![Time to Eat Food For Healthy Weight Loss - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/27/time.jpg.webp?itok=0wQDqbi6)
బరువు పెరగడం వల్ల వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి బరువు పెరిగాక దాన్ని తగ్గించుకోడానికి చేసే ప్రయత్నాలు చాలామందికి విసుగూ, అలసట తెప్పిస్తాయి. అంతేకాదు... కొందరైతే వ్యాయామం కోసం తమకు తగినంత సమయం దొరకడం లేదంటూ బాధపడుతుంటారు. రోజూ క్రమంగా ఒకే వేళకు తినడం ద్వారా కూడా ఎలాంటి శ్రమ లేకుండా, హాయిగా బరువు తగ్గే అవకాశమూ ఉంది. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే. నిర్ణీత సమయాల్లో భోజనం చేయడం, రాత్రంతా హాయిగా నిద్రపోవడమే.
భోజనవేళలు ఇలా ఉంటే మంచిది
వీలైతే రాత్రిభోజనాన్ని 7.30 లేదా 8.30 కల్లా పూర్తి చేసి... మళ్లీ ఉదయం 8.30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా రాత్రి భోజనానికీ, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కీ కనీసం 12 నుంచి 13 గంటల వ్యవధి పడుతుంది. రాత్రి ఎలాగూ నిద్రపోతుంటాం కాబట్టి ఆకలి అనిపించదు. ఈ మార్గం ద్వారా బరువు తగ్గడం సులువు. శ్రమ ఉండదు. పైగా ఆరోగ్యకరం కూడా. ఇలా వేళకు తినడం, రాత్రి నిద్రపోవడం ద్వారానే బరువు తగ్గవచ్చు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కూడా.
రాత్రి వేళల్లో పని చేసేవారు...
సాధారణంగా రాత్రివేళల్లో పనిచేసే వారు లేదా రాత్రి నిద్రపట్టక మెలకువతో ఉండేవారు సాధారణంగా రాత్రంతా ఏదో ఒకటి తింటూ ఉంటారు. దాంతో బరువు పెరిగే అనర్థం చోటుచేసుకుంటుంది. నిజానికి మన ఆరోగ్యానికీ, భోజనవేళలకూ సంబంధం ఉంటుంది. మన మెదడులో ఉండే జీవగడియారం (బయలాజికల్ క్లాక్) ద్వారా ఆ రెండు అంశాలూ అనుసంధానమై ఉంటాయి. పగతిపూట వెలుతురు ఉండే సమయం పని కోసం, రాత్రి మన నిద్రకోసం... ఇలా ఆ వేళలకు తగినట్లుగా మన శరీరం ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అందుకే మన శరీరం పగలు చురుగ్గానూ, రాత్రి నిద్రవస్తూ ఉంటుంది. దీన్నే ‘సర్కాడియన్ రిథమ్’గా పేర్కొంటాం.
ఒక గడియారం పగలూ రేయికీ...మరొకటి ఆహారానికి...
వెలుగు, చీకట్లకు సంబంధించిన జీవగడియారంతో పాటు దానికి అనుసంధానితమై ఆహారానికి కూడా ఒక జీవగడియారం ఉంది. పగటివేళలో ఉన్నట్లే రాత్రివేళ్లలో కూడా కళ్లుమిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో కృత్రిమ వెలుగును సృష్టించి, ఎప్పుడూ అంతే వెలుగులో ఉండటం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఎదురైనట్లుగానే... పగలూ రేయీ చూసుకోకుండా అదేపనిగా తింటూ ఉండటం వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయి. జీర్ణరసాలూ, జీవరసాయనాలూ పగలూ రేయీ తేడా లేకుండా అదేపనిగా స్రవిస్తుంటాయి. ‘‘మనం ఎప్పుడూ తింటూనే ఉంటే మన రక్తంలో గ్లూకోజ్ పాళ్లు నిత్యం ఎక్కువగానే ఉంటుంటాయి’’ అంటారు కాలిఫోర్నియా, శాన్‌డియాగోకు చెందిన రూత్ పాటర్‌సన్ అనే నిపుణుడు. దాంతో గ్లూకోజ్‌ను అదుపుచేసేందుకు ఇన్సులిన్ కూడా అస్తమానం స్రవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా అదేపనిగా ఇన్సులిన్ స్రవించడం అన్న అంశం క్యాన్సర్‌కు కారణాలైన ప్రీక్యాన్సరస్ కణాలను ప్రేరేపించడానికో లేదా పుట్టేలా చేయడానికో దారితీయవచ్చు. ఇలా అదేపనిగా రాత్రంతా తింటూ ఉండేవారిలో ఫ్యాటీలివర్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. అలాగే కొలెస్ట్రాల్ మోతాదులూ విపరీతంగా పెరుగుతాయి. అలా కాకుండా రోజూ రాత్రివేళ మెలకువ లేకుండా, హాయిగా నిద్రపోవడం ద్వారా రాత్రివేళలో భోజనానికీ, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కూ మధ్య కనీసం 12 నుంచి 13 గంటల వ్యవధి ఇచ్చేవారిలో డయాబెటిస్, ఫ్యాటీలివర్, గుండెజబ్బులు, రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలూ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థకురెస్ట్ ఇస్తే...
‘‘రాత్రి నిద్రపోయే సమయంలో తిండి తినకుండా ఉండటం పెద్ద సమస్య ఏమీ కాదు. ఇక్కడ తిండిని ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకోవాల్సిన అవసరమూ ఉండదు. రాత్రి కనీసం 8 గంటలప్పుడు భోజనం చేసి... మర్నాడు ఉదయం మళ్లీ 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు... ఆటోమేటిగ్గా పన్నెండు గంటల వ్యవధి దొరుకుతుంది. ఈ పన్నెండు గంటల్లో జీర్ణవ్యవస్థ తనకు అవసరమైన విశ్రాంతి పొందుతుంది. ఈ మాత్రం విశ్రాంతి ఇస్తే అది సమర్థంగా పనిచేస్తుంది’’ అంటారు పాటర్‌సన్. అయితే బ్రేక్‌ఫాస్ట్ ను ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పించకూడదు. ‘‘బ్రేక్‌ఫాస్ట్ అంటేనే రాత్రి సుదీర్ఘంగా కొనసాగే ఉపవాసాన్ని (ఫాస్టింగ్‌ను) బ్రేక్ చేసేది అని అర్థం. రాత్రంతా నిద్ర టైమ్‌లో కొనసాగే ఉపవాసంలో ఒకవేళ మెలకువగా ఉన్నా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడమే ఫాస్టింగ్ అంటే’’ అంటూ వివరిస్తున్నారు సాల్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయలాజికల్ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు. బరువు తగ్గడానికి ఉపవాసాలు ఉండటం, డైటింగ్ చేయడమూ అవసరం లేదు. మన భోజన వేళలను కాస్తంత మార్చుకొని, రాత్రంతా తినకుండా ఉంటే చాలు. బరువు తగ్గడానికి ఇది చాలా మంచి మార్గం’’ అంటారు హార్వర్డ్‌కు చెందిన మరో న్యూట్రిషన్ నిపుణుడు ఫ్రాంక్‌షియర్.
ఆరోగ్యకరంగాబరువు తగ్గడానికి కొన్ని సూచనలు!
♦ రోజులో సగం ఉపవాసం ఉండండి. అది నిద్రవేళ అయితే మరీ మంచిది. మీరు తినాలనే టెంప్టేషన్‌కు దూరంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల రోజులో సగం వ్యవధి పాటు మీ జీర్ణవ్యవస్థకు విశ్రాంతి కూడా దొరుకుతుంది.
♦ రాత్రంతా నిద్రలో శరీరానికి భోజనం ఉండదు కాబట్టీ... మళ్లీ రోజును ప్రారంభించగానే దినంలో కావాల్సిన శక్తి (ఎనర్జీ) కోసం బ్రేక్‌ఫాస్ట్‌ను కాస్త ఎక్కువ మొత్తంలోనే తినాలి. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం మామూలుగా ఓ సామాన్యుడి భోజనంలా ఉండాలి. రాత్రి మాత్రం ఒకింత తక్కువే తినడం మంచిది. ఇలా ఉదయం తిండి భారీగా, మధ్యాహ్న భోజనం ఓ మోస్తరుగా... రాత్రి భోజనం మితంగా ఉండటం ఆరోగ్యదాయకం.
♦ రాత్రి మరీ పొద్దుపోయాక భోజనం చేయకండి. కాస్త పెందళాడే భోజనం చేయండి.
♦ రాత్రివేళలో నీళ్లు మాత్రమే తాగండి...
♦ నిద్రవేళల్లో ఒకవేళ మీరు మెలకువతో ఉన్నా ఏమీ తినవద్దు. మంచినీళ్లు మాత్రం తాగుతూ ఉండండి.
♦ ఇలా క్రమబద్ధంగా తింటూ, రాత్రిళ్లు హాయిగా నిద్రపోతూ మీ జీవగడియారాన్నీ, దాంతో అనుసంధానితమైన మీ భోజన జీవగడియారాన్ని సెట్ చేయండి. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీనత్ ఫాతిమాకన్సల్టెంట్ డైటీషియన్,కాంటినెంటల్ హాస్పిటల్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment