రత్నప్రభకు హైకోర్టులో ఊరట
ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రహేజా సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. రత్నప్రభకు ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
రహేజా సంస్థకు జరిపిన భూ కేటాయింపుల్లో ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.55 శాతానికి తగ్గించారని, అధికారుల చర్య వల్ల ప్రభుత్వానికి రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ న్యాయవాది శ్రీరంగారావు ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, రత్నప్రభ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఐపీఎస్ అధికారి గోపికృష్ణ, రహేజా సంస్థ ఎండీ నీల్ రహేజా తదితరులకు గత నెల 30న ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫిబ్రవరి 12న కోర్టు ఎదుట హాజరు కావాలని పేర్కొంది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రత్నప్రభ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. 2014 సెప్టెంబర్‌లో ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ కేసును 2014 అక్టోబర్‌లో మూసేసిందని, ఈ కేసుతో రత్నప్రభకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లతో పాటు, తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.