బావర్చి హోటల్‌పై కేసు
హైదరాబాద్: మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పేరు ఏదైనా లొట్టలు వేస్తూ తింటుంటాం. కానీ నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పలు హోటళ్లు, రెస్టారెంట్లు నగరంలో ఉన్నాయని ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత సోమవారం నుంచి ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు ఎల్బీనగర్ చింతల్‌కుంటలోని బావర్చి హోటల్‌పై కేసు నమోదు చేశారు.
ఈ హోటల్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించని మాంసకృతుల వంటకాలను సీజ్ చేశారు. అధికారులు రూ. 15 వేలు జరిమాన విధించడంతో పాటు హోటల్ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎల్బీనగర్ ఉప కమిషనర్ పంకజా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా గౌరీలతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు హోటళ్లలో మాంసంగా వినియోగించేందుకు వీల్లేని రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తున్నారని.. మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ గ్రేటర్ వాసులను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.