‘సర్! మా నాన్నగారిది సహజ మరణం కాదు. హత్యేనని నేను కచ్చితంగా చెప్పగలను’ ఇన్‌స్పెక్టర్ కుమార్‌కు చేతులు జోడించి చెప్పాడు ప్రణీత్. ‘ఏమిటి ప్రణీత్ బాబూ మీరనేది? నీరజ్‌గారు గుండెపోటుతో పోయారని డాక్టర్లు చెబుతుంటే’ ముసలి జావేద్ తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. సీఐ కుమార్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్న పనివాడు యాభయ్యేళ్ల కోటయ్య వంక చూశాడు. ‘కోటయ్యా! నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు కదా... ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. కోటయ్య గొంతు సవరించుకున్నాడు. చెస్ చాంపియన్ల ఖిల్లాగా ఆ పట్టణానికి పేరుంది. ఐదారేళ్ల నుంచి వరుసగా ఆ పట్టణవాసులే రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్ గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుత చాంపియన్ నీరజ్, మాజీ చాంపియన్ సరోజ్ ఆ పట్టణవాసులే. ప్రస్తుత చాంపియన్ నీరజ్ తండ్రి కూడా చదరంగ ప్రవీణుడే. తాతలనాటి పురాతన భవంతిలోనే నీరజ్ నివసిస్తూ ఉంటాడు.
చదరంగమే లోకంగా ఉంటూ ఉద్యోగమేమీ చేయకపోవడంతో అతనికి పెద్దగా ఆదాయం లేదు. నీరజ్‌కు, మరికొందరికీ చిన్ననాటి నుంచి చదరంగం తర్ఫీదు ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దిన జావేద్ ముసలివాడయ్యాడు. కంటిచూపు మందగించినా, ఆటపై మక్కువ చంపుకోలేక రోజూ చదరంగం ఆడటానికి తన శిష్యుడు నీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మాజీ చాంపియన్ సరోజ్, మరికొందరు కూడా నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వస్తూ ఉంటారు. నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వచ్చేవారిలో మదన్, మోహిని ముఖ్యులు. మదన్‌ది జమీందార్ల వంశం. డబ్బుకు, అతిశయానికీ లోటు తక్కువేం లేదు. రాష్ట్రస్థాయిలో అతను చదరంగంలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ పోటీలోనూ విజేతగా నిలవలేదు. మోహిని రాష్ట్రస్థాయి మహిళా చదరంగ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఆ పోటీలో గెలవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది.
కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నీరజ్ చదరంగం ఆడటం తగ్గించాడు. రాత్రి ఎనిమిదిన్నరకు పాములు, తేళ్ల భయంతో ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసి నిద్రిస్తాడు. నీరజ్ భార్య గత ఏడాది మరణించింది. కొడుకు ప్రణీత్ ఆ ఊళ్లోనే బీ టెక్ చదువుతున్నాడు. పనివాడు కోటయ్య వంటచేసి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లిపోతుంటాడు. ‘నిన్న సాయంత్రం ఐదు గంటలకు సరోజ్‌గారు ఇంటికి వచ్చారు. ప్రణీత్ ఇంట్లో లేడు. నీరజ్‌గారి గదిలోకి వెళ్లి సరోజ్ గారు చదరంగం ఆడారు. అప్పుడు అయ్యగారు ఉల్లాసంగానే కనిపించారు’ అన్నాడు కోటయ్య. ‘నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. ఏడు నిమిషాల్లోనే నీరజ్‌పై గెలిచాను. ఆ శుభవార్త బయటనే వెయిట్ చేస్తూ ఉన్న మోహినికి చెప్పి ఆనందంగా వెళ్లిపోయాను’ అన్నాడు సరోజ్. ఇన్‌స్పెక్టర్ కుమార్ మోహిని వంక చూశాడు. ‘ఔను! సరోజ్ ముఖం గెలుపు ఆనందంతో మతాబాలాగా వెలుగుతోందప్పుడు. నా కాన్ఫిడెన్స్ కొద్దీ బ్లైండ్‌ఫోల్డ్‌గా ఆడతానని నిన్ననే నీరజ్‌గారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకున్నా. కళ్లకు గంతలు కట్టుకుని ఆయనతో చదరంగం ఆడాను’ చెప్పింది మోహిని.
‘మరి గెలిచారా?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘లేదు. కానీ గెలిచినంత పని చేశా. నన్ను నిలువరించడానికి నీరజ్‌గారు ఇరవై నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. చివరికెలాగో నన్ను ఓడించారు’ చెప్పింది మోహిని. ‘సాయంత్రం ఐదు నలభైకి నీరజ్‌గారు ఎందుకో గట్టిగా కేక పెట్టారు. బయట తోటలో ఉన్న నేను పరుగున ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు సార్ మదన్‌గారితో గేమ్ ఆడుతున్నారు. ఏదో వస్తువు కిందపడ్డట్లు అనిపించింది’ అన్నాడు కోటయ్య. ‘టేబుల్ మీద ఉన్న నా లెదర్ బ్యాగ్ కింద పడిందంతే. కోటయ్యను కాఫీ తీసుకు రమ్మని చెప్పారు నీరజ్ గారు. ఎందుకో ఆయన భయపడినట్లు అనిపించింది’ చెప్పాడు మదన్. ‘మరి ఆట ముగిశాక మీరు వెళ్లిపోయారా?’ ‘లేదు. ఎందుకో నీరజ్‌గారు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయన పక్కనే ఉన్న చెయిర్లో కూర్చున్నాను. ఇంతలో జావేద్‌గారు లోనికి వచ్చారు’ అన్నాడు మదన్.
‘నేను గదిలోకి వచ్చేసరికి బెడ్‌లైట్ వెలుగుతోంది. ఆట మొదలెడదామా అని నేను అడిగే సరికి సరేనన్నాడు నీరజ్. మదన్‌గారు పక్కనే కుర్చీలో ఉన్నారు. కోటయ్య వచ్చి మా ముగ్గురికీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఐదు నిమిషాల్లోనే నేను గెలిచాను. ఆ ఆనందంతో నీరజ్‌తో కరచాలనం చేసి వెళ్లిపోయాను’ చెప్పాడు జావేద్. ‘ఆ తర్వాత మదన్‌గారు వెళ్లిపోయారు. నేను గదిలోకి వెళ్లి చూసే సరికి మూడు కప్పుల్లో కాఫీ అలాగే ఉంది. కప్పులు తీసుకుని వెళ్లిపోయాను. పది నిమిషాల తర్వాత ఏదో అనుమానం వచ్చి నీరజ్‌గారి గదిలోకి వెళ్లి పిలిస్తే పలకలేదు. శరీరంలో చలనం లేదు. భయంతో డాక్టర్‌గారికి, ప్రణీత్‌కు ఫోన్ చేశాను’ అన్నాడు కోటయ్య. ఇన్‌స్పెక్టర్ కుమార్‌కు మరుసటి రోజు ఏదో అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ప్రణీత్. చదరంగంలో రాష్ట్ర చాంపియన్‌గా నీరజ్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్‌తో వచ్చి దర్యాప్తు చేశాడు కుమార్.
డాక్టర్‌తోను, ముందురోజు నీరజ్‌తో చదరంగం ఆడిన నలుగురితోనూ మాట్లాడాడు. ‘నాకు అర్జెంట్‌గా విజయవాడలో పని ఉంది. నేను వెళ్లి సాయంత్రం నాలుగింటికి తిరిగొస్తాను’ అన్నాడు మదన్. మిగిలిన ముగ్గురూ కూడా తమకేదో పని ఉందంటూ చెప్పారు. ఇన్‌స్పెక్టర్ కుమార్ ప్రణీత్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. సరే, మీరందరూ మీ మీ పనులు చూసుకొని రండి. సాయంత్రం ఐదింటికి మళ్లీ మనం ఇక్కడే కలుద్దాం. నీరజ్‌ది సహజ మరణమే అనిపిస్తోంది’ అన్నాడు. నలుగురూ బయటకు వెళ్లిపోయారు. కుమార్ తనతో వచ్చిన కానిస్టేబుల్స్‌కు పనులు పురమాయించాడు. ‘మిస్టర్ మదన్! మీరు నీరజ్ మరణానికి కారకులయ్యారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అన్నాడు కుమార్. మదన్ ముఖం కళ తప్పింది. ‘సార్! ఇది అన్యాయం. నీరజ్‌గారు గుండెపోటుతో మరణించారని డాక్టర్లే చెప్పారు’అన్నాడు ఆవేశంగా. ‘కావచ్చు. కానీ గుండెపోటు వచ్చేలా చేసింది నువ్వే’ అన్నాడు కుమార్. ‘ఇది చాలా అన్యాయం సార్’ దీనంగా అన్నాడు మదన్.
‘నిన్ను అరెస్టు చేయడానికి ఈ రుజువు చాలు’ అని కుమార్ ఒక చిన్న టేప్‌రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అందులో మదన్, నీరజ్‌ల సంభాషణ ఉంది. ‘ఆ రోజు సాయంత్రం నీరజ్ ఎప్పటిలాగానే చదరంగం ఆడటానికి తన గదిలో కూర్చున్నాడు. ముందు వచ్చిన సరోజ్ బాగా ఆడి గెలిచి సంతోషంగా వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన మోహిని కళ్లకు రిబ్బన్ కట్టుకుని బ్లైండ్‌ఫోల్డ్ గేమ్ ఆడింది. ఆమెకు తెలియడం కోసం నీరజ్ ఆమె, తాను వేసే ప్రతి ఎత్తునూ గట్టిగా బయటకు చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆట తర్వాత వివాదాలు రాకుండా రికార్డు ఆన్ చేయడం ఆయనకు అలవాటు. మోహినితో ఆట పూర్తయ్యాక టేప్ రికార్డర్ ఆఫ్ చేయడం మరచి, అలాగే ఉంచేశాడు నీరజ్.తర్వాత వచ్చిన మదన్‌కు రాష్ట్ర చాంపియన్ కావాలని తగని కోరిక ఉంది. ఎలాగైనా నీరజ్‌ను అంతమొందిస్తే సరోజ్‌ను డబ్బుతో కొనవచ్చని, అలా ఇద్దరు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవచ్చని పథకం వేశాడు.
నీరజ్ గుండెజబ్బు మనిషని మదన్‌కు తెలుసు. అందుకే సరోజ్‌తో ఘోరంగా ఓడావని, మోహిని బ్లైండ్‌ఫోల్డ్ ఆడినా ఓడినంత పనైందని నీరజ్‌ను రెచ్చగొట్టాడు. తర్వాత తనతో తెచ్చిన బొమ్మ పామును జేబులోంచి తీసి నీరజ్ కాలిపై వేసి ‘పాము... పాము’ అని చిన్నగా అరిచాడు. దాంతో షాక్ తిన్న నీరజ్ గుండెపోటుకు గురై మరణించాడు. అదంతా టేప్‌రికార్డర్‌లో రికార్డయింది. మదన్ ఇల్లు శోధిస్తే ఆ బొమ్మ పాము దొరికింది. పథకం ప్రకారం మదన్ నీరజ్ శవాన్ని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను నీరజ్ కుర్చీలో కూర్చున్నాడు. మదన్‌కు మిమిక్రీ వచ్చు. ట్యూబ్‌లైట్ ఆఫ్ చేసి, గదిలో బెడ్‌లైట్ వేశాడు. గదిలోకి వచ్చిన కోటయ్యకు కాఫీ తెమ్మని నీరజ్ గొంతుతో చెప్పాడు. తర్వాత జావేద్ వచ్చాడు. కంటిచూపు బాగులేని జావేద్ బెడ్‌లైట్ వెలుతురులో మదన్‌నే నీరజ్ అనుకున్నాడు. జావేద్‌తో ఆట ఓడిపోయి, నీరజ్ గొంతుతో అతన్ని అభినందించాడు. జావేద్ వెళ్లగానే నీరజ్‌ను అతని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు మదన్.’ అని ముగించాడు కుమార్. మదన్ తలదించుకుని పోలీసులకు లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment