వెయ్యేళ్లకొక్కడు | 1000 years of in this boy | Sakshi
Sakshi News home page

వెయ్యేళ్లకొక్కడు

Published Sun, Nov 5 2017 1:12 AM | Last Updated on Sun, Nov 5 2017 1:12 AM

1000 years of in this boy - Sakshi

‘అలాంటి వారు వేయేళ్లకు ఒకరు పుడతారు! ఎంతో విస్తృతీ, ప్రయోజనమూ ఉన్న ఆవిష్కరణలను అందించిన అలాంటి వ్యక్తి, ఇంతవరకు నమోదైన 5,000 ఏళ్ల జీవశాస్త్ర, వైద్యశాస్త్ర చరిత్రలలో మరొకరెవరైనా ఉంటారన్నా కూడా అనుమానమే.’ సీసీఎంబీ ఒకప్పటి సంచాలకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త పీఎం భార్గవ రాసిన ఒక వ్యాసంలోని వాక్యాలివి. అంతకంటే చాలా ముందే, అమెరికా జర్నలిస్ట్‌ డొరొన్‌ కె. ఎంట్రిమ్‌ ఆ ‘వ్యక్తి’ గురించే ఒక వ్యాసంలో ఇంకో గొప్ప మాట అన్నారు. ఈ వ్యాఖ్యతోటే ఆ ‘వ్యక్తి’ ఎవరో కూడా మనకు తెలుస్తుంది. ‘ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి మనకి తెలియకపోవచ్చు. కానీ ఆయన జీవించాడు కనుక మనం హాయిగా బతుకుతున్నాం. ఇక ముందు కూడా జీవిస్తాం.’ నిజమే, ఆయన గురించి మనకి ఎంతో కొంత మాత్రమే తెలిసి ఉండవచ్చు. లేదా ఏమీ తెలియకపోవచ్చు. కానీ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించేందుకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేసినవారాయన. మానవ శరీరంలోని కణాలకు శక్తినిచ్చేది ఎడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఏటీపీ) అని కనుగొన్నది ఆయనే. ఫైలేరియాకు హెట్రాజన్‌ కనుగొన్నదీ ఆయనే. ఆయన కనుగొన్న, ఆయన పర్యవేక్షణలో వెలువడిన (ఆరోమైసిన్‌) రోగ నిరోధకాలు పెన్సిలిన్‌ కంటే ఎంతో శక్తిమంతమైనవి. ఆయన కనిపెట్టిన ఫోలిక్‌ యాసిడ్, స్ప్రూ మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయి.

ఎల్లాప్రగడ (1895–1948) వైద్యశాస్త్రానికీ, జీవ రసాయనిక శాస్త్రానికీ చేసిన సేవలు చిరస్మరణీయంగా ఉండిపోయాయి. ఈ క్షణాన కూడా ఆయన ఆవిష్కరణలతో ప్రయోజనం పొందుతున్న ప్రపంచం మాత్రం ఆ పేరును విస్మరించింది. ఇంత విషాదం మరొక శాస్త్రవేత్త జీవితంలో కనిపించకపోవచ్చు. ప్రపం^è  ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా ఒక ఆవిష్కరణకే పరిమితం కావడం సాధారణం. దానికే గొప్ప కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. నోబెల్‌ లేదా తత్సమానమైన పురస్కారాలు వచ్చి పడతాయి. ఎక్స్‌రేను అందించిన విల్‌హెల్మ్‌ రొయింటెన్, రేడియంను కనుగొన్న మేడం క్యూరీ, ద్రవాల ద్వారా జరిగే కాంతి విచ్ఛిత్తి గురించి చెప్పిన సీవీ రామన్, కాస్మిక్‌ కిరణాలను కనుగొన్న పీఎంఎస్‌ బ్లాకెట్, మలేరియా పరాన్నజీవి పరిణామం గురించి చెప్పిన రొనాల్డ్‌ రాస్‌ (ఈయన సికింద్రాబాద్‌లో ఉన్నప్పుడే ఆ పరిశోధన చేశారు), పెన్సిలిన్‌ను కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ వంటివారంతా ఒక ఆవిష్కరణతోనే విఖ్యాతులయ్యారు. వీరందరినీ నోబెల్‌ పురస్కారం వరించింది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ (ఫొటో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్, సాపేక్ష సిద్ధాంతం), జాన్‌ బార్డీన్‌ (ట్రాన్సిస్టర్స్, సూపర్‌ కండెక్టివిటీ), హరగోవింద్‌ ఖురానా (జెనిటిక్‌ కోడ్, సింథసిస్‌ ఆఫ్‌ జీన్‌) రెండు ఆవిష్కరణలు చేసి నోబెల్‌ పురస్కారాలు అందుకున్నవారు. ఒక్క రంగానికే పరిమితమైనా ఎన్నో ఆవిష్కరణలు చేసిన రాబర్ట్‌ ఉడ్‌వార్డ్‌ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) కూడా ఉన్నారు. ఆయనకూ నోబెల్‌ పురస్కారం వచ్చింది. మరోవైపున చూస్తే– నేటికీ ప్రపంచ ప్రజల అవసరాలను తీరుస్తున్న ఆవిష్కరణలను అందించిన శాస్త్రవేత్తలు కొందరు ఉన్నారు. ఏ విధమైన పురస్కారం కూడా వీరి జోలికి రాలేదు. మొదటిసారి పోలియో వ్యాక్సిన్‌ తయారు చేసిన శాస్త్రవేత్త జొనాస్‌ సాల్క్‌. ఆధునిక ఇమ్యూనాలజీకి పిత వంటివారు మైఖేల్‌ హీడల్‌బెర్గర్‌. మన శరీరంలో పుష్కలంగా ఉండే ప్రొటీన్‌ కొలాజిన్‌. దాని ఆకృతి గురించి చెప్పినవారు జీఎన్‌ రామచంద్రన్‌. సీటీ స్కాన్‌ వంటి సాంకేతిక పద్ధతులకు పునాదులు వేసిన వారు కూడా ఆయనే. కానీ వీరికి ఎలాంటి పురస్కారం దక్కలేదు.

 వీరందరికీ అతీతుడు. ప్రపంచ శాస్త్ర విజ్ఞాన పటాన్నీ, మానవాళి జీవితాలనూ మార్చినవాడు, అన్నీ వదులుకుని పాతికేళ్ల పాటు అనేక ఆవిష్కరణల కోసం శ్రమిస్తూ జీవితాన్ని ధారపోసినవాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఆయన పేరు మాత్రం చాలా పొదుపుగా వినిపిస్తుంది. విశాల ప్రపంచానికీ, అందులోని బాలలకీ ఇతోధికంగా ఉపయోగపడుతుంది కాబట్టి పోలియో వ్యాక్సిన్‌ మీద పేటెంట్‌ హక్కును సాల్క్‌ ఐచ్ఛికంగా వదలుకున్నారని చెబుతారు. కానీ ఎల్లాప్రగడ అసలు పేరు ప్రఖ్యాతలనే ఆశించలేదు. తన ఆవిష్కరణ గురించి చెప్పేందుకు పత్రికల వారి సమావేశం ఏర్పాటు చేస్తే, ఆయన ప్రేక్షకుల మధ్య ఎక్కడో కూర్చునేవారు. ఎవరో ఒకరు బలవంతంగా వేదిక మీదకు నెట్టవలసి వచ్చేది. ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలు పేటెంట్‌ ప్రకటించుకోవడం సర్వ సాధారణం. ఎల్లాప్రగడకు అలాంటి ఆలోచన ఉన్నట్టు కూడా అనిపించదు. బాల్యం నుంచీ పేదరికం. అనారోగ్యం. అమెరికా వెళ్లినా తప్పని అర్ధాకలి. ఒంటరి జీవితం. హార్వర్డ్‌లో చదువుతున్నా పక్క ఆస్పత్రులలో ప్యాన్‌లు కడుగుతూ ఆర్జన చేసుకున్నారాయన. వీటన్నిటికీ మించి వర్ణ వివక్ష చేసిన ఘోరమైన గాయం. కానీ ఒక మహోన్నత శాస్త్రవేత్తగా ఎల్లాప్రగడ ఎదగడానికి, ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఇవేమీ ఆటంకం కాలేదు. ఆయన జీవన ప్రస్థానం, ఆయన ఆవిష్కరణలు, ప్రస్తుతం అవి ప్రపంచ మానవాళికి రక్షణ కవచాలుగా నిలిచిన తీరు అద్భుతమనిపిస్తాయి.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం (నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ)లోనే ఎల్లాప్రగడ జన్మించారు. జగన్నాథం, వెంకమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో నాలుగో సంతానం. జగన్నాథం మధ్యలోనే ప్రభుత్వోద్యోగం వదిలేశారు. కారణం– అనారోగ్యం. సంపాదించుకున్నది కూడా ఏమీలేదు. అలాంటి సమయంలో ఎల్లాప్రగడ ఇంటి నుంచి పారిపోదామని ప్రయత్నించి, నిడదవోలు దగ్గరే దొరికిపోయారు. తరువాత తల్లి పట్టుపట్టి కొడుకును రాజమండ్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మద్రాస్‌ వెళ్లి హిందూ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ చేశారు. పరీక్షలు రెండు మాసాలు ఉన్నాయన గా, పెద్ద పరీక్ష ఎదురైంది. అప్పటికే ఇద్దరు సోదరులు మరణించారు. ఇప్పుడు తండ్రి. మద్రాస్‌ నుంచి ఇంటికొచ్చిన కొడుకును మళ్లీ పంపడానికి ఆ తల్లి తన ఒంటి మీదున్న కొద్దిపాటి బంగారం అమ్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్‌ చదివాక, మద్రాస్‌ వైద్య కళాశాలలో చేరారు. రాజమండ్రిలో ఉండగా చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి సంస్కరణ ల ధోరణినీ, వందేమాతరం ఉద్యమం వేడినీ చూసిన ఎల్లాప్రగడ విదేశీ వస్త్ర బహిష్కరణ కోసం గాంధీ ఇచ్చిన పిలుపునకూ స్పందించారు. ఖద్దరుతో ఆపరేషన్‌ థియేటర్‌లో కనిపించారు. ఇదే జీవితం మీద తొలిదెబ్బ అవుతుందని ఆయన ఊహించలేదు. సర్జరీ ప్రొఫెసర్‌ ఎంసీ బ్రాడ్‌ఫీల్డ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పరీక్ష బాగా రాసినా ఎల్లాప్రగడకు పూర్తి స్థాయిలో ఎంబీబీఎస్‌ పట్టా ఇవ్వనివ్వలేదు. ఎల్‌ఎంఎస్‌ సర్టిఫికెట్‌తో సరిపెట్టారు. మద్రాస్‌ మెడికల్‌ సర్వీస్‌లో చేరడానికి ఇది ఆటంకమైంది. అందుకే డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతిగారి(ఎల్లాప్రగడ అమెరికా వెళ్లడానికి ముందు అతిసారకు గురయ్యారు. ఇంగ్లిష్‌ మందు పనిచేయలేదు. అప్పుడు ఆ వ్యాధి నుంచి ఆయనను బయటపడవేసినది ఈయనే) ఆయుర్వేద కళాశాలలో అనాటమీ అధ్యాపకునిగా చేరారు. ఆయుర్వేద ఔషధాలలోని రోగ నిరోధక లక్షణం ఆయనను ఎంతో ఆకర్షించింది. అందుకే కొత్త పద్ధతులను మేళవించి పరిశోధన ప్రారంభించారు. ఇంతలోనే హార్వర్డ్‌ మెడికల్‌ కళాశాలలో ఉష్ణమండల రుగ్మతల విభాగం నుంచి పిలుపు వచ్చింది. మల్లాడి సత్యలింగనాయకర్‌ చారిటీస్‌ (కాకినాడ) వారి సాయం కూడా అందింది. హార్వర్డ్‌లో డిప్లొమా పొంది అక్కడే అధ్యాపకుడయ్యారు. కానీ తాత్కాలికోద్యోగమే.

వైద్య పరిశోధనలో ఎల్లాప్రగడ ప్రతిభ ఎంతటిదో మొదట రుజువైనది ఇక్కడే. కానీ ఆయన ఆవిష్కరణల, పరిశోధనల వివరాలకు వెలుగులోకి రాకుండా కుట్ర జరిగింది కూడా ఇక్కడే.  శరీరంలో ఉండే ద్రవాలు, ధాతువులలో భాస్వరం ఎంత ఉందో అంచనా వేసే విధానాన్ని ఇక్కడే సైరస్‌ హార్ట్వెల్‌ ఫిస్కే అనే మరో శాస్త్రవేత్తతో కలసి ఎల్లాప్రగడ కనుగొన్నారు. ఇదే ఎల్లాప్రగడ పేరును 1930లో జీవన రసాయన శాస్త్ర గ్రంథాలలోకి తీసుకువెళ్లింది. వైద్య పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘ర్యాపిడ్‌ క్యాలరోమెట్రిక్‌ మెథడ్‌’ అని పిలిచినా, వ్యవహారంలో ‘ఫిస్కే–సుబ్బారావ్‌ మెథడ్‌’ అంటారు. ఆయనకు పీహెడీ పట్టా కూడా ఆ సంవత్సరమే ఇచ్చారు. ఆ పట్టాతో పదేళ్లు పనిచేసినా హార్వర్డ్‌లో కూడా ఆయనకు అన్యాయమే ఎదురైంది. ఉద్యోగాన్ని స్థిరం చేసేందుకు అంగీకరించలేదు. దీనితోనే లెడర్లీ లేబరేటరీస్‌ సంస్థలో చేరారు. ఇక్కడే ఫిస్కే చేసిన కుట్ర గురించి చెప్పుకోవాలి. ఎల్లాప్రగడ పరిశోధన వివరాలను ఫిస్కే అణచిపెట్టాడు. ఈ సంగతి 1988లో నోబెల్‌కు ఎంపికైన జార్జి హిచింగ్స్‌ బయటపెట్టారు. హిచింగ్స్‌ తొలి రోజులలో ఎల్లాప్రగడ సహాధ్యాయి. మెథోట్రెక్సేట్‌ ఎల్లాప్రగడ సాధించిన మరో గొప్ప విజయం. ఇక్కడ పీఎం భార్గవ రాసుకున్న ఒక అనుభవం గురించి ఉదహరించాలి. భార్గవ 1965–66లో లండన్‌లో పర్యటించారు. ప్రఖ్యాత చెస్టర్‌ బియట్టీ కేన్సర్‌ పరిశోధన సంస్థకు అప్పుడు సర్‌ అలెగ్జాండర్‌ హడో సంచాలకుడిగా ఉండేవారు. తనను కలసిన భార్గవతో, ‘మీకు తెలుసా! మెథోట్రెక్సేట్‌ కనుగొన్నది ఒక భారతీయుడే!’ అని చెప్పారట హడో. భార్గవ వంటి సైంటిస్ట్‌ కూడా విస్తుపోయారు. ఎవరు అని ప్రశ్నించారు. ‘డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు’ అని చెప్పారట హడో. రక్తహీనతకు ఉపయోగపడే ఫోలిక్‌ యాసిడ్‌ను 1945లో ఎల్లాప్రగడ కనుగొన్నారు. రెండేళ్లకే ప్రపంచం మొత్తం ఒక అద్భుతంగా భావించిన, మహోన్నత ఫలితాలను ఇచ్చిన ఆరోమైసిన్‌ను కూడా ఆయన కనుగొన్నారు. ఇందులో బెంజమిన్‌ దుగ్గర్‌ అనే వృక్షశాస్త్రవేత్త సాయపడ్డాడు. ఇది అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న, రోగ నిరోధక ఔషధ రాజ్యంలో వెలిగిపోతున్న పెన్సిలిన్‌ , స్ట్రెప్టోమైసిన్‌లను అధిగమించింది. ఈ రోగ నిరోధకం గ్రామ్‌– పాజిటివ్, గ్రామ్‌– నెగెటివ్‌ సూక్ష్మజీవుల మీద సమంగా పనిచేస్తుంది. ప్లేగు నివారణ మందులకు ఇదే మూలం.   

తాను అమెరికా వెళ్లడానికి ఆర్థిక సాయం చేసిన కస్తూరి సూర్యనారాయణ (అనపర్తి, తూర్పుగోదావరి) కుమార్తె శేషగిరిని షరతు మేరకు ఎల్లాప్రగడ పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండోనెల గర్భవతిగా ఉన్నప్పుడే ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఇక తిరిగి రాలేదు. ఆయన సోదరుల మాదిరిగానే కొడుకు కూడా సంవత్సరం తిరగకుండానే రక్తహీనత జబ్బుతో మరణించాడు. శేషగిరి భర్త గురించి ఎదరుచూస్తూనే ఉండిపోయింది. ఆయన 1948లో గుండెపోటుతో 53వ ఏట అమెరికాలోనే కన్నుమూశారు. తను స్వదేశం రాబోతున్నాననీ కలసి ఉందామనీ శేషగిరికి ఆయన రాసిన ఉత్తరం మాత్రం మిగిలిపోయింది. అంతకాలం అమెరికాలో ఉన్నా, గ్రీన్‌కార్డ్‌ రాలేదు. కాబట్టి తుదివరకు ఆయన భారతీయుడే.మనిషి రుగ్మతలు ఎన్నింటికో ఎల్లాప్రగడ మందు కనిపెట్టారు. కానీ ప్రపంచానికి పట్టిన రుగ్మతలకు మందు కనిపెట్టే వారి కోసం ప్రజలు ఎదురుచూస్తూనే ఉంటారు. వర్ణ వివక్ష, ఈర్షా్యద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలతో బాధపడుతున్న ప్రపంచాన్ని మరమ్మతు చేయగల ఒక ఔషధం కోసం లోకం అర్రులు చాస్తోంది. ఎల్లాప్రగడ వంటి ప్రతిభా సూర్యుడిని మేఘాల్లా కమ్మేసినవి ఇవే కదా!ఇక్కడే ఫిస్కే చేసిన కుట్ర గురించి చెప్పుకోవాలి. ఎల్లాప్రగడ పరిశోధన వివరాలను ఫిస్కే అణచిపెట్టాడు. ఈ సంగతి 1988లో నోబెల్‌కు ఎంపికైన జార్జి హిచింగ్స్‌ బయటపెట్టారు. హిచింగ్స్‌ తొలి రోజులలోఎల్లాప్రగడ సహాధ్యాయి.
- డా. గోపరాజు నారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement