బ్రాండ్ తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక బ్రాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ పండ్లు, కూరగాయలు, అల్లం, కల్తీలేని కారం, పసుపు తదితరాలను ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ)ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారులు త్వరలో ఈ కార్పొరేషన్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసి ఫైలును సీఎం ఆమోదానికి పంపించనున్నారు. ఈ బాధ్యతను ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎ.మురళికి అప్పగించారు. ఉద్యానశాఖ చేసిన ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఏడాదిలో కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి.
ఈ కార్పొరేషన్ ద్వారా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, కారం, అల్లం, పసుపు సహా ఇతర పదార్థాలను సేకరించేందుకు మండలాల్లో రూ.100 కోట్లతో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. మరో రూ. 100 కోట్లతో మెదక్ జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఫుడ్ పార్కును, ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మేలురకం పండ్లు, కూరగాయలు సహా ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ విక్రయ కేంద్రాల్లో విజయ నూనె, పాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే అంశం కూడా సర్కారు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం!
కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. వైస్ చైర్మన్‌గా వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరిస్తారు. వీరితోపాటు మరో 9 మంది డెరైక్టర్లు ఉంటారు. సేంద్రియ పద్ధతిలో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, అల్లం, కారం, ఇతర సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, రవాణా, ప్రాసెసింగ్, అదనపు ఉత్పత్తుల బాధ్యతను కార్పొరేషన్ తీసుకుంటుంది. కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, రాష్ట్ర అవసరాలకు పోను దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేసే లక్ష్యంతో కార్పొరేషన్ పనిచేస్తుంది.