ఆదివాసీల గోదారమ్మ
గిరిజనుల జీవనం చెట్టు... పుట్ట... మధ్య ప్రకృతితో ముడివడి ఉంటుంది. దాంతో ఆదివాసీల జీవన విధానంలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. గోదావరి తీరాన నివసించే ఆదివాసీలకూ ఓ ప్రత్యేకమైన జీవనశైలి ఉంది. గోదావరికి ఉన్నట్లే వారి జీవనశైలికీ ఓ ప్రత్యేక స్థానం ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, ప్రధాన్‌లు, కొలామ్‌లు వంటి 14 గిరిజన తెగలున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోభా ఆలయం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఉంది. ఇది గోదావరి తీరానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏటా జాతర సందర్భంగా వారు తమ దైవాన్ని గోదావరి జలంతోనే అభిషేకిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆనవాయితీని తప్పరు. ఏటా జాతరకు ముందు గూడెంలోని వాళ్లు ఒక బృందంగా ఏర్పడి కుండలతో గోదావరి జలం కోసం బయలుదేరుతారు.
ఒక్కొక్కరు ఒక్కో కుండను మోస్తూ వందకిలోమీటర్ల దూరాన్ని కాలినడకనే వెళ్తారు. అయితే ఇక్కడో నిబంధన ఉంటుంది. ఒక ఏడాది వెళ్లిన దారిలో మరో ఏడాది వెళ్లకుండా మార్గాన్ని నిర్ణయించుకుంటారు. గోదావరి నది తీరం నుంచి నాగోబా ఆలయం వరకు ఉన్న ఆదివాసీల గూడేలను కలుపుకుంటూ జలయాత్ర సాగుతుంది. ఏడాదికి కొన్ని గూడేల చొప్పున ఈ జలయాత్రకు మార్గంగా మారతాయన్నమాట. వీరు పుష్కరాల సమయంలో గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేస్తారు.
రాష్ట్రంలో ప్రసిద్ధి!
ఈ నది ఒడ్డునే వారి ఆరాధ్య దైవం పద్మల్ పూరి కాకో (పెద్ద అమ్మమ్మ) అమ్మవారు వెలిసింది. దండేపల్లి మండలంలోని గుడిరేవు వద్ద గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం వరదల తాకిడికి శిథిలమైంది. ప్రస్తుతం పద్మల్ పూరికాకో విగ్రహాలను అక్కడే ఉన్న చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు.
ఏడాదికి రెండు ఉత్సవాలు!
దసరా - దీపావళి పండగల మధ్య రోజుల్లో భారీ ఎత్తున జరిగే ఈ ఉత్సవాలను దండారి ఉత్సవాలుగా వ్యవహరిస్తారు. పుష్య మాసంలో పెర్షాపెన్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలు, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న ఆదివాసీలు కూడా వస్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని నిష్ఠతో కొలుస్తారు. కోళ్లు, మేకలు బలిచ్చి భోజనాలు చేస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా చేసే గుస్సాడి నృత్యాలు అలరిస్తాయి. ఉత్సవాల సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా కొందరు కాకో అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలతో గోదారమ్మను శాంతింప చేయాలని వారి విశ్వాసం.
- పాత బాలప్రసాద్, బ్యూరోఇన్‌చార్జి,
ఫొటోలు: మోదంపురం వెంకటేష్, ఆదిలాబాద్
గోదారమ్మకు శాంతి జేస్తాం...
ఏటా గోదారమ్మకు శాంతి పూజలు జేస్తాం. పుష్కరాల సమయంలో కూడా ఈ పూజలు నిర్వహిస్తాం. స్నానాలు చేస్తాం. అగ్గినిపుకలను అగ్గి ఉండగానే పొడి చేసి, పసుపు, కుంకుమతో పాటు మరో ఏడు రకాల రంగుల పిండితో పట్టు పరుస్తాం. బియ్యం పోసి, తెల్లకోడి, నల్లకోడితో పూజలు చేసి వాటన్నింటిని ఆకులతో చేసిన డొప్పల్లో పెట్టి గోదావరిలో వదులుతాం, అలా గోదారమ్మకు శాంతి చేసి అందరం నదిలో స్నానాలు చేస్తాం. ఆ తర్వాత మా ఆరాధ్య దైవాలకు పూజలు చేస్తాం.
- రాయిసిడాం దాము పటేల్, వందుర్‌గూడ, దండేపల్లి మండలం ఆదిలాబాద్ జిల్లా