన్‌ వరల్డ్‌ కప్‌ మొదలై ఇరవై రోజులు అవుతున్నా.. వరల్డ్‌ కప్‌లో మహిళల ఆటకు చిన్న ట్వీట్‌ ముక్క ఇచ్చిన క్రికెట్‌ సెలబ్రిటీలే లేరు! కోహ్లి పెట్టిన ఆ ఒక్క ట్వీట్‌కైనా రీట్వీట్స్‌ ‘సున్నా’. టెండూల్కర్‌ పాపం ఉదారంగా 5 ట్వీట్‌లు ఇచ్చాడు. దానికి వచ్చిన రీ ట్వీట్‌లు కూడా ‘సున్నా’నే! హర్భజన్‌ 3, లక్ష్మణ్‌ 5 ట్వీట్‌లు ఇస్తే హర్భజన్‌కి మాత్రం ఒక్క రీ ట్వీట్‌ వచ్చింది. ఇక రవీంద్ర జడేజా, రవిశాస్త్రి ఒక్క ట్వీట్‌ కూడా ఇవ్వలేదు. టీవీ ప్రెజెంటర్లు మందిరా బేడి, మయంతి, అర్చన ఒక్కో ట్వీట్‌ చొప్పున ఇస్తే మాయంతికి మాత్రం ఓ రీట్వీట్‌ వచ్చింది. శివానీ జీరో ట్వీట్‌. ఇక్కడో పాయింట్‌ గమనించాలి. మహిళా క్రీడా ప్రముఖులు కూడా మహిళల క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. జూలై 2న ఇండియా–పాక్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు ‘వావ్‌.. వాటే షాట్‌..’ అని పెద్దగా షౌట్‌ చేసిన అర్చన, బేడీ.. ఉమెన్‌ క్రికెట్‌కు ఒకటంటే ఒకటే షౌట్‌ ఇచ్చారు. మిథాలీ రాజ్‌ 6 వేల పరుగుల మైలు రాయిని దాటినప్పుడు మయంతి మాత్రం చిన్న ట్వీట్‌ మేసేజ్‌ ఒకటి వదిలారు.

ఆ క్షణానికే అప్రిసియేషన్‌
రేపటితో ముగుస్తున్న ఉమన్‌ వరల్డ్‌ కప్‌కు ఇంతవరకు ఒక్క సెహ్వాగే ఎక్కువ ట్వీట్‌లు ఇచ్చారు. అయితే అది ఆయన సహజ స్వభావం. క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ.. వాళ్లు మగవాళ్లు కానివ్వండి, మహిళలు కానివ్వండి.. బాగా ఆడితే సెహ్వాగ్‌ ఇన్‌స్పైరింగ్‌ ట్వీట్‌లు ఇస్తుంటారు. జూన్‌ 24న ఇండియన్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ మొదలైనప్పటి నుంచి టీమ్‌లో ప్రతిభ కనబరిచిన ప్రతి అమ్మాయినీ సెహ్వాగ్‌ మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూనే ఉన్నాడు. అయితే ఇలాంటివన్నీ ఆ క్షణానికే అప్రిసియేషన్‌లు తప్ప మహిళా క్రీడాకారిణుల ప్రతిభకు, కృషికి, సామర్థ్యానికి తగిన గుర్తింపు కానే కాదు. గుర్తింపు అంటే ప్రతిఫలం, ప్రాధాన్యం, ప్రోత్సాహం. ఇవి మూడూ మన మహిళా క్రికెటర్‌లకు లేవన్నది నిజం.

వీళ్లకూ వాళ్లేనా హీరోలు?!
కోహ్లి తన పొర పాటును తెలుసుకుని (అది కూడా ఎవరో తెలియజెబితే) వెంటనే ట్విట్టర్‌లోంచి పూనమ్‌ రౌత్‌ ఫొటోను తొలగించినప్పటికీ.. మహిళల ఆటలపై మన సమాజంలో ఎంత ఆసక్తి, ఎంత శ్రద్ధ ఉన్నాయో ఆయన పోస్ట్‌ వల్ల మరోసారి స్పష్టం అయింది. 18 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న మిథాలీ రాజ్‌ని కోహ్లి ఎలా గుర్తించలేకపోతాడు? 2006లో తమిళనాడుతో కోహ్లి తన తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడేనాటికే మిథాలీ స్టార్‌ క్రికెటర్‌. ఆ సంగతి మర్చిపోయాడనే అనుకుందాం. ఈ మధ్యే కదా కోహ్లి.. మిథాలీతో కలిసి పద్మశ్రీకి నామినేట్‌ అయింది! ఇదీ గుర్తు లేదనుకుందాం. తామిద్దరూ నామినేట్‌ అయినప్పుడు మిథాలీకి ఆ అవార్డు రావడమైనా కోహ్లి ఎలా మరచిపోగలడు?

కోహ్లిని తప్పు పట్టడం కాదు. అసలు క్రికెట్‌కు ఉన్నంత ప్రాధ్యాన్యం మన దగ్గర మిగతా ఆటలకు ఉండదు. అదీ మగవాళ్ల క్రికెట్‌పైనే. మగవాళ్లు డకౌట్‌ అయి, మహిళలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నా వాళ్లకేం గుర్తింపు ఉండదు. అంతెందుకు? ఈ వరల్డ్‌ కప్‌లో మిథాలీని ‘మీ ఫేవరెట్‌ మేల్‌ క్రికెటర్‌ ఎవరు?’ అని అడిగేశారు ఎవరో. మిథాలీ కడిగేశారు ఆ అడిగినవాళ్లని. ‘ఇదే మాటను వాళ్లన అడగ్గలరా?’ అని. నిజమే కదా! విరాట్‌ కోహ్లిగానీ, ఇంకో మగ క్రికెటర్‌గానీ చెప్పగలరా.. తమ అభిమాన మహిళా క్రికెటర్‌ ఎవరో! అక్కడి వరకూ వద్దు బాస్‌. మన ఉమెన్‌ టీమ్‌లో ఉన్న వాళ్లలో ఓ ఐదుగురు పేర్లు చెప్పమనండి చాలు. కోహ్లి ది గ్రేట్‌ అవుతాడు.  

చులకన.. చిన్న చూపు
క్రికెట్‌లో ఉన్నంత సెక్సిజం మిగతా ఆటల్లో లేదు. సెక్సిజం అంటే.. మగవాళ్ల కంటే ఆడవాళ్లు తక్కువ అనే భావం. ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను చులకన చేయడం. దీనికి కారణం.. క్రికెట్‌ మగాళ్ల ఆట అనుకోవడం! ఈ  సెక్సిజం నుంచే.. ‘మీ మేల్‌ ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరు?’ అనే అర్థం లేని ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. దీనిని మిథాలీ బాగానే తిప్పకొట్టారు. మగాళ్లు మళ్లీ నోరెత్తలేదు. మిథాలీ అలా అనగానే నటి అదాశర్మ వెంటనే బయటికి వచ్చారు. క్రికెట్‌లోనే కాదు, అన్ని చోట్లా ఈ వివక్ష ఉంది. దీన్ని మనమొక ఛాలెంజ్‌గా తీసుకుని ఫైట్‌ చెయ్యాలి అంటూ మిథాలీకి సపోర్ట్‌ చేశారు. గుత్తా జ్వాల అయితే బ్యాట్‌ పట్టుకుని వచ్చేశారు. ‘మనం ఏదైనా సాధిస్తే చాలు.. యారోగెంట్‌ అనేస్తారు? ఏమీటీ సెక్సిజం’ అని ఫోర్స్‌గా ఓ షాట్‌ కొట్టారు. ఆ వెంటనే వీవీఎస్‌ లక్ష్మణ్‌ పిచ్‌లోకి వచ్చేశాడు. నో.. డౌట్‌ బాస్‌.. మిథాలీ, జులన్, సానియా, సైనా, సిం«ధు.. ఇవాళ్టి హీరోలు. మనం ఒప్పుకోవాలి’ అని మిథాలీ ఆగ్రహాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. అందరికీ అంత బ్రాడ్‌ మైండ్‌ ఉంటుందా? పురుషాహంకారం మహిళ ప్రతిభకు ప్రణమిల్లుతుందా? లేదు.

మహిళా క్రికెటర్‌లపై అన్నిట్లో చిన్నచూపే. ప్రోత్సాహం ఉండదు. ప్రతిఫలం ఉండదు. ప్రచారం ఉండదు. డబ్బు పెట్టేవాళ్లుండరు. ప్రైజ్‌ మనీ కూడా భారీగా ఉండదు. ఇవన్నీ అలా ఉంచండి. ఒక షాట్‌ కొడితే, ఒక క్యాచ్‌ పడితే.. స్టేడియంలో కానీ, ఇంట్లో టీవీ ముందు కానీ ఒక కదలిక ఉండదు. ఇన్ని అనా సక్తులను, అననుకూలతలను, అవరోధాలను విజయ వంతంగా దాటుకుని రేపు ఆదివారం మన ఉమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడబోతోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా.. అది ఉమెన్‌ ప్లేయర్లు లైంగిక వివక్షపై సాధించిన గెలుపే అవుతుంది.

భలే ‘ఇచ్చింది’ మంధన
ప్రస్తుతం ఆడుతున్న ఇండియన్‌ టీమ్‌లో స్మృతీ మంధన అనే అమ్మాయి ఉంది. జస్ట్‌ ఇరవై ఏళ్ల అమ్మాయి. ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌లో ఇంత చిన్న వయసులో ఎవరూ సెంచరీ కొట్టలేదు. స్మృతి కొట్టింది. తొమ్మిదేళ్ల వయసుకే ఈ మహారాష్ట్ర అమ్మాయి అండర్‌ 15లో ఆడింది. అండర్‌–19లో మహారాష్ట్ర టీమ్‌లో ఆడింది. పదహారేళ్ల వయసులో వెస్ట్‌ జోన్‌ తరఫున వన్డే గేమ్‌లో డబుల్‌ సెంచరీ చేసింది. ఇవన్నీ కాదు కానీ... ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఇచ్చింది చూడండీ.. ఓ ఆన్సర్‌.. అదో పెద్ద సిక్సర్‌. ‘మీరు ప్రపంచకప్‌ గెలుస్తామని అనుకుంటున్నారా?’ అని బీబీసీ జర్నలిస్టు.. టోర్నీకి ముందు స్మృతిని అడిగాడు. ‘ఏం.. మీరు అనుకోవడం లేదా?’ అని స్మృతి ఏ మాత్రం తడుముకోకుండా అనేసింది. ఈ సమాధానానికి ఎక్కడో ఉన్న ధోని ఇంప్రెస్‌ అయి, నెట్‌లో ‘ఐ యామ్‌ ఇంప్రెస్డ్‌’ అని కామెంట్‌ పెట్టాడు. ఉమెన్‌ టీమ్‌లలోని (అది ఏ టీమ్‌ అయినా) విజయస్ఫూర్తికి.. స్మృతి ఒక నిదర్శనం.

వాళ్లకు కోట్లలో... వీళ్లకు లక్షల్లో..!
భారత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళల క్రికెటర్లకు లభించే మొత్తం నామమాత్రమే. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత ఫిబ్రవరిలో పురుషుల క్రికెటర్లకు ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ వివరాల ప్రకారం... గ్రేడ్‌ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 2 కోట్లు, గ్రేడ్‌ ’బి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. కోటి, గ్రేడ్‌ ’సి’లో ఉన్న వారికి ఏడాదికి రూ. 50 లక్షలు చెల్లిస్తారు.ఇక ఒక్కో టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే ఆడితే రూ. 7 లక్షలు, టి20 మ్యాచ్‌ ఆడితే రూ. 3 లక్షలు ఇస్తారు. దేశవాళీ రంజీ ట్రోఫీలో మ్యాచ్‌కు రూ. 40 వేలు చొప్పున అందజేస్తారు. ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెటర్లకు 2016–2017 సీజన్‌ వార్షిక కాంట్రాక్ట్‌ వివరాలను ఇంకా ప్రకటించనే లేదు. 2015–2016 సీజన్‌ ప్రకారమైతే గ్రేడ్‌ ’ఎ’లో ఉన్న వారికి ఏడాదికి మరీ అధ్వాన్నంగా రూ. 15 లక్షలు, గ్రేడ్‌ ’బి’లో ఉన్న వారికి రూ. 10 లక్షలు అందించారు.

ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ 2017 ఇండియా–టీమ్‌
నిలబడి ఉన్నవారు (ఎడమ నుంచి) : శిఖా పాండే, జులన్‌ గోస్వామి, మాన్సీ జోషి, మోనా మేష్రమ్,
వేద కృష్ణమూర్తి, మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), స్మృతీ మంధన, హర్మన్‌ ప్రీత్‌కౌర్, సుష్మా వర్మ (వికెట్‌ కీపర్‌)
కూర్చున్నవారు (ఎడమ నుంచి): పూనమ్‌ యాదవ్, పూనమ్‌ రౌత్, నుజ్హత్‌ పర్వీన్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, ఏక్తా బిస్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement