లోటు పాట్లు
బడ్జెట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థమే చాలా మందికి. రూపాయి రాక.. రూపాయి పోక.. హౌస్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ వినే పదాలే గానీ... వస్తే ఎవరికి లాభం... పోతే ఎవరికి నష్టం! ఇంటి ఆదాయ వ్యయాల లెక్కలు తేలక బిజీ లైఫ్‌లో కొట్టుకుపోయే సగటు జీవికి బడ్జెట్‌వల్ల వచ్చేదెంత! పోయేదెంత! ఇవన్నీ బేరీజు వేసుకుంటే తికమకలే తప్ప కన్‌క్లూజన్‌కు వచ్చేదెంతమంది! మరి నేటి విద్యార్థులే రేపటి ఆర్థిక వ్యవస్థకు పునాదులైతే... వారిలో దీనిపై ఉన్న నాలెడ్జ్ ఎంత! ఆసక్తి ఎంత! ఏఎస్‌రావునగర్ ‘అనీష్ కాలేజీ ఆఫ్ కామర్స్’ విద్యార్థులను ఇదే ప్రశ్న వేసింది ‘సిటీ ప్లస్’. అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో కాలేజీకి వచ్చి... కాసిన్ని పాఠాలు వినేసి... ఆపై చిట్‘చాట్’లు, మూవీ మస్తీలతో సాగిపోయే లైఫ్‌లో ‘ఈ బడ్జెట్ ఏంట్రా బాబూ’ అంటారా..! చూద్దాం... వారి థాట్స్.. ఎక్స్‌ప్లనేషన్స్ ఏంటో! లెట్స్ స్టార్ట్ ది డిస్కషన్!
అఖిల్: బడ్జెట్ గురించి చాలామంది విద్యార్థులకు అవగాహన లేదు. ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్‌కి మనకి సంబంధం ఏంటనుకుంటారు.
అనూష: నిజానికి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకే ఎక్కువ.
రామ్: ఈసారి బడ్జెట్ ఎడ్యుకేషన్‌కి సపోర్ట్‌గా ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలనుకుంటే ఆల్కహాల్, సిగరెట్ల ధరలను బాగా పెంచాలి.
అజయ్: ఎంత పెంచినా వాటిని కొనేవారు కొంటూనే ఉంటారు కదా!
ప్రియాంక: నిజానికి బడ్జెట్‌ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలు కాదు... మనమే. మన ఇంట్లో బడ్జెట్‌ని చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే చాలు. దానికి ముందు మన ఇంట్లో బడ్జెట్ గురించి తెలుసుకోవాలి.
అజయ్: కానీ ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు... పిల్లలకు ఇంటి బడ్జెట్‌ల గురించి చెప్పరు.
లక్ష్మీప్రియాంక: తల్లిదండ్రులు చెబితేనే గానీ తెలుసుకోలేని వయసుకాదు కదా మనది. ఇప్పటికే దాదాపుగా అన్నీ తెలిసి ఉండాలి.
రామ్: లేదు... తల్లిదండ్రులు చెబితేనే అప్పు ఎంతో, ఆదాయం ఎంతో తెలుస్తుంది.
సుప్రియ: ఎంత చెప్పినా అబ్బాయిలు తమ ఖర్చుని తగ్గించుకోరు.
వర్ష: అవును... ఇంటి బడ్జెట్ గురించి తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా అమ్మాయిలు అర్థం చేసుకుని మసులుకుంటారు.
వెంకట్: అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
రామ్: అబ్బాయిలు ఖర్చు చేసేది మాత్రం ఎవరి కోసం! (నవ్వుతూ)
అనూష: ఎవరు ఖర్చు చేయమన్నారు? ఇంటి స్థోమతని బట్టి మన బడ్జెట్‌ని కూడా ప్లాన్ చేసుకోవాలి. అమ్మానాన్నల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి.
అర్జున్: ఎంత తగ్గించుకున్నా... జేబులో 500 రూపాయలు లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు. బైక్ మెయింటెనెన్స్, సెల్‌ఫోన్ బిల్, మధ్యాహ్నం భోజనం, మధ్యమధ్యలో ఫ్రెండ్స్ బర్త్‌డేలు...
ప్రియాంక: అదే అమ్మాయిలు బయటికి రావాలంటే బ్యాగులో యాభై రూపాయలుంటే చాలు.
రామ్: అందరూ ఒకేలా ఉండరు కదా! బాగా ఖర్చుపెట్టే అమ్మాయిలూ ఉన్నారు.
కౌండిన్య: ముందు ఇంటి ఖర్చుల గురించి అవగాహన వస్తే మనమెలా ఉండాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలతో ఫైనాన్స్ విషయాలన్నీ డిస్కస్ చేయాలి. లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ల గురించి ఓపెన్ స్టేట్‌మెంట్లు, కామెంట్లు ఎలా ఇస్తామో ఇంటి బడ్జెట్ గురించి కూడా అంతే తేలిగ్గా మాట్లాడేస్తాం.
అనూష: మనమిప్పుడు డిగ్రీ చదువుతున్నాం. ఇంకా తల్లిదండ్రులు కూర్చోబెట్టి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాలని కోరుకోకూడదు. మనమే అడిగి తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అమ్మానాన్నల అనుభవాల మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి.
సుప్రియ: ఎన్ని చెప్పినా ఇంటి బడ్జెట్ గురించి తెలియని పిల్లలు మన దగ్గర డెబ్బైశాతంమంది ఉన్నారు.
వెంకట్: మనం కూడా కష్టపడి సంపాదించిన రోజు బడ్జెట్ ఏంటో బాగా అర్థమవుతుంది.
బాసిర్‌బేగం: ఇట్స్ ట్రూ. నేను పార్ట్‌టైం జాబ్ చేసుకుంటున్నాను. సంపాదన విలువ తెలిసింది. ఖర్చు చేసేముందు భయం వేస్తుంది. ఆ భయం అంతకు ముందు తెలియలేదు.
కౌండిన్య: ఎందుకు అమ్మానాన్నలు పడే ఇబ్బందుల్ని మనం బాగా దగ్గరగా చూసిన రోజున కూడా అలాంటి భయం కలుగుతుంది. అయితే మన కష్టాన్ని ఖర్చు చేసే రోజున ఇంకా బాగా తెలుస్తుంది.
ప్రతిమ: ఏది ఏమైనా మన ఇంటి బడ్జెట్ అయినా, దేశం బడ్జెట్ అయినా మనకు సంబంధించే కాబట్టి... ఖర్చు పెట్టే ముందు ఓ క్షణం తప్పకుండా ఆలోచించాలి. ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలు చేయాలి. ఖర్చును తగ్గించుకునే ప్లాన్స్ వేసుకోవాలి. ... భువన
ఫొటోలు: జి.రాజేష్