ఆర్టీసీకి బయోడీజిల్!
* 10% ప్రత్యామ్నాయ ఇంధనం వాడాలని నిర్ణయం
* డీజిల్ ఖర్చును తగ్గించేందుకు కసరత్తు షురూ
* టెండర్లు ఆహ్వానించిన అధికారులు
* ఏటా రూ.30 కోట్లు ఆదా అవుతుందని అంచనా
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో నష్టాలను తగ్గించేందుకు యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సం స్థను ఆదుకునేందుకు గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం చేయాలని రెండు రాష్ట్రప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. దీంతో ఖర్చుకు ముకుతాడు వేయటం ద్వారా నష్టాలను తగ్గిం చాలని నిర్ణయించిన ఆర్టీసీ డీజిల్ వ్యయంపై దృష్టి సా రించింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకంతో ఖర్చును నియంత్రించే దిశగా శ్రీకా రం చుట్టింది. బయోడీజిల్‌ను ఎక్కువగా వాడాలని నిర్ణయించింది. బయోడీజిల్ వాటా కనీసం 10 శాతం ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఇంధనం సరఫరా కు టెండర్లు పిలిచింది. భవిష్యత్తులో బయోడీజిల్ వినియోగాన్ని పెంచి, డీజిల్ ఖర్చును వీలైనంత మేర తగ్గించాలని ఆర్టీసీ భావిస్తోంది.
ఆర్టీసీ ఏటా 50 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. గతేడాదికాలంలో దీనికి రూ.2,367 కోట్లను ఖర్చు చేసింది. ప్రతినెలా డీజిల్‌పై లీట రుకు 50 పైసలు చొప్పున ధర పెరుగుతుండటంతో ప్రతినెలా అదనంగా రూ.400 కోట్ల వర కు ఖర్చు పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో బయోడీజిల్ ధర లీటరుకు రూ.53 నుంచి 56 వరకూ ఉంది. డీజిల్‌తో పోలిస్తే.. ఏడెనిమిది రూపాయలు తక్కువ. డీజిల్ వినియోగాన్ని 10 శాతం మేర తగ్గించి దాని స్థానంలో బయోడీజిల్‌ను వాడితే ఏటా రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్క తేల్చారు. అయితే ఆర్టీసీలో బయోడీజిల్ వినియోగం కొత్తకాదు. 2008లోనే దీన్ని వినియోగించటం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 డిపోల పరిధిలో రెండేళ్లపాటు కొన్ని బస్సుల్లో వాడారు. కానీ అప్పట్లో డీజిల్ కంటే బయోడీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో ఖర్చు పెరిగింది. దీంతో ఆ ప్రయోగం విఫలమైనట్లయింది.