‘ఒంటరి మహిళ’కు నోఎంట్రీ! | Bitter experience to the Singapore Actress | Sakshi
Sakshi News home page

‘ఒంటరి మహిళ’కు నోఎంట్రీ!

Published Tue, Jun 27 2017 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 9:13 PM

‘ఒంటరి మహిళ’కు నోఎంట్రీ! - Sakshi

‘ఒంటరి మహిళ’కు నోఎంట్రీ!

హైదరాబాద్‌లోని దక్కన్‌ హోటల్‌లో సింగపూర్‌ నటికి చేదు అనుభవం
 
‘చేతిలో పెద్ద లగేజ్‌ బ్యాగ్‌. ప్రయాణ బడలిక. అర్ధగంట నుంచి హోటల్‌ బయట నిరీక్షణ. గది కంటే వీధులే సురక్షితమని హోటల్‌ యాజమాన్యం భావించి ఉంటుంది’
 
‘ఒంటరి మహిళ’అనే కారణంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న గదిలో బస చేయడానికి అనుమతివ్వని నగరంలోని దక్కన్‌ హోటల్‌ వైఖరిని నిరసిస్తూ సింగపూర్‌కు చెందిన నటి నుపూర్‌ సారస్వత్‌ (23) తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పెట్టిన పోస్టింగ్‌ ఇది. ఈ లింగ వివక్షపై నెటిజనులు తీవ్రంగా స్పందించారు. నుపూర్‌కు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా సోషలిస్టులు హోటల్‌ వైఖరిని తూర్పారబట్టారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో చోటు చేసుకుందీ ఘటన! 
 
హైదరాబాద్‌: సింగపూర్‌కు చెందిన నటి నుపూర్‌ సారస్వత్‌ ప్రస్తుతం భారత్‌లోని వివిధ ప్రాంతా ల్లో పర్యటిస్తున్నారు.  ఆమె శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడకు రావడానికి ముందే ఆన్‌లైన్‌లో గోఐబిబో ద్వారా ఎర్రగడ్డలోని దక్కన్‌ హోటల్‌లో ఓ గదిని బుక్‌ చేసుకున్నారు. నగరానికి వచ్చిన నుపూర్‌ నేరుగా తన లగేజీతో ఆ హోటల్‌కు వెళ్లారు. అయితే ఆమె అవివాహితని, ఒంటరిగా వచ్చిన మహిళని తెలు సుకున్న హోటల్‌ యాజమాన్యం ‘చెక్‌ఇన్‌’కు అంగీకరించలేదు. తమ హోటల్‌ పాలసీ ప్రకారం స్థానికులు, అవివాహితులైన జంటలతో పాటు ఒంటరి మహిళలకు బస చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పింది. దీంతో ఆమె చాలాసేపు ఆ హోటల్‌ బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నటి గోఐబిబో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ... గోఐబిబో క్షమాపణలు చెప్పింది. మరో హోటల్‌ లో బస ఏర్పాటు చేసింది. దీంతో సారస్వత్‌ దక్కన్‌ హోటల్‌ నుంచి సదరు హోటల్‌కు వెళ్లారు. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేదన... 
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని సారస్వత్‌ తన ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజనులు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది మహిళల పట్ల వివక్ష, వారి హక్కులను కాలరాయడమేనంటూ హోటల్‌ తీరును తప్పుపట్టారు. మరోవైపు నుపూర్‌కు జరిగిన అవమానాన్ని గోఐబిబో తీవ్రంగా పరిగణించి... తమ ఆన్‌లైన్‌ సర్వీసుల జాబితా నుంచి దక్కన్‌ హోటల్‌ను తొలగించింది. అయితే ఈ నిర్ణయాన్నీ ఫేస్‌బుక్‌ ద్వారా తప్పు బట్టిన సారస్వత్‌... తన ఉద్దేశం అది కాదని, ఇకపై ఇలాంటి ఆన్‌లైన్‌ సర్వీసు సంస్థలు తమ యాప్స్‌లో మరిన్ని ఫిల్టర్స్‌ పెట్టాలని, ఒంటరి మహిళలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 
 
అవమానించే ఉద్దేశం లేదు
హోటల్‌ పాలసీ, నిబంధనల మేరకు వ్యవహరించాం. నుపూర్‌ బస చేయడానికి అంగీకరించన్పటికీ ఆమె రిఫ్రెష్‌ కావడానికి కొద్దిసేపు గది వాడుకోనిచ్చాం. ఎర్రగడ్డ ప్రాంతం ఒంటరిగా వచ్చే మహిళలకు క్షేమకరం కాదనే ఉద్దేశంతోనే ‘ఒంటరి మహిళల’నిబంధన అమలు చేస్తున్నాం. మాకు ఎవరిని అవమానించే ఉద్దేశం లేదు. ఈ వివరాలన్నీ మా వెబ్‌సైట్‌లో పేర్కొన్నాం.
– గణేష్, దక్కన్‌ హోటల్‌ మేనేజర్‌ 
 
అలాంటి నిర్ణయమేదీ లేదు
ఒంటరి మహిళలకు హోటల్, లాడ్జిల్లో గదులు కేటాయించకూడదనే నిబంధన ఏదీ లేదు. దక్కన్‌ హోటల్‌ ఓ చిన్న సంస్థ. సరైన భద్రతా ప్రమాణాలు లేవనే ఉద్దేశంతోనే వారు నుపూర్‌కు గది కేటాయించి ఉండకపోవచ్చు. దీనిపై విచారణ జరుపుతాం.
– వెంకట్‌రెడ్డి, తెలంగాణ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement