ఆ నేడు 28 సెప్టెంబర్, 1928
పెన్సిలిన్ వ్యాక్సీన్‌ను కనుగొన్న ఫ్లెమింగ్
ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు కూడా మంచే చేస్తాయనడానికి తార్కాణమే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుగొనడం. లండన్ సెయింట్ మేరీస్ హాస్పిటల్‌లోని ఒక ల్యాబ్‌లో కూర్చొని స్టెఫిలో కాకై బ్యాక్టీరియా గురించి పరిశోధనలు చేస్తున్నాడు ఫ్లెమింగ్. ఓ రోజు అలా పరిశోధన చేస్తుండగా, అత్యవసరంగా బయటకు వెళ్లవలసి వచ్చింది. దాంతో చేస్తున్న పనిని అర్ధంతరంగా ఆపి, కనీసం ఆ పరీక్ష నాళికకు మూత కూడా పెట్టకుండా వెళ్లిపోయాడు. మర్నాడు వచ్చి చూసేసరికి, నిన్న తాను వదిలి వెళ్లిన పరీక్ష నాళికపైన బూజులాంటి పదార్థం ఏర్పడి ఉండటం చూశాడు. నొచ్చుకుంటూ, దానిని శుభ్రం చేద్దామని చేతిలోకి తీసుకున్నాడు.
ఆశ్చర్యం... ఆ బూజు ఏర్పడ్డ చోట స్టెఫిలో కాకై బ్యాక్టీరియా నాశనమై ఉంది. బూజు లేని చోట బ్యాక్టీరియా నిక్షేపంగా ఉంది. దాంతో ఆ బూజును మరికాస్త అభివృద్ధి చేసి చూశాడు. ఈసారి బ్యాక్టీరియా పూర్తిగా నాశనమై కనిపించింది. అంటే ఆ బూజులో బ్యాక్టీరియాను ధ్వంసం చేసే ఏదో సూక్ష్మజీవి ఉందని తెలుసుకున్నాడు. ఆ సూక్ష్మజీవికే పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గాయాల పాలై, పుండ్లపై స్టెఫిలో కాకై బ్యాక్టీరియా చేరి మొండివ్రణాలతో బాధపడుతున్న ైసైనికులపై దానిని ప్రయోగించి చూశాడు. అది సత్ఫలితాలనిచ్చింది. మానవాళికి మహోపకారం జరిగింది. ఆ విధంగా సెప్టెంబర్ 28, 1928ని సెన్సిలిన్ కనుగొన్న రోజుగా పరిశోధక ప్రపంచం గుర్తుంచుకుంది.