‘ఆ దంపతులను అరెస్ట్ చేయండి’
బంజారాహిల్స్: తనను మోసగించిన కేసులో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.విద్యాసాగర్, ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రత్నప్రభలను వెంటనే అరెస్టు చేయాలని బి.వత్సల డిమాండ్ చేశారు. ఈ దంపతుల తీరుపై ఇటీవల ఆమె కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు ఈ ఇద్దరు అధికారులతో పాటు మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు, పాటిబండ్ల ఆనందరావు, కృపాకర్ మాదిగ, జూపాక సుభద్ర, గోగు శ్యామల తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వత్సలను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం పిలిపించారు. పోలీసుల ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
విద్యాసాగర్, రత్నప్రభలను అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి పోలీసులు సహకరిస్తే వారిపైనా కేసు పెడతానని హెచ్చరించారు. తనకు విద్యాసాగర్ నుంచి ప్రాణ హాని ఉంద న్నారు. భయం భయంగా బతుకుతున్నానని... రోజుకోచోట తల దాచుకుంటున్నానని చెప్పారు. రత్నప్రభకు విడాకులు ఇచ్చానని నమ్మించిన విద్యాసాగర్ తనను పెళ్లి చేసుకున్నాడని... 2007 నుంచి 2011 వరకు తాము కలిసే ఉన్నామని పేర్కొన్నారు. తాము భార్యాభర్తలమనే ఆధారాలను తాను లేని సమయంలో విద్యాసాగర్ కాల్చేశాడని ఆరోపించారు. తాను ఆయన భార్యనేనని రుజువు చేసే ఆధారాలను పోలీసులకు ఇచ్చానని పేర్కొన్నారు.