ఉగాదికి మెట్రో పరుగులు డౌటేనా?
వచ్చే ఉగాది నాటికల్లా హైదరాబాద్ పౌరులకు మెట్రోరైలు ప్రయాణ సౌకర్యం అందించేస్తామంటూ ఇన్నాళ్లుగా చేసిన ప్రకటనలు నీటిమీద రాతల్లాగే మిగిలిపోయేలా ఉన్నాయి. నాగోలు - మెట్టుగూడ మార్గంలో 2015 మార్చి నాటికి తొలి రైలును పరుగులు తీయిస్తామని చెప్పినా.. అప్పుడు మాత్రం అది జరిగేలా లేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మెట్రో చట్టానికి బదులు ట్రామ్‌వేస్ చట్టం కింద అమలుచేస్తోంది. దీనివల్ల భద్రతా సర్టిఫికేషన్ పొందడంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును మెట్రో చట్టం కింద చేపడితే తప్ప భద్రతా సర్టిఫికేషన్ ఇవ్వడానికి కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. బెంగళూరు మెట్రో విషయంలో ఇలాగే జరిగింది.
ట్రామ్‌వేలకు, మెట్రోరైలుకు భద్రతా ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయని, అందువల్ల మెట్రోరైలు ప్రాజెక్టును ట్రామ్‌వేస్ చట్టం కింద చేపట్టడమే తప్పని కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు మెట్రోప్రాజెక్టు సలహాదారుగా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీహరి తెలిపారు. ట్రామ్‌వేస్ చట్టం నుంచి మెట్రో చట్టానికి దీన్ని మార్చాలంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గెజిట్‌లో నోటిఫై చేయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా కనీసం 2 వేల కిలోమీటర్ల టెస్ట్ రన్ నిర్వహించాలి. ఇదంతా జరగకుండా సర్టిఫికేషన్ ఏజెన్సీలు ఇప్పుడు చేస్తున్న టెస్ట్‌రన్‌లను పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా లేదు.
వచ్చే ఉగాదికి మెట్రోరైలు పరుగులు తీయాలంటే ఈ ఏడాది ఆఖరుకల్లా భద్రతా సర్టిఫికేషన్ పూర్తికావాలని, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈలోగా వచ్చే అవకాశం మాత్రం అంతగా లేదని ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.