గ్లామర్ ఫీల్డ్‌కి రాను.. నా లక్ష్యం వేరు..
5.10 అంగుళాలకు పైగా ఎత్తు, తీరైన ఫిజిక్. ముఖవర్ఛస్సు.. వెండి తెరపై వెలిగిపోయే అర్హతలున్న ఓ అచ్చ తెలుగమ్మాయి.. ‘ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్’లో పాల్గొంది. గ్లామర్ రంగం ఆమెకు రెడ్‌కార్పెట్ పరిచేసింది. అయితే, అందరికీ షాక్ ఇస్తూ ఆమె సున్నితంగా నో చెప్పేసింది. ఎందుకలా..? అని ప్రశ్నిస్తే ‘నా లక్ష్యం వేరు’.. అంటోంది అనుపమ సామంతపూడి. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
‘హాయ్... వుయ్ ఆర్ ఫ్రం సాక్షి డైలీ’ అంటూ పరిచయం చేసుకోబోతే... ‘చక్కగా తెలుగులో మాట్లాడుకుందాం. నేను తెలుగమ్మాయినే’ అంటూ నవ్వుతూ మాట కలిపారు అనుపమ. ఆరడుగుల బుల్లెట్‌కి సరిజోడీలా ఉన్న అమ్మాయి నోట తెలుగు పలుకులు విని షాక్ తింటూ జరిపిన ముచ్చట్ల సమాహారం ఆమె మాటల్లోనే..
మిస్ విజయవాడ టు.. మిసెస్ ఇంటర్నేషనల్..
‘మాది విజయవాడ, పాఠశాల చదువు అక్కడి ఎట్కిన్‌సన్ స్కూల్‌లో, కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చేశాను. ఏ రంగంలోనైనా నన్ను నేను నిరూపించుకోవడం అంటే నాకిష్టం. చిన్నప్పటి నుంచి బ్యూటీ పేజెంట్‌ల మీద ఆసక్తి. కాలేజ్ డేస్‌లో ‘మిస్ విజయవాడ 2006’ టైటిల్ గెలిచాను. మిస్ ఇండియాకి వెళ్లాలనుకున్నా. కానీ చదువవగానే అనుకోకుండా పెళ్లైపోయింది. ఆ తర్వాత అమెరికా వెళ్లాను. లాస్ ఏంజెల్స్‌లో కాస్మొటాలజీ కోర్సు చేస్తున్నప్పుడు కాలేజ్ లెవల్ బ్యూటీ టైటిల్ గెలిచాను. రెండేళ్ల క్రితం మా ఫ్యామిలీ హైదరాబాద్‌కి వచ్చేశాం. పెళ్ళైంది... లైఫ్ రొటీన్‌లో పడిపోయింది. ఇక అందాల పోటీల గురించి మర్చిపోయాను. కానీ ఒక ఫ్రెండ్ పదే పదే ఒత్తిడి చేయడం, ప్రోత్సహించడంతో వెళ్లాను. అంతా ఆడిషన్స్ నుంచే టైటిల్ విన్నర్ అవుతానన్నారు. పూనెలో జరిగిన ఫైనల్స్‌లో ‘మిసెస్ ఇండియా ప్లానెట్’ గెలిచాను. ఏమైనా.. ఆ పోటీలో పాల్గొనడం ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్’.
వ్యాపారవేత్తగా రాణించాలి..
‘సినిమా, మోడలింగ్‌లో ప్రవేశించాలని నేను బ్యూటీ పేజెంట్స్‌లో పాల్గొనలేదు. వ్యాపారవేత్తగా రాణించాలనేది నా లక్ష్యం. అందుకే పలు బ్రాండ్స్‌కి మోడల్‌గా ఆఫర్లు వచ్చినా, గ్లామర్ రంగం నుంచి సైతం అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. బ్యూటీ పేజెంట్‌లో పాల్గొనడం అనేది నాలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. నేను కలలుగంటున్న రంగంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు అది ఉపకరిస్తుంది. ప్రస్తుతం గార్మెంట్స్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్. ఫ్యాషన్ కాన్సెప్ట్స్ బ్రాండ్ రన్ చేస్తున్నాం. బ్యూటీ ఫీల్డ్ అంటే అమ్మాయిలు. చాలా ఫాస్ట్‌గా ఉంటారని, పొట్టి దుస్తులకు కేరాఫ్‌లా ఉంటారని అంటూంటారు. అయితే నేను దీన్ని మార్చాలనుకుంటున్నాను. ట్రెడిషనల్‌గా, డీసెంట్‌గా ఉండే అమ్మాయిలు కూడా ఈ రంగంలో రాణించగలరని నిరూపించాలనుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో సోషల్ సర్వీస్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను’.