అప్పుచేసి కొన్న కెమెరా.. అందల మెక్కించింది.. | Did not a loan and bought a camera | Sakshi
Sakshi News home page

అప్పుచేసి కొన్న కెమెరా.. అందల మెక్కించింది..

Published Wed, Aug 12 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

అప్పుచేసి కొన్న కెమెరా.. అందల మెక్కించింది..

అప్పుచేసి కొన్న కెమెరా.. అందల మెక్కించింది..

నాన్న రైల్వేలో చిరుద్యోగి. ప్రభుత్వ బడిలో చదువు ఒంటపట్టలేదు. మరి ఆ కుర్రాడు ఏం చేశాడు? స్టడీస్‌లో రాణించలేకపోయినా స్టడీ కామ్‌తో రాణించాడు. ఇంటర్ దాటలేకపోయినా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మెచ్చిన ఫొటోగ్రాఫర్ అయ్యాడు. ఒకనాడు అప్పు చేసి కెమెరా కొన్న ఈ మల్కాజిగిరి యంగ్‌స్టర్... ఇప్పుడు సిటీ నుంచి ముంబయికి తరచూ రాకపోకలు జరిపే టాప్ లెవల్ యాడ్ మేకర్. మనవాళ్లు యాడ్ డెరైక్టర్ల కోసం ముంబయి బాట పడుతుంటే.. ముంబయిలోనూ ఆఫీసు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన రాజేష్ జర్నీ గురించి తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
 - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
‘మల్కాజిగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను సర్. మా ఇంట్లో, చుట్టాల్లో అందరూ మంచిగ చదువుకున్నోళ్లే. మనకే అబ్బలేదు’ అంటూ నవ్వేశాడు రాజేష్ వలబోజు. అయితే అబ్బని చదువు ఇంట గెలిపించలేకపోయినా, అబ్బిన ఫొటోగ్రఫీ రచ్చ గెలిపించింది. హైదరాబాద్ నుంచి దేశీయంగా సక్సెసైన అతి తక్కువ మంది యాడ్ ఫిలిం మేకర్స్‌లో ఈ యువకుడిని ఒకడిగా నిలిపింది.
 
 అప్పు తప్పన్నా.. వినలేదు..

 ‘చిన్నప్పటి నుంచి ఫొటోలంటే చాలా ఇష్టం. తెలిసిన వారి ఇంట్లో ఏ శుభకార్యమైనా ఫొటో ఆల్బమ్స్ చూసినవే చూస్తుండేంత ఇష్టం. టీనేజ్‌లో ఫ్రెండ్స్ అంతా ఫొటోలు దిగాలని ఉబలాటపడుతుంటే నేను తీయాలని ఆరాట పడేవాడ్ని. ఆ ఇష్టమే నన్ను అధిక వడ్డీకి రూ.5వేలు అప్పుచేసి కెమెరా కొనేలా చేసింది’ అంటూ గుర్తు చేసుకున్న రాజేష్.. ఆ సమయంలో ఇంట్లోవాళ్లు తనని వారించినా వినలేదని, చాన్నాళ్లు ఆ మొత్తానికి వడ్డీ కడుతూ వచ్చి ఒక పెళ్లి ఆర్డర్ రావడంతో ఆ అప్పు తీర్చేశానని చెప్పాడు. కెమెరా పనితనంతో చుట్టాలు, బంధువుల్లో కాస్త పేరు రావడం, వేడుకల ఆర్డర్స్ రావడం ఫొటోగ్రాఫర్‌గా రాజేష్‌ని బిజీగా మార్చాయి.  
 
మెరుగులద్దిన మోడలింగ్..

‘రెండు దశాబ్దాల క్రితం.. అప్పట్లో హైదరాబాద్ ఫ్యాషన్ రంగం స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. అప్పట్లోనే నా స్నేహితుల్లో కొంత మంది అందమైన యువతీ యువకులు మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఉపకరించింది. మోడల్స్‌కి పోర్ట్ ఫోలియోలు తయారు చేసే ఫొటోగ్రాఫర్‌గా నగరంలో పేరొచ్చేలా చేసింది’ అని చెప్పిన రాజేష్... ప్రస్తుత సిటీ టాప్ మోడల్స్ చాలా మందికి తొలి దశలో ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్‌గా ఘనత దక్కించుకున్నాడు. మోడల్స్ షూట్స్‌ను అనుసరిస్తూ కొన్నేళ్లలోనే యాడ్ షూట్స్ అవకాశాలు రాజేష్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. నగరంలో పేరొందిన బ్రాండ్స్ తమ ప్రకటనల కోసం అవసరమైన ఫొటోలను తీసేందుకు రాజేష్‌ని ఎంచుకున్నాయి. ‘తొలి రోజుల్లో నా ఫొటోలు పెద్ద పెద్ద హోర్డింగ్స్ మీద కనబడుతున్నప్పుడు పొందిన ఆనందం, అవి మా పేరెంట్స్‌కి బంధు మిత్రులకి  చూపించి మురిసిపోయిన సంతోషం ఇప్పటికీ మరచిపోలేను’అంటాడు రాజేష్.
 
 యాడ్ ఫిలిం మేకర్‌గా..
 ఫొటోగ్రాఫర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఏడెనిమిదేళ్ల తర్వాత... తొలి యాడ్ ఫిలిం అవకాశం రాజేష్‌కు లభించింది. దానికి ప్రశంసలు రావడంతో అతనికి అక్కడి నుంచి వెనుదిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి పాన్ అమెరికా బ్రాండ్ వరకూ, భారతి సిమెంట్, చెన్నై సిల్క్స్, కళామందిర్, నీరూస్... వంటి అందరికీ తెలిసినవే కాకుండా అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు సైతం వర్క్ చేశాడు రాజేష్. ‘తొలుత సిటీలోని వెస్ట్ మారేడ్‌పల్లి, యూసఫ్‌గూడల్లో స్టూడియో నిర్వహించాను. పెద్ద బ్రాండ్స్ వర్క్ ఎక్కువ కావడంతో అడ్వర్టయిజింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబయిలోనూ మా ఎస్‌ఎల్‌ఎన్ స్టూడియో మెయిన్ ఆఫీస్‌ను పదేళ్ల క్రితం ప్రారంభించాం. ఇప్పటికి 50 వరకు యాడ్ కమర్షియల్స్ రూపొందించాం.

ఇండియా, ఇంటర్నేషనల్ స్థాయిలో దాదాపు 100 మంది మోడల్స్‌ని నా కెమెరా షూట్ చేసింది. మా ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, డెరైక్టర్స్, విఎఫ్‌ఎక్స్-ఆర్టిస్ట్స్... ఇలా రెగ్యులర్‌గా 15 మంది.. వర్క్ ఉన్నప్పుడు ఒక్కోసారి 100 మంది వరకూ నా ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. టీవీ కమర్షియల్స్, కార్పొరేట్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్...6 వంటివన్నీ రూపొందించగల సత్తా మా టీమ్‌కు ఉంది’ అంటూ సగర్వంగా చెప్పాడు రాజేష్. పరిసరాలే పాఠ్యాంశాలుగా, అందివచ్చిన అవకాశమే పరీక్షగా, అనుభవమే శిక్షణగా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న ఈ సిటీ ఫొటోగ్రాఫర్.. ఏనాటికైనా భారీ బడ్జెట్‌తో రూపొందే బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించడమే తన జీవితాశయం అంటున్నాడు. తోటి నగరవాసులమై అతడి ఆశ నెరవేరాలని కోరుకోకుండా ఎలా ఉంటాం.. ఆల్ ది బెస్ట్ టూ యూ రాజేష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement