మహామంత్రి తిమ్మరుసు | thimmarisu special on old movie story | Sakshi
Sakshi News home page

మహామంత్రి తిమ్మరుసు

Published Thu, Oct 5 2017 11:56 PM | Last Updated on Fri, Oct 6 2017 4:41 AM

thimmarisu special  on old movie story

ఈ కథ కళ్లతో మొదలై కళ్లతో అంతమవుతుంది.

విజయనగర సామ్రాజ్య పాలనలో సాళువ వంశం అంతమయ్యి తుళవ వంశం మొదలయ్యింది. సైన్యాధికారి అయిన తుళువ నరస నాయకుడు రాజ్యానికి విశ్వాసపాత్రునిగానే ఉంటూ అనుకోని పరిస్థితిలో పాలకుడయ్యాయి. అతని హయాం ముగిసి అతని పెద్ద కుమారుడు వీర నరసింహ నాయకుని పాలన వచ్చింది. విజయనగరం కళకళలాడుతోంది. ఇంకా కళకళలాడబోతోంది. ఇంతలో నరసింహ నాయకుడు జబ్బు పడ్డాడు. తన తర్వాత తన రాజ్యం తన కుమారుడికి దక్కాలని ఆశించాడు. అయితే ఆ కుమారుడికి పట్టుమని పదేళ్లు కూడా లేవు. కాని నిజంగా రాజ్యానికి ఇప్పుడు కావాల్సింది సమర్థుడైన ఒక పాలకుడు. ఆ పాలక లక్షణాలు సమృద్ధిగా కలిగిన దక్షుడు కృష్ణదేవరాయలే అని మంత్రి తిమ్మరుసు భావించాడు. నరసింహ నాయకుడి సవతి తమ్ముడే కృష్ణదేవరాయలు. కాని ఎప్పటికైనా కృష్ణదేవరాయలి వల్ల తన కుమారుడికి రాజ్యం దక్కకపోయే అవకాశం ఉందని భావించిన నరసింహ నాయకుడు కృష్ణదేవరాయలి కళ్లు పీకించమని ఆదేశాలు జారీ చేశాడు. ఇది పెద్ద నిర్ణయం. అదే గనుక జరిగి ఉంటే విజయనగర సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో. కాని మహామంత్రి తిమ్మరుసు అలా జరగనివ్వలేదు. మంత్రాంగం నడిపించాడు. తంత్రం చేశాడు. మేక కళ్లను ప్రభువుకు చూపించి అవే కృష్ణదేవరాయలి కళ్లు అని నమ్మించాడు. పరిస్థితులు చక్కబడే వరకు కృష్ణదేవరాయలను చంద్రగిరి పంపించి అక్కడే రహస్యంగా ఉంచేశాడు. వీటన్నింటి ఫలితంగా రాజ్యాధికారం దక్కించుకుని తిమ్మరసు మీద అచంచల విశ్వాసం, అభిమానం పెంచుకున్న ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు. ‘అప్పాజీ’ అని పిలుస్తూ తండ్రి స్థానం ఇచ్చి అనురాగంతో మసులుకున్న ప్రభువు అతను. ఈ ఇద్దరూ కలిసి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని దశదిశలా వ్యాపింప చేశారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు దాని గురించి శ్లాఘించే పరిస్థితి కల్పించారు. కాని కాలం ఊరికే ఉంటుందా? వీరి మైత్రి చూసి దాని కన్ను కుట్టుకుండా ఉంటుందా?

శ్రీకృష్ణదేవరాయలి ముఖ్యసఖి చిన్నాదేవి. ఆమె ఆస్థాన నాట్యకారిణి. ఆమె మీద మనసు పడ్డ దేవరాయలు ఆమెను వివాహం చేసుకోదలిచాడు. అయితే రాజ్య విస్తరణ తంత్రంలో భాగంగా శ్రీరంగపట్న పాలకుల ఆడపడుచు తిరుమల దేవిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరు భార్యలు. తిరుమల దేవి. చిన్నాదేవి. కాని మరో భార్య కూడా ఆయన జీవితంలో ప్రవేశించాల్సి వచ్చింది. విజయనగర రాజ్యానికి ప్రధాన శత్రువులు గజపతులు. ఈ ఒరిస్సా పాలకులను ఓడించడమే కృష్ణదేవరాయలి ప్రధమ కర్తవ్యం. దీనికి కారణం కూడా ఉంది. గజపతులది సూర్య వంశం. కృష్ణదేవరాయలుది చంద్రవంశం. తమతో పోలిస్తే ఆ వంశం నిమ్నమైనది అని గజపతుల భావన. పైగా కృష్ణదేవరాయలి తల్లి నాగలాదేవి క్షత్రియురాలు కాదని మొదటి రాణికి ఆమె దాసిగా పని చేసింది కనుక కృష్ణదేవరాయలు దాసీపుత్రుడని వారి అభియోగం. కాని అపరపరాక్రమవంతుడైన కృష్ణదేవరాయలు గజపతుల పీచమణిచి వారిని ఓడించాడు. అందుకు బదులుగా వారి ఆడపడుచు అన్నపూర్ణాదేవిని వివాహం చేసుకున్నాడు. కాని కృష్ణదేవరాయలు వల్ల తమ రక్తం సంకరం కావడం గజపతులకు ఇష్టం లేదు. పరువు హత్యకు కూడా వారు వెనుకాడని స్థితికి తెగించారు. తమ మనిషిని విజయనగర రాజ్యంలో ప్రవేశ పెట్టారు.

తిరుమల దేవికి పుట్టిన కుమారుణ్ణి (అన్నపూర్ణా దేవికి పుట్టిన కుమారుడిగా సినిమాలో చూపించారు) విష ప్రయోగం చేసి చంపించారు. ఈ నేరం తిమ్మరుసును చుట్టుకుంది. మైనర్‌ కుమారుడికి యువరాజు పట్టాభిషేకం జరిపేందుకు తిమ్మరుసు అంగీకరించలేదు కనుక, తనకు నచ్చినవారినే రాజుగా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది కనుక ఈ హత్య ఆయనే చేయించి ఉంటాడని కృష్ణదేవరాయలకు నూరి పోశారు. ఈ అపవాదు తిమ్మరుసుకు శరాఘాతం. ఈ రాజ్యానికైతే తాను విశ్వాసపాత్రుడుగా ఉన్నాడో ఏ ప్రభువు ఉన్నతి కోసం తాను అహర్నిశలు శ్రమ పడ్డాడో ఎవరి కోసం తాను అనుక్షణం అప్రమత్తంగా మసిలాడో ఆ ప్రభువే తనను అనుమానిస్తే తానిక ఎక్కడికి పోవాలి అని హతాశుడై విచారణ సమయంలో విరాగమౌనం దాల్చాడు. శిక్ష ఖరారు అయ్యింది. తిమ్మరుసు కళ్లు కాల్చేయాలని శిక్ష. ఈ శిక్ష ఆధారాలతో వేసినదా మనస్ఫూర్తిగా వేసినదా ఆగ్రహంలో వేసినదా అనుమానంతో వేసినదా ఇప్పటికీ తెలియదు. కాని అంతటి మహామంత్రి, మేధావి, మంత్రాంగ ప్రవీణుడు, వంద కళ్లతో రాజ్యాన్ని కాచినవాడు తన విశ్వాసానికి ప్రతిఫలంగా కళ్లు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు తను చేసిన తప్పు తెలుసుకున్నాడని కథనం.సినిమా ముగింపులో తిమ్మరుసు రాజ్యంలోనే ఉన్నాడని చూపించినా వాస్తవంలో ఆయన చివరి రోజులను అనామకంగా తిరుపతిలో గడిపాడని అక్కడే దీనమైన జీవతం గడిపి మరణించాడని అంటారు.

తెలుగువాడైన తిమ్మరుసు జీవితాన్ని, తెలుగు వల్లభుండైన కృష్ణదేవరాయలితో ఆయన మైత్రిని కథాంశంగా తీసుకుని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విడుదలైన సినిమా ‘మహామంత్రి తిమ్మరుసు’. మనకు కృష్ణదేవరాయలు ఎంత సన్నిహితుడో తిమ్మరుసు కూడా అంతే సన్నిహితుడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతంలో ‘తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయలి కీర్తి’ అని ఉంటుంది. ఆ రెంటినీ సమర్థంగా చూపి ఆకట్టుకున్న సినిమా మహామంత్రి తిమ్మరుసు. కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్, తిమ్మరుసుగా గుమ్మడి అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఎన్టీఆర్‌ ప్రభువుగా దర్పాన్ని చూపుతూనే పుత్రసమాన వినయాన్ని ప్రదర్శించడం గుమ్మడి తిమ్మరుసుగా పెద్దరికాన్ని ప్రదర్శిస్తూనే తండ్రి సమానమైన వాత్సల్యాన్ని ప్రదర్శించడం చూసి తీరాలి. ఇందులో ఒక ముఖ్యమైన సన్నివేశం ఉంది. సినిమా చివరలో కృష్ణదేవరాయలు తిమ్మరుసు కళ్లు పొడిపించమని తీర్పు వెలువరిస్తాడు. అది విన్న మరుక్షణం తిమ్మరుసు చేసే పని ఏమిటో తెలుసా? తాను అత్యంత అభిమానించే కృష్ణదేవరాయలును ఆపాదమస్తకం పదే పదే చూసుకోవడం. ఎందుకంటే కళ్లు పోయాక మరిక చూసుకోలేడు కదా. ఆ సన్నివేశానికి మన కళ్లు చెమరుస్తాయి. సినిమాలో తిరుమల దేవిగా జి.వరలక్ష్మి, చిన్నాదేవిగా ఎల్‌.విజయలక్ష్మి, అన్నపూర్ణగా దేవిక కనిపిస్తారు. గజపతుల ప్రతినిధి హంవీరగా లింగమూర్తి అద్భుతమైన నటనను కనపరుస్తాడు. ఈయన ఎక్కువ సినిమాలలో నటించకపోవడం గతకాలపు నష్టాలలో ఒకటి. ఈ కథను, మాటలను మహా రచయిత పింగళి నాగేంద్రరావు సమకూర్చారు. ఇందులో జనరంజకమైన పాటలు లేవు. ఉంటే మరెక్కడికో వెళ్లి ఉండేది. అష్ట దిగ్గజాలు ఈ కొలువులోనే ఉన్నా సినిమాలో అల్లసాని పెద్దన తప్ప మరెవవ్వరూ కనిపించరు. విజయ నగర సామ్రాజ్యమనగానే ఎన్నో అనుభూతులు పూర్వస్మృతులు చెలరేగుతాయి. గర్వం, అతిశయం కలుగుతాయి. కాని ఆ పాలనలోనే ముగిసిపోయిన తిమ్మరుసు విషాద ఘట్టం తలుచుకోగానే అదే మనసుకు చివుక్కుమనిపిస్తుంది. చరిత్ర ఎప్పుడూ ఏదో ఒక పాఠాన్ని వదిలిపెట్టే వెళుతుంది. తిమ్మరుసు కథ కూడా అటువంటి ఒక చేదు పాఠమే

తిమ్మరుసు జైలు
తిమ్మరుసు కళ్లు పీకించాక ఆయనను బందిఖానాలో ఉంచారని కథనం. మన అనంతపురం జిల్లా పెనుకొండలో ‘తిమ్మరుసు జైలు’ అనే కట్టడం ఇప్పటికీ ఉంది. ఒక్క తిమ్మరుసునే కాదు ఆయన కుటుంబం మొత్తం కళ్లు పీకించారని ఒక కథనం. తిమ్మరుసు బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక కళ్లు పీకించడంతో ఊరుకున్నారని ఒక పరిశీలన. ఇక మనందరం ‘ఏకశిలారథం’ అని చెప్పుకునే రథం హంపీలో ఉంది. దీనికి ఈ పేరు రావడానికి కారణం ఆత్రేయ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ‘ఏకశిలా రథముపై లోకేశు ఒడిలోన’.. అని ఆయన రాయడం వల్ల మనమందరం అదేమాట నిజమనుకుంటుంటాం. కాని ఆ రథాన్ని ఇరవై ఆరు భాగాలుగా చెక్కి పూన్చారు. తెలుగువారు హంపీని ఒక్కసారైనా దర్శించాలి. మన గొప్ప పాలకుడికి మనం ప్రకటించగలిగే కృతజ్ఞత అదే.
– కె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement