హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. న్యాయాధికారుల ఆందోళనపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలన్నారు.
చంద్రబాబు, కేసీఆర్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలేంటో వెల్లడించాలన్నారు. హామీలు నెరవేర్చకుండా రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తెస్తున్నారని కొండా రాఘవరెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల అంశం తెర మీదకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఐదు నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టు ‘తెలంగాణ ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్’ ప్రకటించిన విషయం తెలిసిందే.