ప్రకృతి వైపరీత్యానికీ పరిహారం చెల్లించాల్సిందే! | Compensation must pay to Natural disasters Victims | Sakshi
Sakshi News home page

ప్రకృతి వైపరీత్యానికీ పరిహారం చెల్లించాల్సిందే!

Published Tue, Jan 3 2017 4:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

Compensation must pay to Natural disasters Victims

రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్‌ తీర్పు

సాక్షి, హైదరాబాద్‌:
విపత్తులతో సంభవించే నష్టానికి కూడా పరిహారం వచ్చేలా ప్రీమియం చెల్లించినప్పుడు.. వర్షంతో దెబ్బతిన్న నిర్మాణాలకు సదరు బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్‌ తేల్చిచెప్పింది. సోమవారం ఈ మేరకు కర్ణాటకకు చెందిన కోర్‌గ్రీన్‌ షుగర్స్‌ అండ్‌ ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి రూ.56,90,848 చెల్లించాలని హైదరాబాద్‌కు చెందిన యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని ఆదేశిస్తూ జస్టిస్‌ బీఎన్‌ రావు నల్లా, సభ్యుడు పాటిల్‌ విఠల్‌రావుల నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. 2010 డిసెంబర్‌ నుంచి 9 శాతం వడ్డీతో 4 వారాల్లో ఈ డబ్బు చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.

కర్ణాటకలోని యాద్‌గిర్‌ జిల్లా తుముకూరు ప్రాంతంలో 350 ఎకరాల్లో రూ.250 కోట్లతో కోర్‌గ్రీన్‌ షుగర్స్‌ అండ్‌ ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేయాలని సంస్థ యజమానులు నిర్ణయించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా పరిహారం చెల్లించేలా రూ.2.5 కోట్లకు బీమా చేస్తూ 2009 నవంబర్‌ నుంచి 2011 ఏప్రిల్‌ 30 వరకు ప్రీమియంగా రూ.9.65 లక్షలు చెల్లించారు. పనుల్లో భాగంగా మొలాసిస్‌ ట్యాంకుల నిర్మాణ బాధ్యతలను చెన్నైకి చెందిన ఏసియా ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించగా మొదటి ట్యాంకు నిర్మాణం పూర్తి చేసింది. అయితే రెండో ట్యాంకు నిర్మాణం సమయంలో 2010 అక్టోబర్‌లో వచ్చిన వర్షాలతో 60 శాతం పూర్తయిన ట్యాంకు పనులు దెబ్బతిన్నాయి. దీనికి పరిహారం చెల్లించాలని కోరగా నిర్మాణం సరిగా చేయలేదంటూ ఇన్సూరెన్స్‌ సంస్థ తిరస్కరించింది. దీంతో కోర్‌గ్రీన్‌ సంస్థ తమకు రూ.94.65 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement