గుడ్లు... గోధుమగడ్డికి కాస్తాయట..!
అతి సామాన్య విషయాల గురించి అవగాహన లేకపోవడానికి పరాకాష్ఠ ఇది. మనం రోజూ తినే, వాడే అంశాల గురించి యూత్‌లో ఏ మాత్రం అవగాహన ఉందో పరీక్షించదలచారు లీఫ్ (లింకింగ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫార్మింగ్) అనే ఒక స్వచ్ఛంద సంస్థవారు. ప్రపంచవ్యాప్తంగా యువతలో పర్యావరణ విషయాల గురించి అవగాహన పెంపొందించే పనిలో భాగంగా వీరు చేపట్టిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని 16 - 23 యేళ్ల మధ్య వయసున్న యువతీయువకులతో చేసిన ఈ సర్వే ప్రకారం వారిలో కొందరికి అత్యంత సాధారణ అంశాల గురించి కూడా అవగాహన లేదని తేలిందట. అత్యంత విచిత్రం ఏమిటంటే... ప్రతి పదిమందిలో ఒకరికి కోడిగుడ్డు ఎలా వస్తుందో కూడా తెలియదట. కొందరైతే ‘ఎగ్ గోధుమగడ్డికి కాస్తుంది కదా?’ అని ఎదురు ప్రశ్నించారట! ‘వెన్న’ గురించి అడిగితే... 24 శాతంమంది తమకు తెలియదని స్పష్టం చేశారట! కిచెన్‌లోకి చికెన్ ఎలా వస్తోందంటే... 15 శాతం మంది తమకు అవగాహన లేదన్నారట! రోజూ ఆహారంలో వాడే అంశాల గురించి నగర యువతకు ఉన్న అవగాహన ఇది!