డబ్బుకు లెక్కలేవి? | Send the details of expenses in the last two years | Sakshi
Sakshi News home page

డబ్బుకు లెక్కలేవి?

Published Thu, Apr 14 2016 9:11 AM | Last Updated on Sat, Oct 20 2018 5:49 PM

డబ్బుకు లెక్కలేవి? - Sakshi

డబ్బుకు లెక్కలేవి?

♦ గత రెండేళ్ల ఖర్చుల వివరాలు పంపండి  
♦ ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖకు నీతి ఆయోగ్ లేఖ
♦ అభివృద్ధి, అభివృద్ధేతర, రెవెన్యూ ఖర్చులు తెలపండి
♦ ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల సమాచారం ఇవ్వండి
 
 సాక్షి, హైదరాబాద్: నెలరోజుల కోసం నాన్న ఇచ్చే డబ్బు నాలుగురోజుల్లోనే మాయం చేసి చేయిచాస్తే.. అరాచకంగా ఖర్చు చేస్తున్నట్లు అనుమానం రాదూ? దేనికి ఎంత ఖర్చు చేశావని నిలదీయరా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఇపుడు ఇలానే తయారయ్యింది. తప్పు చేసిన పిల్లాడిలా తలదించుకోవలసి వచ్చింది. కేంద్రం ఇచ్చిన రూ. 850 కోట్లను వ్యయం చేసేశామని, నూతన రాజధాని అమరావతిలో రాజ్‌భవన్, హైకోర్టు నిర్మాణాలకు వెచ్చించేశామని కేంద్రానికి వినియోగపత్రాలను (యుటిలిటీ సర్టిఫికెట్స్) పంపించింది. అంటే దానర్థం ఇచ్చిన డబ్బు ఖర్చు చేసేశాం కాబట్టి మరిన్ని డబ్బులిస్తే ఖర్చు పెట్టుకుంటామని కోరడమే.

అయితే ఏపీసీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ పంపించిన వివరాలను పరిశీలించిన కేంద్రప్రభుత్వం తన వర్గాల ద్వారా స్పష్టమైన సమాచారాన్ని సేకరించింది. దాంతో అసలు రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల వ్యయం ఎలా జరుగుతుందో పరిశీలించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల (2014- 15, 2015- 16)లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల వ్యయానికి సంబంధించిన  వివరాలను పంపాలని నీతి ఆయోగ్ రెండు రోజుల కిందట రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.850 కోట్లను వ్యయం చేసేసినట్లు కేంద్రానికి వినియోగ పత్రాలను సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ పంపించడంతోనే ఈ పరిశీలన వ్యవహారం మొదలైందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

అసలు రాజధానిలో రాజ్‌భవన్, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభమే కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులు వ్యయం చేసేశామని, వినియోగ పత్రాలు పంపించి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. రాజధానిలో ఎక్కడా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను ఇంకా ప్రారంభించలేదని, అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని, అయినా వినియోగ పత్రాలను పంపించడమంటే మనలను మనం మోసం చేసుకోవడమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇచ్చిన నిధులను వ్యయం చేస్తే గానీ తదుపరి నిధులు ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రం  నిధులు వ్యయం చేసినట్లు తప్పుడు పత్రాలను పంపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొం టున్నాయి.

 కేంద్రంపై విమర్శల నేపథ్యంలో...
 అప్పులపాలైన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సరైన సహకారం ఇవ్వడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, విభిన్న హోదాల్లోని టీడీపీ నేతలు ఇటీవల ఆరోపణలు సంధిస్తున్నారు. మెరుగైన సహకారం అందించాలంటున్నారు. దీనికి జవాబుగా బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన ఆర్థిక సహాయాన్ని పలు సందర్భాల్లో గణాంకాలతో వివరిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి గాను నీతి ఆయోగ్ ఇటీవల ప్రధానికి నివేదిక సమర్పించింది. దాన్ని పరిశీలించిన  నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,000 కోట్లు ఇస్తే సరిపోతుందని, అందులో రూ.500 కోట్లను తొలుత విడుదల చేయాలని సూచించారు. ఏయే పనులకు ఎంతెంత వ్యయం చేశారనే సమాచారం రాష్ట్రం నుంచి అందిన తరువాత తక్కిన రూ.500 కోట్లను  విడుదల చేయాలని ప్రధాని స్పష్టం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో అమరావతిలో రాజ్‌భవన్, హైకోర్టు నిర్మాణాలకు రూ.850 కోట్లను వ్యయం చేసినట్లు వినియోగ పత్రాలు పంపించడం ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్రం గుర్తించిందని, ఇది ఏ మలుపు తిరుగుతుందో తెలియడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు.
 
 
 రెండేళ్ల వివరాలు పంపండి..
 గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి (2014-15, 2015-16) పలు రంగాలపై చేసిన ఖర్చుల వివరాలను పంపాల్సిందిగా నీతి ఆయోగ్ రెండు రోజుల  కిందట రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది.  అభివృద్ధి, అభివృద్ధేతర, రెవెన్యూ వ్యయాల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరింది. కేంద్రం పలు రంగాలకు విడుదల చేస్తున్న నిధులను ఆయా రంగాలకు రాష్ట్ర ం వ్యయం చేయడం లేదనే అనుమానాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే గత రెండు ఆర్థిక సంవత్సరాలకు చెందిన రంగాల వారీగా వ్యయాలను పంపాలని ఆర్థిక శాఖను నీతి ఆయోగ్ కోరిందని ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లిస్తోందని, ఈ నేపథ్యంలోనే ఈ వివరాలను నీతి ఆయోగ్ కోరిందని అధికార వర్గాలు అంటున్నాయి.

మౌలిక వసతుల కు ప్రాజెక్టుల వారీగా చేసిన వివరాలను అందచేయాలని, ప్రణాళిక, ప్రణాళికేతర రంగాల వ్యయ వివరాలను పంపించాలని  నీతి ఆయోగ్ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్లించారనే సమాచారం కేంద్రం దగ్గర ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి  వివరాలను నీతి ఆయోగ్ సేకరిస్తోందని అధికార వర్గాలంటున్నాయి.  ప్రణాళిక పద్దులో ఉండే పథకాలను ప్రణాళికేతర పద్దులోకి ఏమేమి మార్చారనే వివరాలను కూడా నీతి ఆయోగ్  కోరింది. గతంలో ప్రణాళికా పద్దులో ఉన్న పథకాలను గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రణాళికేతర పద్దులోకి మార్చారని, రెవెన్యూ వ్యయంగా చూపెడుతున్నారనేది నీతి ఆయోగ్ వాదన. ఈ నేపథ్యంలోనే ప్రణాళికేతర, ప్రణాళిక పద్దు కింద అభివృద్ధి, అభివృద్ధియేతర, రెవెన్యూ వ్యయాల వివరాలను నీతి ఆయోగ్ కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement