ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
- పార్టీ పటిష్టతపై దృష్టి
- వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని పార్టీ జిల్లాల అధ్యక్షులు, మహిళా, రైతు, విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షుల సమావేశం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. మహిళా, రైతు, విద్యార్థి, యువజన విభాగాలు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉన్నప్పుడే పార్టీ మరింత క్రియాశీలంగా ఉండగలుగుతుందని, అందుకే వీటి పటిష్టతపై ప్రధానంగా దృష్టి సారించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 17న జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయకర్తల సమావేశంలో నొక్కి చెప్పారు.
ఆ క్రమంలోనే శనివారం ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాదరాజు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. జిల్లాలవారీగా సమీక్షించారు. పార్టీ పోరాటాల్లో అనుబంధ సంఘాల పాత్ర కీలకమైంది కనుక.. వీటి కమిటీల నియామకాల్లో కష్టపడి పనిచేసేవారినే ఎంపిక చేయాలని నేతలు సూచించారు. స్థానికంగా ఉండే సమస్యలను గుర్తించి పోరాటాలు చేయాలని అభిప్రాయపడ్డారు. రైతు, మహిళ, యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఆర్.కె.రోజా, జక్కంపూడి రాజా, మహ్మద్ సలాంబాబు పాల్గొన్నారు.