- వాహనదారుల కోసం ‘ఎం-వ్యాలెట్’ యాప్
చాంద్రాయణగుట్ట : వాహనాలు నడిపేవారు ఇకపై లైసెన్స్, ఆర్.సి.లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాల్సిన పని లేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి.లు మరచిపోయినా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ.. వాహనదారుల సౌకర్యార్థం నూతనంగా ఎం-వ్యాలెట్ (మొబైల్ వ్యాలెట్) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను రెండు రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
లైసెన్స్ వివరాల నమోదిలా...
స్మార్ట్ ఫోన్‌లో మొదటగా ప్లే-స్టోర్‌లోకి వెళ్లి ఎం-వ్యాలెట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో లైసెన్స్ నమోదు కోసం మొదటగా లైసెన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. తదనంతరం లైసెన్స్ ఏ ప్రాంతంలోని ఆర్టీఏ కార్యాలయంలో తీసుకున్నామో ఆ కార్యాలయ ప్రాంతం పేరు రాయాల్సి ఉంటుంది. అవి ఎంటర్ చేయగానే ఆర్టీఏ అధికారులు జారీ చేసిన స్మార్ట్ కాపీ వస్తుంది. ఆ స్మార్ట్ కాపీని ఒక్కసారి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. పోలీసులు, రవాణ శాఖ అధికారులకు ఆ స్మార్ట్ కాపీని చూపిస్తే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆర్.సి. నమోదు చేసుకోండిలా..
ఆర్.సి. కి సంబంధించి కూడా ఎం-వ్యాలెట్ యాప్‌లో రిజిస్ట్రేషన్ సంఖ్యను మొదటగా నమోదు చేయాలి. అనంతరం వాహనం చాసిస్‌కు సంబంధించిన చివరి ఐదు నంబర్లను నమోదు చేయగానే ఆర్.సి. స్మార్ట్ కాపీ వస్తుంది. లైసెన్స్ మాదిరిగానే ఆర్.సి.స్మార్ట్ కాపీని కూడా గ్యాలరీలో సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
లైసెన్స్, ఆర్‌సీ బదులు స్మార్ట్‌ఫోన్ చాలు
Published Fri, Apr 1 2016 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement